మత్స్యకారులకు రెట్టింపు ఆదాయం

Double income for fishermen in Andhra Pradesh - Sakshi

ప్రభుత్వ ప్రోత్సాహం.. సీఎంఎఫ్‌ఆర్‌ఐ సాంకేతిక

మత్స్యకారుల జీవితాల్లో మెరుగుపడుతున్న జీవన ప్రమాణాలు     

ఉభయ గోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల్లో విస్తరిస్తున్న కేజ్‌ కల్చర్‌

సాక్షి, అమరావతి: మత్స్యకారులకు రెట్టింపు ఆదాయమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులు ఫలిస్తున్నాయి. మత్స్యకారులే కాదు.. వివిధ సామాజికవర్గాలకు చెందిన వారు కూడా ప్రభుత్వ ప్రోత్సాహంతో రెట్టింపు ఆదాయం ఆర్జనే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహానికి తోడు కేంద్ర సముద్ర మత్స్య ఉత్పత్తుల పరిశోధన కేంద్రం (సీఎంఎఫ్‌ఆర్‌ఐ) సాంకేతికతను అందిపుచ్చుకుని అద్భుతాలు సృష్టిస్తున్నారు. అతిపెద్ద సముద్ర తీరాన్ని కలిగిన రాష్ట్రంలో సముద్ర సాగును విస్తరించేందుకు అపార అవకాశాలున్నాయని సీఎంఎఫ్‌ఆర్‌ఐ గుర్తించింది. ఆ దిశగా కల్చర్‌ చేయతగ్గ జాతుల సంఖ్య, విత్తనోత్పత్తి పెంపొందించడంతో పాటు ఆదాయం పెరిగేలా సాంకేతికతను జోడిస్తోంది. మెరైన్, మారీ కల్చర్‌లో పరిశోధన, శిక్షణపై ప్రత్యేకదృష్టి సారించింది.

సంప్రదాయ వ్యవసాయ పంటలకు ప్రత్యామ్నాయంగా కేజ్‌ కల్చర్‌ను ప్రోత్సహిస్తోంది. అందుబాటులో ఉన్న ఉప్పునీటి ప్రాంతాల్లో కేజ్‌ కల్చర్‌ ద్వారా ఎక్కువ దిగుబడులను సాధించేలా సాంకేతికను అభివృద్ధి చేసింది. కేజ్‌ కల్చర్‌ ద్వారా ఇండియన్‌ పాంపినో, ఆసియన్‌ సీ బాస్, ఆరంజ్‌ స్పాటెడ్‌ గ్రూపర్‌ వంటి సముద్ర మత్స్య ఉత్పత్తులను ఎస్సీ, గిరిజన సబ్‌ ప్లాన్‌ కార్యక్రమాల ద్వారా మత్స్యకారులతో పాటు భూమిలేని ఆక్వా రైతులకు పరిచయం చేసింది. తక్కువ విస్తీర్ణం, తక్కువ పెట్టుబడితో రైతులకు రెట్టింపు ఆదాయం (డీఎఫ్‌ఐ)పై ప్రత్యేక ప్రొటోకాల్‌ రూపొందించి శిక్షణ ఇస్తోంది. సముద్రపు ఫిష్‌ల కేజ్‌ కల్చర్‌పై సాంకేతిక పరిజ్ఞానం, కేజ్‌ ఫాబ్రికేషన్, ఇన్‌స్టలేషన్‌ సహా కేజ్‌ కల్చర్, దాణా, వ్యాధులు, తెగుళ్లు, ఆర్థిక వనరుల నిర్వహణపై ఇస్తున్న శిక్షణ సత్ఫలితాలనిస్తోంది.

సీఎంఎఫ్‌ఆర్‌ఐ సాంకేతికతతో సముద్ర జలాల్లో చేపల పెంపకం ద్వారా ఉభయ గోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల్లో వేలాది కుటుంబాల జీవనప్రమాణాలు మెరుగుపడుతున్నాయని, గతంతో పోలిస్తే రెట్టింపు ఆదాయం ఆర్జిస్తున్నాయని ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో గుర్తించారు. గతంతో పోలిస్తే భారీగా పెరిగిన ఆదాయంతో వారిలో పొదుపు, కొనుగోలు శక్తిసామర్థ్యాలు పెరిగినట్లు ఆ అధ్యయనంలో తేలింది. ఇప్పుడు సీఎంఎఫ్‌ఆర్‌ఐ అభివృద్ధి చేసిన సాంకేతికతతో తమ రాష్ట్రాల్లో మత్స్యకారుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న సంకల్పంతో తీరప్రాంత రాష్ట్రాలు సీఎంఎఫ్‌ఆర్‌ఐతో కలిసి పనిచేసేందుకు ముందుకొస్తున్నాయి.

అప్పులన్నీ తీర్చేశాం
మాది ఉమ్మడి కుటుంబం. యానాది (ఎస్టీ) తెగకు చెందిన వాళ్లం. చేపలు పట్టడం తప్ప మాకు ఏమీ చేతకాదు. ఇంటిల్లపాది ఇదేపని చేస్తాం. తీర ప్రాంతంలో ఉప్పునీటి కయ్యల్లో చేపలు పట్టుకుని జీవిస్తుండేవాళ్లం. ఎంత కష్టపడినా నెలకు రూ.ఏడెనిమిది వేలకు మించి వచ్చేది కాదు. ప్రభుత్వ ప్రోత్సాహంతోపాటు సీఎంఎఫ్‌ఆర్‌ఐ వారిచ్చిన శిక్షణ వల్ల నేడు రెండు బోనుల్లో పండుగప్ప (సీ బాస్‌) సాగుచేస్తున్నాం. 10 క్వింటాళ్ల ఉత్పత్తి వచ్చింది. కిలో రూ.300 చొప్పున అమ్మగా రూ.మూడు లక్షల ఆదాయం వచ్చింది. ఖర్చులు పోను రూ.రెండు లక్షలు మిగిలాయి. మా ఆదాయం ఏకంగా మూడింతలు పెరిగింది. అప్పులన్నీ తీర్చేశాం. చాలా ఆనందంగా ఉంది.
– గంధం నాగరాజు, కాంతమ్మ, పెద్దింటమ్మ, లక్ష్మీపురం, కృష్ణాజిల్లా

రూ.3 లక్షలు మిగులుతున్నాయి
నేనో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని. బాగుంటే నాలుగు డబ్బులొచ్చేవి. లేకుంటే నెలల తరబడి ఖాళీగా ఉండాల్సి వచ్చేది. చేపల సాగుపై నాకు ఎలాంటి అవగాహన లేదు. కానీ ప్రభుత్వ ప్రోత్సాహం, సీఎంఎఫ్‌ఆర్‌ఐ అందించిన సాంకేతిక సహకారంతో సముద్రపు చేపల చెరువుల పెంపకంపై దృష్టిసారించా. కేజ్‌ కల్చర్‌లో ఇండియన్‌ పాంపినో సాగుచేస్తున్నా. ఏటా రూ.తొమ్మిది లక్షలు ఆర్జిస్తున్నా. ఖర్చులు పోను రూ.మూడు లక్షలు నికరంగా మిగులుతున్నాయి.
– ఎస్‌.టి.కృష్ణప్రసాద్, కొమరిగిరిపట్నం, తూర్పుగోదావరి 

రెట్టింపు ఆదాయం ఆర్జిస్తున్నారు
సీఎంఎఫ్‌ఆర్‌ఐ అభివృద్ధి చేసిన సాంకేతికతను ప్రభుత్వ సహకారంతో క్షేత్రస్థాయిలో రైతుల వద్దకు తీసుకెళ్తున్నాం. ఉభయ గోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల్లోని తీరగ్రామాల్లో వందలాది మంది మత్స్యకారులకు ప్రత్యేక శిక్షణను ఇస్తున్నాం. సీఎంఎఫ్‌ఆర్‌ఐ సాంకేతికతతో సాగుచేస్తున్న రైతులు రెట్టింపు ఆదాయం ఆర్జిస్తున్నట్టుగా మా అధ్యయనంలో గుర్తించాం.
– డాక్టర్‌ సుభదీప్‌ ఘోష్, హెడ్, సీఎంఎఫ్‌ఆర్‌ఐ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top