15న వైఎస్సార్‌ రైతుభరోసా నిధుల జమ

Deposit of Rythu Bharosa Funds on 15th May - Sakshi

రైతు ఖాతాలకు రూ.3,657.87 కోట్లు

ఈ ఏడాది అర్హులు 48.77 లక్షల మంది

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ రైతుభరోసా కింద 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నెల 15వ తేదీన తొలివిడత పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ ఏడాది 48.77 లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించింది. వీరిలో 47.86 లక్షల మంది భూ యజమానులు కాగా, 91 వేల మంది అటవీ భూ సాగుదారులున్నారు. అర్హత పొందిన రైతుల జాబితాలను సామాజిక తనిఖీ కోసం నేటి (శుక్రవారం) నుంచి ఆర్బీకేల్లో ప్రదర్శించనున్నారు. ఈ నెల 8వ తేదీ వరకు ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిశీలిస్తారు.

ఎవరైనా అనర్హులుంటే వారి పేర్లను తొలగించడంతోపాటు జాబితాలో చోటుదక్కని అర్హులెవరైనా ఉంటే వారి అభ్యర్థనలను స్వీకరించి క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అర్హతను నిర్ధారించుకున్న తర్వాత వారికి భరోసా సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తారు. వైఎస్సార్‌ రైతుభరోసా కింద అర్హులైన ప్రతి భూ యజమానులకు ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. వెబ్‌ల్యాండ్‌ ఆధారంగా అర్హులైన భూ యజమానులతోపాటు దేవదాయ, అటవీభూమి సాగుదారులు, భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన సాగుదారులను గుర్తించి మొదటి విడతగా మేలో రూ.7,500, రెండో విడతగా అక్టోబర్‌లో రూ.4 వేలు, మూడో విడతగా జనవరిలో రూ.2 వేలు చొప్పున పెట్టుబడిసాయం అందిస్తున్నారు.

2019–20లో 46.69 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,173 కోట్లు, 2020–21లో 51.59 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,928 కోట్లు, 2021–22లో 52.38 లక్షల రైతు కుటుంబాలకు రూ.7,016.59 కోట్ల సాయం అందించారు. 2022–23లో 48.77 లక్షల అర్హులైన రైతు కుటుంబాలకు లబ్ధిచేకూర్చేందుకు ఏర్పాట్లు చేశారు. వీరికి మొదటి విడతగా ఈ నెల 15న రూ.3,657.87 కోట్ల సాయం అందించబోతున్నారు. భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సాగుదారులను గుర్తించాల్సి ఉంది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహించిన స్పెషల్‌ డ్రైవ్‌లో గుర్తించిన అర్హులైన కౌలు రైతులకు ప్రస్తుతం సీసీఆర్సీ (క్రాప్‌ కల్టివేటర్స్‌ రైట్‌ యాక్టు) కార్డుల జారీచేస్తునారు.

ఈ కార్డుల ఆధారంగా వారికి తొలివిడత సాయం అందించనున్నారు. కాగా, వైఎస్సార్‌ రైతుభరోసాకి అర్హుల జాబితాలను నేటినుంచి ఆర్బీకేల్లో ప్రదర్శిస్తామని, అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఆర్బీకేల్లోని గ్రామ వ్యవసాయ సహాయకులకు ఈ నెల 8వ తేదీ సాయంత్రం ఐదుగంటల్లోగా తెలియజేయాలని వ్యవసాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ హరికిరణ్‌ తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top