
నకిలీ మద్యం ప్లాంట్ నుంచి బెల్ట్ షాపులకు నకిలీ మద్యం సరఫరా
బెల్ట్ షాపుల వివరాలతో కూడిన డైరీ లభ్యం
సాక్షి, రాయచోటి/ ములకలచెరువు/పెద్దతిప్పసముద్రం/ఇబ్రహీంపట్నం (మైలవరం): అన్నమయ్య జిల్లా ములకలచెరువులో బట్టబయలైన నకిలీ మద్యం తయారీ ప్లాంట్ వ్యవహారంలో మరి కొన్ని కీలక వివరాలు లభ్యమయ్యాయి. అక్కడ దొరికిన డైరీ (చిన్న పుస్తకం)లో నకిలీ మద్యం తయారీ కేంద్రం నుంచి వివిధ ప్రాంతాల్లోని బెల్ట్ షాపులకు సరఫరా అయిన వివరాలు రాసి ఉండటం చర్చనీయాంశమైంది. అయితే ఆయా బెల్ట్ షాపులపై సజ్ అధికారులు తొందరపాటుతో చర్యలకు ఉపక్రమించొద్దని పెద్దల నుంచి ఒత్తిడి వచ్చినట్లు సమాచారం. దీంతో తూతూ మంత్రంగా ఒకటి రెండు షాపులపై దాడులు చేసి మమ అనిపించేలా ‘షో’ చేస్తున్నారు. కాగా, పాల వ్యాన్ తరహాలో ఉన్న ఆటోలో నకిలీ మద్యం సరఫరా అయ్యేది.
ఈ విషయమై రెండు రోజులుగా ప్రజల్లో భారీగా చర్చ జరగడంతో రాజేష్‌కు చెందిన ఈ వ్యాన్‌ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పెద్దతిప్పసముద్రం మండల టీడీపీ నేత కట్టా సురేంద్రనాయుడు ఇంటిలో, ఆయన నిర్వహిస్తున్న ఆంధ్రా వైన్స్‌లో నకిలీ మద్యం గుర్తించగా ఆయన్ను ఇప్పటికే అరెస్ట్ చేయడం తెలిసిందే.
టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డి పీఏ టి.రాజేష్ పరారీలో ఉన్నట్టు చెబుతూ ఆయన దుకాణం జోలికి వెళ్లక పోవడంపై ప్రజల్లో పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆదివారం సాయంత్రం రాజేష్ నిర్వహిస్తున్న ‘రాక్ స్టార్’ మద్యం దుకాణాన్ని సీజ్ చేశారు. ఈ మేరకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూధనరావు మీడియాకు వెల్లడించారు. ఈ షాపులో ఎంత నకిలీ మద్యం నిల్వ ఉందనే వివరాలను మాత్రం వెల్లడించ లేదు.
జనార్దనరావు, రాజు ఇళ్లల్లో తనిఖీలు
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నకిలీ మద్యం తయారీ కేసులో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన ఇద్దరు వ్యక్తుల ఇళ్లు, పచారీ దుకాణం, బార్‌లో శనివారం సోదాలు చేపట్టిన విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా పచారీ దుకాణం, బార్ నిర్వహిస్తున్న జనార్దనరావు, అతని పచారీ దుకాణంలో పనిచేసే కట్టా రాజు ఇళ్లను తనిఖీ చేశారు. వ్యాపార వేత్తగా ఉన్న జనార్దనరావు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండనప్పటికీ పలువురు టీడీపీ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. జనార్దనరావు ప్రస్తుతం విదేశాల్లో ఉండగా, కట్టా రాజు పరారీలో ఉన్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. కాగా, జనార్దనరావు బార్‌లో ఇన్నాళ్లూ మద్యం తాగిన వారంతా బెంబేలెత్తిపోతున్నారు.
దానిమ్మ తోటలో నకిలీ లిక్కర్ బాక్సులు
పెద్దతిప్పసముద్రం మండలం మల్లెల పంచాయతీ పరిధిలోని ఉప్పరవాండ్లపల్లిలో వెంకటరెడ్డి అనే రైతుకు చెందిన దానిమ్మ తోటలో మూడు బాక్సుల్లో బీర్లు, నకిలీ మద్యం పట్టుబడింది. ములకలచెరువు ఎక్సైజ్ సీఐ హిమబిందుకు వచ్చిన సమాచారం మేరకు ఆదివారం సిబ్బందితో కలసి ఆ ప్రాంతానికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. పట్టుబడిన బీరు బాటిళ్ల హోలోగ్రామ్ లేబుల్ స్కాన్ కాకపోవడంతో బీర్లు కూడా నకిలీవని తేలింది. ఈ మేరకు సీఐ అనుమానం వ్యక్తం చేస్తూ విషయాన్ని ఫోన్ ద్వారా ఉన్నతాధికారులకు వివరించినట్లు సమాచారం.
పట్టుబడిన మద్యం బాక్సులను కట్టా సురేంద్ర నాయుడు ఇటీవల బాబు అనే వ్యక్తి ద్వారా ఇక్కడకు పంపినట్లు రైతు వెంకటరెడ్డి పోలీసులకు తెలిపాడు. బాబు అనే వ్యక్తి మండలంలోని టి.సదుం పంచాయతీ పరిధిలోని చెన్నరాయునిపల్లికి చెందినవాడు. కట్టా సురేంద్ర నాయుడుకు నమ్మిన బంటు. కల్తీ మద్యం బాక్స్‌లను బెల్ట్ షాపులకు తరలించేవాడని తెలుస్తోంది. దానిమ్మ తోటలో పట్టుబడిన నకిలీ మద్యం వ్యవహారంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.