
పెద్దతిప్పసముద్రం: అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలోని కందుకూరుకు చెందిన బుడ్డాబాబు అనే రైతుకు చెందిన పాడి ఆవు కంటికి క్యాన్సర్ సోకడంతో పశువైద్య నిపుణులు గురువారం శస్త్రచికిత్స చేశారు. తన ఆవుకు మూడు నెలల కిందట కంటి భాగంలో గాయం కావడంతో స్థానిక పశు వైద్యశాలలో బుడ్డా బాబు పరీక్షలు చేయించాడు. కంటికి గ్రోత్ క్యాన్సర్ సోకినట్లు డాక్టర్ రమేష్ నిర్ధారించారు.
ఆ తర్వాత ఆవు కంట్లోని గాయం గడ్డలా మారి చూపు పూర్తిగా మందగించింది. క్యాన్సర్ మెదడుకు సోకకుండా ఉండేందుకు డాక్టర్ రమేష్ ప్రత్యేక చొరవ తీసుకుని పెద్దమండ్యం మండలంలో పని చేసే వెటర్నరీ డాక్టర్ విక్రంరెడ్డి, మదనపల్లిలో పని చేస్తున్న ట్రైనీ డాక్టర్ లోకేష్‌లతో కలిసి ఆవుకు శస్త్ర చికిత్స నిర్వహించి కంటిలోని క్యాన్సర్ కణజాలాన్ని తొలగించారు.