శ్రీవారి సేవలో 43 ఏళ్లు

Dollar Seshadri has been in service of Tirumala Srivaru for 43 years - Sakshi

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో డాలర్‌ శేషాద్రి అంటే తెలియని వారుండరు. శ్రీనివాసుడి సన్నిధిలో 1978లో గుమస్తాగా బాధ్యతలు స్వీకరించిన ఆయన 1979లో ఉత్తర పార్‌ పత్తేదార్‌గా టీటీడీలో రెగ్యులర్‌ ఉద్యోగి అయ్యారు. తరువాత జూనియర్,సీనియర్‌ అసిస్టెంట్, సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొంది 2007 జూలైలో పార్‌ పత్తేదార్‌గా రిటైరయ్యారు. ఇలా 43 ఏళ్లపాటు శ్రీవారి సేవలో ఆయన తరించారు. 1948 జులై 15న జన్మించిన డాలర్‌ శేషాద్రి అసలు పేరు పాల శేషాద్రి, మెడలో పొడవైన డాలర్‌ ధరించి ఉండడంతో ఆ పేరుతో డాలర్‌ శేషాద్రిగా ప్రసిద్ధిగాంచారు. శేషాద్రి పూర్వీకులది తమిళనాడు రాష్ట్రంలోని కంచి. శేషాద్రి తండ్రి గోవిందరాజస్వామి ఆలయంలోని తిరుమల నంబి ఆలయంలో గుమస్తాగా విధులు నిర్వర్తించేవారు. తిరుపతిలోనే జన్మించిన శేషాద్రి విద్యాభ్యాసాన్ని అక్కడే పూర్తిచేశారు. అప్పట్లోనే పీజీ పూర్తిచేసిన ఆయన ఆ తరువాత చంద్రమ్మను వివాహమాడారు. అయితే, వీరికి పిల్లలులేరు. శేషాద్రికి ఇద్దరు అన్నలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.  

విస్తృత పరిచయాలు 
డాలర్‌ శేషాద్రికి దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, జడ్జీలు తదితర ప్రముఖలందరితోనూ విస్తృత పరిచయాలున్నాయి. అయితే.. 2009లో శేషాద్రికి ఊహించని దెబ్బ తగిలింది. తిరుపతికి చెందిన రైతు నాయకుడు టీటీడీలో 60 ఏళ్లకు పైబడిన వారిని కొనసాగించకూడదంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. న్యాయస్థానం తీర్పుతో టీటీడీ ఆ సమయంలో శేషాద్రి సహా 58 మందిని విధుల నుంచి తప్పించింది. కానీ, శేషాద్రి తన పోరాటం కొనసాగించి విజయం సాధించారు. ఇలా దాదాపు 10 నెలలపాటు శ్రీవారి సేవలకు దూరమయ్యారు. 

స్వామివారి వాహనాల అలంకరణలో.. 
1987లో శ్రీవారి ఆలయంలో మిరాశీ వ్యవస్థ రద్దయిన సమయంలో ఆలయంలో పూజా కైంకర్యాల నిర్వహణలో టీటీడీకి ఎంతో సహాయం అందించిన వ్యక్తి డాలర్‌ శేషాద్రి. శ్రీవారి వాహన సేవలప్పుడు స్వామి వారిని ఏ విధంగా అలంకరించాలో కూడా అర్చకులకు చెప్పి స్వామివారి వాహనాల అలంకరణకు పూర్తిస్థాయిలో సహకరించేవారు. ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో జరుగుతున్న పూజలకు సంబంధించి చేస్తున్న మార్పుల్లోనూ శేషాద్రి తన తోడ్పాటును టీటీడీకి అందిస్తున్నారు.  

శ్రీవారికి సేవలోనే.. 
స్వామివారి సేవలో తరిస్తున్న శేషాద్రి శ్రీవారి సేవలో వున్నప్పుడే పలుమార్లు అనారోగ్యానికి గురయ్యారు. 2013లో కిడ్ని ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకున్న ఆయన 2016లో తీవ్ర అస్వస్థతకు గురై తర్వాత కోలుకున్నారు. ఈ రెండుసార్లు కూడా బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలోనే ఆయన ఆస్వస్థతకు గురయ్యారు. ఇలా తన 42 ఏళ్ల సర్వీస్‌లో దాదాపు 15 నెలల కాలం మినహా మిగతా సమయం అంతా స్వామి సేవలోనే తరించారు. చివరకి తన తుది శ్వాస విడిచే సమయంలో కూడా శేషాద్రి విశాఖలో శ్రీవారి సేవలోనే ఉన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top