రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీతతో నిందితురాలు రంగమ్మ (ఫైల్) , అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌తో నిందితుడు రాజేశ్ (ఫైల్)
అవినీతి, మైనింగ్ మాఫియా, దౌర్జన్యాలను దాటి వలపు వల
అధికారం అండగా పేట్రేగుతున్న టీడీపీ నేతలు
మహిళల ఎర.. వీడియోలు తీసి బ్లాక్ మెయిల్.. కోట్లాది రూపాయల దోపిడీ
కొందరు పోలీసు అధికారులతో కుమ్మక్కై యథేచ్ఛగా దందా.. కీలక సూత్రధారులు రంగమ్మ, రాజేశ్ ఇద్దరూ టీడీపీ నేతలే
రంగమ్మ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కీలక అనుచరురాలు.. రాజేశ్ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు
‘సాక్షి’ కథనాలతో డీఐజీ, ఎస్పీ స్పందన
రంగమ్మ, రాజేశ్, మరో ముగ్గురి అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
ఇద్దరు సీఐలు వీఆర్‌కు..మరో 9 మందిపై వేటుకు రంగం సిద్ధం
డబ్బున్న వారిని ఎంచుకుని అమ్మాయిలతో వలపు వల వేసే పని రంగమ్మది
విటులపై దాడి చేసి.. వీడియోలు తీసి భారీ మొత్తాలకు బాండ్లు రాయించేది రాజేశ్
బాధితుల నుంచి డబ్బులు వసూలు చేయడంలో సీఐ శ్రీహర్షది కీలక పాత్ర
సాక్షి ప్రతినిధి, అనంతపురం : రాష్ట్రంలో అధికారం అండ చూసుకుని అవినీతి, అక్రమాలు, మైనింగ్ మాఫియా, ఇతరత్రా దందాలతో టీడీపీ నేతలు సాగిస్తున్న దౌర్జన్యకాండ శ్రుతిమించింది. ఇవన్నీ చాలవన్నట్లు డబ్బున్న వారికి అమ్మాయిలను ఎర వేసి, హనీ ట్రాప్ (వలపు వల)లో ఇరికించి, డబ్బు గుంజి, ఆర్థికంగా దివాలా తీయిస్తోంది. ఈ దందాలో ఏకంగా పలువురు పోలీసు అధికారులను భాగస్వాములుగా చేసుకోవడం దిగ్భ్రాంతి పరుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన అనంతపురం జిల్లాలో హనీ ట్రాప్ వెనుక అసలు దోషి తెలుగుదేశం పార్టీ అని తేలింది.
హనీట్రాప్ ముఠా లీడర్ రంగమ్మ రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీతకు ముఖ్య అనుచరురాలు. రంగమ్మకు అండగా ఉంటూ బాధితులపై దాడి చేసి, వీడియోలు తీసిన మరో కీలక వ్యక్తి రాజేశ్ అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మాజీ మేయర్ మదమంచి స్వరూపకు కీలక అనుచరుడు. వీరిద్దరికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా పలువురు టీడీపీ నేతలు అండదండలు అందించడం వల్లే వందలాది మందిని వీరు వలపువలలో ఇరికించి ఆర్థికంగా దివాలా తీయించారని స్పష్టమైంది.
ఈ దందాలో రాప్తాడు సీఐ శ్రీహర్షది కీలక పాత్ర. ఈ వలపువల దందాపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించడంతో ఎట్టకేలకు పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. టీడీపీ నేతలు రంగమ్మ, రాజేశ్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఇద్దరు సీఐలను వీఆర్‌కు పంపారు. మరికొందరు పోలీసు అధికారులు, పోలీసులకు కూడా ఈ దందాతో సంబంధం ఉందని తేలింది. వీరిపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. రంగమ్మను బుధవారమే అరెస్టు చూపిస్తే, మరో నలుగురిని గురువారం అరెస్టు చేసినట్లు అనంతపురం రూరల్ డీఎస్పీ శ్రీనివాసులు విలేకరులకు వెల్లడించారు.
ఎవరెవరి పాత్ర ఏంటంటే..
డబ్బున్న వ్యక్తులు, వ్యాపారులు, రియల్టర్లను గుర్తించడం, వారి ఫోన్ నంబర్లు సంపాదించి వారిని హనీ ట్రాప్ చేయడం, ఇంకొందరిని పని ఉన్నట్లు ఏకాంతంగా గదికి పిలిపించేలా చేయడం రంగమ్మ ఆధ్వర్యంలోని అమ్మాయిల బృందం పని. వ్యక్తులు వచ్చిన తర్వాత వారిపై దాడి చేసి, బట్టలు విప్పించి వీడియోలు తీయడం రాజేశ్ పని. వీడియోలు తీసిన తర్వాత వారివద్ద ఉన్న బంగారం దోచుకోవడంతో పాటు స్థాయిని బట్టి ముఠా సభ్యుల నుంచి అప్పు తీసుకున్నట్లు రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ప్రామిసరీ నోట్లు రాయించుకుంటారు.
బాధితులతో పాత తేదీలతో బాండ్లు రాయించుకున్న తర్వాత రంగమ్మ సీఐ శ్రీహర్షను కలిసి ఫిర్యాదు చేస్తుంది. శ్రీ హర్ష బాధితులను పిలిపించి ప్రామిసరీ నోట్‌లో పేర్కొన్న డబ్బును బెదిరించి, పంచాయితీ చేసి ఇప్పిస్తారు. ఇలా ఒక్కరూ ఇద్దరూ కాదు.. వందల మంది బాధితులు ఈ వలపు వలలో చిక్కుకుని ఆర్థికంగా చితికిపోయారు. రూరల్ మండలానికి చెందిన ఓ వ్యక్తి వీరి ఒత్తిడి భరించలేక ఏకంగా ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు పరువు పోతుందని పోలీసులకు ఫిర్యాదు కూడా చేయకుండా కన్నీటిని దిగమింగి వేదన పడుతున్నారు.
మరో నలుగురు సీఐల పాత్ర!
హనీట్రాప్ వ్యవహారాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ నెల 19 నుంచి వరుస కథనాలను ప్రచురించింది. దీంతో వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ జగదీశ్ రూరల్ సీఐ శేఖర్ ఆధ్వర్యంలో సమగ్రంగా విచారణ చేయించారు. ఇందులో రంగమ్మ, రాజేశ్‌తో పాటు మరో ఏడుగురు నిందితులను ప్రాథమికంగా గుర్తించారు. ఈ వ్యవహారంలో సీఐలు శ్రీహర్ష, రాజేంద్రనాథ్ యాదవ్‌లను వీఆర్‌కు పంపారు.
మరో తొమ్మిది మంది పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిపై కూడా సస్పెన్షన్ వేటు వేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ వ్యవహారంలో మరో నలుగురు సీఐలు, 15 మంది కానిస్టేబుళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కేవలం వీఆర్‌కు పంపడం కాకుండా హనీట్రాప్ ముఠా సభ్యుల తరహాలోనే పోలీసులపై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, చార్జిషీట్‌లో వారి పేర్లు ఎందుకు చేర్చలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ పెద్దల నుంచి తీవ్ర ఒత్తిడి!
హనీట్రాప్ వ్యవహారంలో మరికొంత మంది టీడీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. హంపాపురం సమీపంలోని 7 హిల్స్ హోటల్‌ను రంగమ్మ నిర్వహించేది. హనీట్రాప్‌కు సంబంధించిన పంచాయితీలన్నీ ఈ హోటల్‌లోనే జరిగేవని తెలుస్తోంది. సీఐ శ్రీహర్ష కూడా హోటల్ వద్దకు తరుచూ వచ్చేవారని తెలుస్తోంది. అలాగే ఈ హోటల్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సోదరుడు ధర్మవరం మురళి, పరిటాల మహీంద్ర, బైటీఎన్ ప్రసాద్ కూడా రాప్తాడు సీఐ శ్రీహర్షతో పాటు రెగ్యులర్‌గా కూర్చునే వారని పోలీసు, టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
టీడీపీ నేతల ప్రమేయం, ఆదేశాలతోనే సీఐ శ్రీహర్ష హనీట్రాప్ ముఠా పంచాయతీలను చేసినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంలో మరింత లోతుగా వెళితే పలువురు టీడీపీ నేతల బాగోతం బట్టబయలు అవుతోందని గ్రహించిన టీడీపీ పెద్దలు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురై ఈ వ్యవహారాన్ని ఇంతటితోనే ముగించాలని ఆదేశించినట్లు సమాచారం. హోం మంత్రి ఆ మేరకు పోలీసు అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని చిన్నదిగా చూపేందుకు పోలీసులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు సమాచారం.

రూ.13 లక్షలు, రెండు కత్తులు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం
హనీట్రాప్ వ్యవహారంపై డీఎస్పీ శ్రీనివాసులు గురువారం ప్రెస్‌మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించారు. ‘గార్లదిన్నె వాసి కుంచం ఉదయ్‌భాస్కర్‌రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేశాం. ఐదు నెలల కిందట ఉదయభాస్కర్‌రెడ్డికి మంగలి జయలక్ష్మి ఫోన్ చేసింది. డ్రోన్ ద్వారా వెంచర్‌ను సర్వే చేయాలని భాగ్యనగర్‌కు పిలిచింది. ఇంట్లోకి రాగానే సర్వే కొటేషన్ వివరాలు ఆరా తీస్తుండగా, దబ్బర రాజేష్ అక్కడికి వచ్చి తాను జయలక్ష్మి భర్తను అని, తన భార్యతో ఏం చేస్తున్నావ్ అని ఉదయ్ భాస్కర్‌రెడ్డిపై దాడి చేసి దుస్తులు విప్పించాడు. అంతలో జయలక్ష్మీ కూడా దుస్తులు తీసేసింది. ఇద్దరూ నగ్నంగా ఉన్నప్పుడు వీడియోలు, ఫొటోలు తీశాడు.
ఇంతలో రంగమ్మ అక్కడికి చేరుకుని.. ‘ఎందుకు ఇలా చేశావు. మీ ఊరిలో, మీ కుటుంబంలో ఈ విషయం తెలిస్తే నీ పరువు పోతుంది.. వాళ్లు ఏమైనా చేసుకుని చనిపోతారు.. ఇది బయటకు రాకుండా ఉండాలంటే రూ.4 లక్షలు ఇవ్వు’ అని ఉదయ్‌భాస్కర్‌ను ఆదేశించింది. డబ్బులు ఇవ్వకపోతే కత్తి చూపించి చంపుతామని బెదిరించారు. రూ.4 లక్షలు సమర్పించుకుని వారి నుంచి ఉదయ్ బయటపడ్డాడు’ అని డీఎస్పీ తెలిపారు. దీనిపై బాధితుడు రూరల్ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి సీఐ విచారణ చేపట్టారు. ఎస్పీ జగదీష్ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందడంతో లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులను గుర్తించామన్నారు.
వీరిలో మామిళ్లపల్లి రంగమ్మ అలియాస్ రంగమ్మనాయుడు అలియాస్ చిన్నీని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. తాజాగా దబ్బర రాజేష్, మంగలి జయలక్ష్మీ, చంద్రకళ, అనంతకుమారిని అరెస్ట్ చేశామన్నారు. వీరి నుంచి ఇప్పటి దాకా రూ.13 లక్షల నగదు, రెండు కత్తులు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నామని చెప్పారు. 20 మందిని హనీట్రాప్‌కు గురిచేసినట్లు ఇప్పటి వరకు తేలిందన్నారు. వారిని బెదిరించి భారీగా వసూళ్లు చేశారన్నారు. రంగమ్మ అలియాస్ చిన్నీపై సుమారు 10 కేసులున్నాయన్నారు. మిగిలిన వారిపై తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పలు కేసులున్నాయని తెలిపారు.
పోలీసుల అదుపులో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచరుడు
హనీట్రాప్ వ్యవహారంలో అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనుచరుడు, రుద్రంపేట మాజీ సర్పంచ్ నరేంద్రరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల కిందట అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్లు తెలిసింది.


