జన జీవనం ఫుల్‌జోష్‌

Crowded Atmosphere Again In Functions And Village Celebrations - Sakshi

కరోనా భయం వీడి స్వేచ్ఛగా జీవన ప్రయాణం

రెండేళ్ల తర్వాత ఎక్కడ చూసినా జనం రద్దీ

జాతరలు, వివాహ వేడుకలు కళకళ

జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు

రెండేళ్ల క్రితం ఊహించని ఉపద్రవం.. కరోనా మహమ్మారి ఇంటి నుంచి కాలు బయట పెట్టనీయలేదు. ప్రాణభయం వెంటాడటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. జీవన ప్రయాణానికి లాక్‌ పడింది. శుభకార్యాల్లేవు.. చుట్టపు చూపుల్లేవు.. విహారయాత్రలు అసలే లేవు. కనీసం బంధుమిత్రుల కడసారి వీడ్కోలుకు వెళ్లలేని ధైన్యస్థితి. క్రమంగా కరోనా ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో రెండేళ్ల తర్వాత జనజీవనం పట్టాలపై పరుగులు తీస్తోంది. మళ్లీ పూర్వ వైభవం వచ్చిందా అన్నట్లుగా అంతటా రద్దీ వాతావరణం కనిపిస్తోంది. ఉత్సవాలు, పెళ్లిళ్లు, వేడుకలు, జాతరలు  జనంతో కళకళలాడుతున్నాయి.   

కోవెలకుంట్ల: కరోనా మహమ్మారి రెండేళ్లపాటు ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలను కకావికలం చేసింది. కోవిడ్‌ కట్టడికి 2020 మార్చి చివరి వారంలో 
కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో జనజీవనం స్తంభించిపోయింది. అదే ఏడాది ఏప్రిల్‌ నెలలో సంజామల మండలం నొస్సం గ్రామంలో మొట్టమొదటి కరోనా కేసు నమోదైంది. తర్వాత క్రమంగా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు 3.08 లక్షల మంది వైరస్‌ బారిన పడగా వీరిలో 1,305 మందిని వైరస్‌ కబళించింది. ఫస్ట్, సెకండ్, థర్డ్‌ వేవ్‌లతో దాదాపు రెండేళ్ల పాటు కరోనా భయం వెంటాడింది. 2020 సెప్టెంబర్‌ వరకు ఫస్ట్‌వేవ్‌ కొనసాగగా జిల్లాలో 60 వేల మంది కరోనా బారిన పడగా 458 మంది మృత్యువాత పడ్డారు.

2021 మార్చి నెలాఖరు నుంచి సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైంది. నాలుగు నెలలపాటు కొనసాగిన వేవ్‌లో జిల్లాలో 1.23 లక్షల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 820 మంది కరోనా కాటుకు బలైపోయారు. ఈ వేవ్‌లో వైరస్‌ పట్ల కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించడం, బాధితులు భయాందోళన గురికావడంతో ఫస్ట్‌వేవ్‌తో పోలిస్తే సెకండ్‌ వేవ్‌లో రెట్టింపు మరణాలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది జనవరి నెలలో థర్డ్‌వేవ్‌ (ఒమిక్రాన్‌) ప్రారంభం కాగా 1.25 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొదటి, రెండు వేవ్‌లతో పోలిస్తే థర్డ్‌వేవ్‌లో కేసుల సంఖ్య భారీగా పెరిగినా ప్రజలకు వైరస్‌ను ప్రాణాపాయం తప్పింది. జిల్లాలో కేవలం ఐదు మరణాలు మాత్రమే సంభవించాయి.

మూడు వేవ్‌లలో ప్రజలను ముప్పుతిప్పలు పెట్టిన కరోనా ప్రభావం తొలగిపోవడంతో జనజీవనం పూర్వవైభవం సంతరించుకుంది. రెండేళ్లపాటు మాయమైన పెళ్లిళ్ల సందడి మళ్లీ కనిపిస్తోంది. అన్ని రకాల వ్యాపారాలు కళకళలాడుతున్నాయి. వేసవికాలం కావడంతో పల్లెల్లో దేవరలు, తిరుణాళ్లు, ఉత్సవాలు మొదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ రెండు డోసుల కరోనా వ్యాక్సిన్‌తో పాటు బూస్టర్‌ డోస్‌ వేయడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. విద్యార్థులకు సైతం వ్యాక్సిన్‌నేషన్‌ పూర్తి చేస్తుండటంతో ప్రజలు ధైర్యంగా తమ పిల్లలతో బయటకు వస్తున్నారు.  అయితే ప్రజలు ఇల్లు దాటితే తప్పనిసరిగా మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించి కరోనా బారి నుంచి రక్షణ పొందాలని వైద్యులు సూచిస్తున్నారు.  

రెండేళ్ల తర్వాత పరీక్షలు
విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు పరీక్షలు  ఎంతో కీలకం. 2020 మార్చి నెలలో కరోనా వైరస్‌ వ్యాప్తితో 2019–20 విద్యా సంవత్సరం పరీక్షలు విద్యార్థులు రాయలేకపోయారు.  పదవ తరగతి, ఇంటర్‌ పరీక్షలు రద్దు అయ్యాయి. ఆ తర్వాత 2020–21 విద్యా సంవత్సరం కూడా సగం ఏడాది లాక్‌డౌన్‌ మింగేసింది. ఆ సంవత్సరం కూడా పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. రెండేళ్లు విద్యార్థులు పరీక్షలకు దూరమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు లేకుండానే పాస్‌ చేసింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో 2021–22 విద్యా సంవత్సరం పరీక్షలు కొనసాగుతుండటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.  కరోనా రెండేళ్ల కాలంలో విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. ఓ వైపు ఆన్‌లైన్‌ చదువులు, మరో వైపు క్రీడలు లేకపోవడంతో మానసింగా కుంగిపోయారు. ఈ క్రమంలో తరగతుల నిర్వహణతో పాటు ఆటలతో పాటు శిక్షణ శిబిరాలు అందుబాటులోకి రావడంతో విద్యార్థులకు ఊరట కలిగింది.   

విద్యార్థులు నష్టపోయారు 
20 సంవత్సరాల నుంచి నేను కోవెలకుంట్ల పట్టణంలో ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాను. కరోనా వైరస్‌ ప్రభావంతో 2020 మార్చి 24 నుంచి 2022 ఆగస్టు వరకు కేవలం రెండు, మూడు నెలల మాత్రమే పాఠశాలలు కొనసాగాయి. విద్యార్థులు ఎంతో నష్టపోయారు. కోలుకునేందుకు చాలా సమయం పట్టింది.     
– దస్తగిరి, ప్రైవేట్‌ పాఠశాల ఉపాధ్యాయుడు, సౌదరదిన్నె, కోవెలకుంట్ల 

వ్యాపారాలు  పుంజుకుంటున్నాయి 
కరోనాతో రెండేళ్లపాటు వ్యాపారాలు లేక ఇబ్బందులు పడ్డాం. షాపులు తెరుచుకునేందుకు అవకాశం లేక నష్టాలు చవిచూశాం.  గత 15 సంవత్సరాల నుంచి సెల్‌షాపు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాను. కరోనాతో షాపు మూత పడి పూటగడవటమే కష్టంగా ఉండింది. కరోనా కష్టాలు తొలగిపోవడంతో ఇప్పుడిప్పుడే వ్యాపారాలు పుంజుకుంటున్నాయి.  
– బలరాం, సెల్‌షాపు యజమాని, కోవెలకుంట్ల 

 అప్రమత్తంగా ఉండాలి 
కరోనా తొలిగిపోయిందని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తతలు పాటించాలి. ఫస్ట్, సెకండ్‌ వేవ్‌లలో కరోనా వైరస్‌ విశ్వరూపం చూపడంతో వందల సంఖ్యలో ప్రజలు మరణించారు. ఇటీవల కాలంలో కొన్ని రాష్ట్రాల్లో తిరిగి కరో నా కేసులు నమోదవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండి కరోనా నిబంధనలు పాటించాలి. 
– విద్యాసాగర్, డాక్టర్, రేవనూరు పీహెచ్‌సీ, కోవెలకుంట్ల మండలం 

ఘనంగా స్మరించుకుంటూ.. 
కరోనా కాలంలో ఎన్నో విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. అయిన వారు కరోనా వైరస్‌ బారిన పడి మృతి చెందినా అంత్యక్రియలకు వెళ్లలేకపోయారు. ప్రాణ భయంతో కడసారి చూపునకు నోచుకోలేక ఎంతో మంది విలవిలలాడారు. ఫోన్లోనే కుటుంబీకులను పరామర్శించాల్సిన పరిస్థితి ఎదురైంది. నాడు అందరూ ఉన్నా అంత్యక్రియలకు కుటుంబీకులు మాత్రమే పరిమితమయ్యారు. ఈ క్రమంలో కొందరు వర్ధంతి వేడుకలకు బంధుమిత్రులను ఆహ్వానించడంతో ఘనంగా స్మరించుకుంటున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top