బిల్లు బకాయిలు చెల్లిస్తేనే డయాఫ్రం వాల్‌! | Diaphragm wall only if bill dues are paid | Sakshi
Sakshi News home page

బిల్లు బకాయిలు చెల్లిస్తేనే డయాఫ్రం వాల్‌!

Nov 4 2024 5:49 AM | Updated on Nov 4 2024 5:49 AM

Diaphragm wall only if bill dues are paid

పోలవరంలో మరో కమీషన్ల కథ..

రూ.94 కోట్ల పాత బకాయిల కోసం ‘బావర్‌’ పట్టు     

అవి చెల్లించాకే కొత్త వాల్‌ నిర్మాణ పనులు చేపడతాం

జలవనరుల శాఖకు బావర్‌ ప్రతినిధుల స్పష్టీకరణ

2018 జూన్‌ నాటికి పాత డయాఫ్రం వాల్‌ను పూర్తి చేసిన బావర్‌

నిబంధనల ప్రకారం ఎస్క్రో అకౌంట్‌ ద్వారా నేరుగా బిల్లులు చెల్లించని టీడీపీ సర్కార్‌

ట్రాన్స్‌ట్రాయ్‌ ద్వారా సబ్‌ కాంట్రాక్టర్లకు చెల్లింపులు

కానీ తమకు బిల్లులు చెల్లించలేదంటున్న బావర్‌

ఇదే అంశంపై పలు దఫాలు డీఆర్‌ఐకి కూడా ఫిర్యాదు

2018 నుంచి 2019 వరకూ ఎన్నిసార్లు మొత్తుకున్నా ఆలకించని చంద్రబాబు ప్రభుత్వం

బావర్‌కు ఎగ్గొట్టిన రూ.94 కోట్లు ఏ బాబు జేబులోకి వెళ్లాయో!  

సాక్షి, అమరావతి: కొత్త డయాఫ్రం వాల్‌ పనుల సన్నాహాల సాక్షిగా పోలవరంలో 2016–19 మధ్య మరో కమీషన్ల బాగోతం బట్టబయలైంది. అప్పట్లో తాము చేసిన డయాఫ్రం వాల్‌ పనులకు సంబంధించి రూ.94 కోట్ల బిల్లులు చెల్లించలేదని.. ఇప్పుడు అవి చెల్లిస్తేనే కొత్త డయాఫ్రం వాల్‌ పనులను చేపడతామని బావర్‌ సంస్థ ప్రతినిధులు తేల్చి చెప్పినట్లు జలవనరుల శాఖ అధికారవర్గాలు తెలిపాయి. 

ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌కి బిల్లులు చెల్లించామని.. అక్కడి నుంచి బిల్లులు వసూలు చేసుకోవాలంటూ అధికారులు చేసిన సూచనను బావర్‌ ప్రతినిధులు తోసిపుచ్చుతున్నారు. ఎస్క్రో అకౌంట్‌ ద్వారా బిల్లులు చెల్లిస్తామని నాటి ప్రభుత్వం 2017 ఫిబ్రవరి 6న ఉత్తర్వులు (జీవో ఆర్‌టీ నెంబరు 41) జారీ చేస్తేనే తాము పనులు చేశామని స్పష్టం చేస్తున్నారు. కానీ.. ఎస్క్రో అకౌంట్‌ ద్వారా తమకు బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెట్టారని పేర్కొంటున్నారు.

ట్రాన్స్‌ట్రాయ్‌ను అడ్డుపెట్టుకుని చంద్రబాబు, లోకేష్‌ సబ్‌ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి దోచుకున్నారంటూ ఆ సంస్థ అధినేత రాయపాటి రంగారావు 2024 జనవరి 12న మీడియాకు వెల్లడించడం గమనార్హం. కమీషన్ల కోసం పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారంటూ 2019 ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ సైతం ఆగ్రహం వ్యక్తం చేయడం అప్పట్లో సంచలనం  కలిగించింది. 

కమీషన్ల కోసమే 
ఎస్క్రో అకౌంట్‌ తుంగలోకి.. పోలవరం ప్రాజెక్టులో వరదను మళ్లించేలా స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ పనులు పూర్తి చేయకుండానే.. ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌(ఈసీఆర్‌ఎఫ్‌) డ్యామ్‌ గ్యాప్‌–2లో పునాది డయాఫ్రం వాల్‌ పనులను బావర్‌ సంస్థకు సబ్‌ కాంట్రాక్టు కింద 2016లో టీడీపీ ప్రభుత్వం అప్పగించి చారిత్రక తప్పిదానికి పాల్పడింది. ప్రధాన కాంట్రాక్టర్‌ ట్రాన్స్‌ట్రాయ్‌ ద్వారా కాకుండా ఎస్క్రో అకౌంట్‌ ద్వారా బిల్లులు చెల్లిస్తామని నాడు హామీ ఇచ్చి తుంగలో తొక్కింది. 

ఎందుకంటే.. ఎస్క్రో అకౌంట్‌ ద్వారా బిల్లులు చెల్లిస్తే కమీషన్లు వసూలు చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఈ క్రమంలో 2018 జూన్‌ నాటికి గ్యాప్‌–2లో డయాఫ్రం వాల్‌ను బావర్‌ సంస్థ పూర్తి చేసింది. చేసిన పనులకు బిల్లుల రూపంలో రూ.56 కోట్లు, జీఎస్టీ రూపంలో రూ.38 కోట్లు వెరసి రూ.94 కోట్ల మేర బిల్లులు బావర్‌కు టీడీపీ ప్రభుత్వం బకాయిపడింది. 

బావర్‌ సంస్థ ఇదే అంశాన్ని అప్పట్లో  అనేక మార్లు జలవనరుల శాఖ దృష్టికి తెచ్చి బిల్లులు చెల్లించాలని కోరింది. అయితే తాము ట్రాన్స్‌ట్రాయ్‌కు బిల్లులు చెల్లించేశామని, ఆ సంస్థ నుంచి వసూలు చేసుకోవాలని అధికారులు సూచించారు. కానీ.. అప్పటికే ట్రాన్స్‌ట్రాయ్‌ దివాలా తీసింది. చంద్రబాబు ప్రభుత్వం చారిత్రక తప్పిదం వల్ల గోదావరి వరదల ఉద్ధృతికి డయాఫ్రంవాల్‌ ధ్వంసమైంది.   

డీఆర్‌ఐకి ఫిర్యాదు చేసినా.. 
రూ.94 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంపై బావర్‌ సంస్థ అప్పట్లో డీఆర్‌ఐకి ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై 2018 నుంచి అనేక మార్లు డీఆర్‌ఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించినా స్పందించలేదు. 2014 ఎన్నికల్లో ఖర్చుల కోసం చంద్రబాబు, లోకేష్‌ తమ వద్ద రూ.150 కోట్లు తీసుకున్నారని.. ఆ తర్వాత పనులన్నీ సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించి తమను నాశనం చేశారని ట్రాన్స్‌ట్రాయ్‌ అధినేత రాయపాటి రంగారావు మీడియాకు ఎక్కడం అప్పట్లో సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో బావర్‌ సంస్థకు చెల్లించాల్సిన రూ.94 కోట్ల బిల్లులు ఏ బాబు జేబులోకి చేరాయనే చర్చ కాంట్రాక్టర్లలో జోరుగా సాగుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement