తనకల్లు మండలం దిగువ తొట్లిపల్లి వద్ద పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ జారిపోయి కొట్టుకుపోయిన దృశ్యం
కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేనికి సర్కారు బొనాంజా
పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులు రూ.207.20 కోట్లకు దక్కించుకున్న ఎస్సార్ కన్‌స్ట్రక్షన్స్
రాతి పొర ఉన్న ప్రదేశంలో మాత్రమే షార్ట్ క్రీటింగ్ విధానంలో లైనింగ్ నిబంధన బేఖాతరు
పని స్వభావాన్ని మార్చేసి స్టీల్ ఫైబర్ రీయిన్‌ఫోర్స్ కాంక్రీట్ (ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ) విధానంలో లైనింగ్
పనులు వేగంగా చేయాలనే సాకుతో ఇష్టారాజ్యంగా ఎస్‌ఎఫ్‌ఆర్‌సీతో అడ్డగోలుగా పనులు
కాలువ గట్టు వాలును సరి చేయకుండానే మట్టి పొరకే ఎస్‌ఎఫ్‌ఆర్‌సీతో లైనింగ్
ఫలితంగా గత సీజన్‌లో నీటి ప్రవాహానికే ఎక్కడికక్కడ కొట్టుకుపోయిన కాంక్రీట్
గతేడాదే లైనింగ్ పనులు పూర్తయినట్లు ప్రకటించిన చంద్రబాబు సర్కారు
వాస్తవంగా 30 శాతం మేర లైనింగ్ మిగిలిపోయిన వైనం
పనుల అంచనా వ్యయాన్ని రూ.309.70 కోట్లకు పెంచేస్తూ మే 4న ఉత్తర్వులు
మిగిలిన లైనింగ్ పనులనూ అత్యంత నాసిరకంగా చేస్తున్న అమిలినేని సంస్థ
సాక్షి, అమరావతి: నాసిరకంగా పనులు చేసిన కాంట్రాక్టు సంస్థపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం తద్భిన్నంగా అంచనా వ్యయాన్ని రూ.102.72 కోట్లు పెంచేసి నజరానా అందించింది. కారణం.. ఆ కాంట్రాక్టు సంస్థ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందినది కావడమే. టెండర్ నిబంధనల ప్రకారం ఆర్నెల్లలోగా పనులు చేయకుండా.. అత్యంత నాసిరకంగా పనులు చేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఆ పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి లబ్ధి చేకూర్చడంపై ఇంజినీరింగ్ నిపుణులు, అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం రెండో దశలో శ్రీ సత్యసాయి జిల్లా చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి పుంగనూరు బ్రాంచ్ కెనాల్ ప్రారంభమవుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు రెండు ప్యాకేజీల కింద ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఆ కెనాల్ 0 కిలోమీటర్ నుంచి 26.20 కిలోమీటర్ల వరకు లైనింగ్ పనులను రూ.93.14 కోట్లకు.. 26.2 కిలోమీటర్ల నుంచి 75.075 కిలోమీటర్ల వరకు లైనింగ్ పనులను రూ.173.10 కోట్లకు టీడీపీ ఎమ్మెల్యే అమిలినేనికి చెందిన ఎస్సార్ కన్‌స్ట్రక్షన్స్ దక్కించుంది. ఆ పనులను ఆర్నెల్ల్లలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు పెట్టింది.
ఈ ఫొటో చూడండి.. శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం కొక్కంటి క్రాస్‌కు సమీపంలో హంద్రీ–నీవా రెండో దశలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌కు స్టీల్ ఫైబర్ రీయిన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్ (ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ) విధానంలో వేసిన లైనింగ్ పనితనం నీటి ప్రవాహం ఆగిపోగానే బట్టబయలైంది. టెండర్ నిబంధనల ప్రకారం రాతి పొర, డీప్ కట్ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే షార్ట్ క్రీటింగ్ విధానంలో లైనింగ్ చేయాలి.

కానీ.. నిబంధనను ఉల్లంఘించి, పనులు వేగంగా చేయాలనే మిషతో ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ విధానంలో లైనింగ్ వేశారు. చిన్న చిన్న ఇనుప తీగలు, సిమెంటు, సిలికా, ఇసుక, కంకర, నీటితో కలిపి ఎస్‌ఎఫ్‌ఆర్‌సీని తయారు చేస్తారు. కాలువకు రాతి పొర ఉన్న ప్రదేశంలో మాత్రమే.. కాలువ గట్టు వాలు (స్లోప్)ను క్రమానుగతంగా ఉండేలా సరిచేసుకుని (సెక్షనింగ్).. ఆ తర్వాత 38 మిల్లీమీటర్ల (ఎంఎం) మందంతో ఒకసారి, ఆ తర్వాత 38 ఎంఎం మందంతో మరోసారి అధిక ఒత్తిడితో ఎస్‌ఎఫ్‌ఆర్‌సీతో లైనింగ్ చేయాలి. కానీ, మట్టి పొరకే.. అదీ కాలువ గట్టు వాలును క్రమానుగతంగా ఉండేలా చేయకుండానే, గట్టు వాలు ఎగుడు దిగుడుగా ఉన్నప్పటికీ 10 నుంచి 20 ఎంఎం మందంతో ఎస్‌ఎఫ్‌ఆర్‌సీతో లైనింగ్ వేశారు.
పనులు చేసిన సంస్థ కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందినది కావడంతో వాటిని పర్యవేక్షిస్తున్న అధికారులు నాణ్యతపై నోరు మెదపలేకపోయారు. నాణ్యతను పర్యవేక్షించాల్సిన క్వాలిటీ కంట్రోల్ విభాగం నిద్రపోయింది. బిల్లులు కూడా చెల్లించేశారు. గత సీజన్‌లో కాలువలో ప్రవహించిన నీటి ఉద్ధృతికే కాంక్రీట్ ఎక్కడికక్కడ జారిపోయి, కరిగిపోయి కొట్టుకుపోయింది.
నాసిరకానికి ఈ ఫొటోనే సాక్ష్యం.. శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కొండమనాయునిపాలెం వద్ద పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌కు ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ విధానంలో అత్యంత నాసిరకంగా లైనింగ్ వేశారనడానికి ఇదిగో ఆధారం. ఒక సీజన్‌లో నీటి ప్రవాహానికే కాంక్రీట్ జారిపోయి, కరిగిపోయి కొట్టుకుపోయింది. కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అయ్యింది.

ఈ ఫొటో మరో నిదర్శనం.. శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం కళ్లిపల్లి సమీపంలో పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌కు ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ విధానంలో అత్యంత నాసిరకంగా లైనింగ్ పనులు చేశారనడానికి ఇది మరో నిదర్శనం. కనీసం కాలువ స్లోప్‌ను కూడా సరి చేయకుండా ఇష్టారాజ్యంగా లైనింగ్ చేయడం వల్ల ఒక సీజన్‌లో నీటి ప్రవాహానికే కాంక్రీట్ కొట్టుకుపోయింది.

ఇదిగో బహుమానం
పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌లో 26.2 కిలోమీటరు నుంచి 75.075 కిలోమీటర్ వరకు లైనింగ్ పనులు చేపట్టడానికి రూ.207.20 కోట్లతో 2024 డిసెంబర్ 3న ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఇవే పనులను జీఎస్టీ, సీనరేజీ వంటి పన్నులు మినహాయించి రూ.173.10 కోట్లకు ఎస్సార్ కన్‌స్ట్రక్షన్స్‌కు ప్రభుత్వం అప్పగించింది. సకాలంలో నాణ్యంగా పనులు చేయని ఆ కాంట్రాక్టు సంస్థపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం తద్భిన్నంగా వ్యవహరించింది. ఆ పనుల అంచనా వ్యయాన్ని రూ.309.92 కోట్లకు పెంచేస్తూ మే 4న ఉత్తర్వులు జారీ చేసింది. అంటే.. నాసిరకంగా పనులు చేసిన టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సంస్థకు రూ.102.72 కోట్ల మేర లబ్ధి చేకూర్చినట్లు స్పష్టమవుతోంది.

నిబంధనలకు విరుద్ధంగా ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ లైనింగ్
టెండర్ నిబంధనల ప్రకారం రాతి పొర ఉన్న చోట్ల మాత్రమే షార్ట్ క్రీటింగ్ విధానంలో లైనింగ్ చేయాలి. నిబంధనల్లో ఎక్కడా ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ ప్రస్తావనే లేదు. టెండర్ పేర్కొన్న దానికి భిన్నంగా పని స్వభావం మారితే స్టేట్ లెవల్ టెక్నికల్ కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ) ఆమోదం పొంది.. ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. కానీ.. టెండర్‌లో నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలనే సాకు చూపి.. షార్ట్ క్రీటింగ్ విధానంలో పనులు చేస్తే జాప్యం జరుగుతుందని సాకులు వెతికి.. ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ విధానాన్ని కాంట్రాక్టర్లు ప్రతిపాదించారు. అయినా ఆ పనులను పర్యవేక్షిస్తున్న ఇంజినీరింగ్ అధికారులు నోరు మెదపలేక పోయారని జల వనరుల శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి.
రాతి పొర లేకున్నా.. మట్టి పొరకే.. కనీసం కాలువ గట్ల వాలును క్రమానుగతంగా సరి చేయకుండానే ఇష్టారాజ్యంగా అత్తెసరు మందంతో ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ విధానంలో కాంట్రాక్టర్లు లైనింగ్ పనులు కానిచ్చేశారు. షార్ట్ క్రీటింగ్ పద్ధతిలో లైనింగ్ చేస్తే చదరపు మీటరుకు రూ.1,407 చొప్పున బిల్లు చెల్లిస్తారు. అదే ఎస్‌ఎఫ్‌ఆర్‌సీతో లైనింగ్ చేస్తే రూ.1,854 చెల్లిస్తారు. కానీ.. హంద్రీ–నీవా పనుల్లో మాత్రం రూ.2,400 చొప్పున బిల్లులు చెల్లిండంపై ఇంజినీరింగ్ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ విధానంలో అత్యంత నాసిరకంగా వేసిన లైనింగ్ ఒక్క సీజన్‌లో నీటి ప్రవాహానికే ఎక్కడికక్కడ కొట్టుకుపోయింది.
లైనింగ్ పనులు చేయాల్సింది ఇలా..
» తొలుత కాలువపై ముళ్ల కంప చెట్లను తొలగించాలి. కాలువపై ఇన్‌స్పెక్షన్ పాత్ (దారి) వేయాలి. కాలువకు ఇరు వైపులా.. అడుగు భాగంలో ఇన్‌క్లెయిన్‌డ్ రోలర్ (పొక్లెయినర్‌కు రోలర్‌ను అమర్చడం)తో గట్టిపరచాలి.
» ఆ తర్వాత 12 ఎంఎం, 20 ఎంఎం గ్రానైట్ కంకర, నాణ్యమైన ఇసుక, సిమెంటుతో తయారు చేసిన ఎం–25 మిక్సర్, ఎం–20 మిక్సర్‌తో పేవర్ మిషన్ ద్వారా కాలువకు ఇరు వైపులా లైనింగ్ వేయాలి. ఆ తర్వాత అడుగు భాగంలో లైనింగ్ వేయాలి. రెండు వారాలపాటు క్యూరింగ్ (నీటితో తడపాలి) చేయాలి.
» రాతి పొర ఉన్న ప్రాంతాల్లో షార్ట్ క్రీటింగ్ విధానంలో లైనింగ్ చేయాలి. రాతి పొరకు ఇనుప బోల్ట్ కొట్టి.. దానికి ఇనుప జాలరీ అమర్చి.. దానిపై అధిక ఒత్తిడితో ఎం–20 కాంక్రీట్ వేయాలి.
» పనులను ఏఈ, డీఈ, ఈఈలు నిరంతరం పర్యవేక్షించాలి. ఎస్‌ఈ, సీఈలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి. నాణ్యత నియంత్రణ విభాగం(క్వాలిటీ కంట్రోల్) అధికారులు ఎప్పటికప్పుడు సిమెంటు కాంక్రీట్ లైనింగ్ శాంపుల్స్‌ను తీసి.. ల్యాబొరేటరీల్లో పరీక్షించి నాణ్యతను ధ్రువీకరించాలి. నాసిరకంగా ఉన్నట్లు తేలితే.. వాటిని తొలగించి మళ్లీ నాణ్యంగా పనులు చేయించాలి.
» పనులు దక్కించుకున్న ప్రధాన కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించడానికి వీల్లేదు. ఏవైనా పనులను సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించాలంటే జల వనరుల శాఖ అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి. 50 శాతం లోపు పనులను అధికారుల అనుమతితో సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించడానికి అవకాశం ఉంటుంది. కానీ.. పనుల నాణ్యతకు ప్రధాన కాంట్రాక్టరే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
లైనింగ్ పనులు చేసింది ఇలా..
» కాలువ గట్లపై ముళ్ల కంప చెట్లను తొలంచి, దారిని వేశారు. కానీ.. ఇన్‌క్లెయిన్‌డ్ రోలర్‌తో కాలువ ఇరు వైపులా అడుగు భాగాన్ని గట్టి పరచకుండా కేవలం పొక్లెయిన్ బకెట్‌తో తూతూ మంత్రంగా గట్టిపరిచే పనులు కానిచ్చేశారు. దాంతో కాలువకు ఇరు వైపులా మట్టి ఎక్కడికక్కడ జారిపోయింది.
» గతంలో కాలువ తవ్వినప్పుడు వచ్చిన మట్టిని, రాళ్లను గట్లపై పోశారు. ఆ గట్లపై ఉన్న రాళ్ల నుంచి కంకర తయారు చేశారు. ఆ కంకర పిండి పిండిగా నాసిరకంగా ఉంది. సమీపంలో వాగులు, వంకల్లో ఇసుకను తెచ్చారు. నాసిరకం కంకర, ఇసుక.. తక్కువ పరిమాణంలో సిమెంటుతో ఎం–25 మిక్సర్ (ఒక పాలు సిమెంటు, ఒక పాలు ఇసుక, రెండు పాళ్లు 20 ఎంఎం కంకర కలిపి తయారుచేసే మిశ్రమం), ఎ0–20 (ఒక పాలు సిమెంటు, 1.5 పాళ్లు ఇసుక, 3 పాళ్లు 12 ఎంఎం కంకర కలిపి తయారుచేసే మిశ్రమం) మిక్సర్ తయారు చేశారు.
» కాలువకు ఇరువైపులా ఇన్‌క్లెయిన్‌డ్ రోలర్‌తో గట్టిపరచక పోవడంతో ఎక్కడికక్కడ మట్టి జారిపోతున్నా పేవర్ యంత్రాన్ని వినియోగించకుండా.. కార్మికులతోనే సిమెంటు కాంక్రీట్‌తో లైనింగ్ చేశారు. మట్టి జారిపోతున్నా సరే అలానే లైనింగ్ వేశారు. దీనివల్ల గత ఆగస్టులో కాలువకు నీటిని విడుదల చేయగానే లైనింగ్ ఎక్కడికక్కడ జారిపోయి కొట్టుకుపోయింది. ఎం–25, ఎం–20 కాంక్రీట్‌లో సిమెంటు తక్కువగా, ఇసుక ఎక్కువగా, నాసిరకం కంకర వినియోగించడం వల్ల లైనింగ్ చేసిన ప్రాంతాల్లో ఇసుకపైకి తేలి స్పష్టంగా కన్పిస్తోంది.


