breaking news
Branch Canal works
-
నాసిరకం పనులకు రూ.102 కోట్ల నజరానా
సాక్షి, అమరావతి: నాసిరకంగా పనులు చేసిన కాంట్రాక్టు సంస్థపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం తద్భిన్నంగా అంచనా వ్యయాన్ని రూ.102.72 కోట్లు పెంచేసి నజరానా అందించింది. కారణం.. ఆ కాంట్రాక్టు సంస్థ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందినది కావడమే. టెండర్ నిబంధనల ప్రకారం ఆర్నెల్లలోగా పనులు చేయకుండా.. అత్యంత నాసిరకంగా పనులు చేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఆ పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి లబ్ధి చేకూర్చడంపై ఇంజినీరింగ్ నిపుణులు, అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం రెండో దశలో శ్రీ సత్యసాయి జిల్లా చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి పుంగనూరు బ్రాంచ్ కెనాల్ ప్రారంభమవుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు రెండు ప్యాకేజీల కింద ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఆ కెనాల్ 0 కిలోమీటర్ నుంచి 26.20 కిలోమీటర్ల వరకు లైనింగ్ పనులను రూ.93.14 కోట్లకు.. 26.2 కిలోమీటర్ల నుంచి 75.075 కిలోమీటర్ల వరకు లైనింగ్ పనులను రూ.173.10 కోట్లకు టీడీపీ ఎమ్మెల్యే అమిలినేనికి చెందిన ఎస్సార్ కన్స్ట్రక్షన్స్ దక్కించుంది. ఆ పనులను ఆర్నెల్ల్లలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు పెట్టింది.ఈ ఫొటో చూడండి.. శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం కొక్కంటి క్రాస్‌కు సమీపంలో హంద్రీ–నీవా రెండో దశలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌కు స్టీల్ ఫైబర్ రీయిన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్ (ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ) విధానంలో వేసిన లైనింగ్ పనితనం నీటి ప్రవాహం ఆగిపోగానే బట్టబయలైంది. టెండర్ నిబంధనల ప్రకారం రాతి పొర, డీప్ కట్ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే షార్ట్ క్రీటింగ్ విధానంలో లైనింగ్ చేయాలి. కానీ.. నిబంధనను ఉల్లంఘించి, పనులు వేగంగా చేయాలనే మిషతో ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ విధానంలో లైనింగ్ వేశారు. చిన్న చిన్న ఇనుప తీగలు, సిమెంటు, సిలికా, ఇసుక, కంకర, నీటితో కలిపి ఎస్‌ఎఫ్‌ఆర్‌సీని తయారు చేస్తారు. కాలువకు రాతి పొర ఉన్న ప్రదేశంలో మాత్రమే.. కాలువ గట్టు వాలు (స్లోప్)ను క్రమానుగతంగా ఉండేలా సరిచేసుకుని (సెక్షనింగ్).. ఆ తర్వాత 38 మిల్లీమీటర్ల (ఎంఎం) మందంతో ఒకసారి, ఆ తర్వాత 38 ఎంఎం మందంతో మరోసారి అధిక ఒత్తిడితో ఎస్‌ఎఫ్‌ఆర్‌సీతో లైనింగ్ చేయాలి. కానీ, మట్టి పొరకే.. అదీ కాలువ గట్టు వాలును క్రమానుగతంగా ఉండేలా చేయకుండానే, గట్టు వాలు ఎగుడు దిగుడుగా ఉన్నప్పటికీ 10 నుంచి 20 ఎంఎం మందంతో ఎస్‌ఎఫ్‌ఆర్‌సీతో లైనింగ్ వేశారు. పనులు చేసిన సంస్థ కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందినది కావడంతో వాటిని పర్యవేక్షిస్తున్న అధికారులు నాణ్యతపై నోరు మెదపలేకపోయారు. నాణ్యతను పర్యవేక్షించాల్సిన క్వాలిటీ కంట్రోల్ విభాగం నిద్రపోయింది. బిల్లులు కూడా చెల్లించేశారు. గత సీజన్లో కాలువలో ప్రవహించిన నీటి ఉద్ధృతికే కాంక్రీట్ ఎక్కడికక్కడ జారిపోయి, కరిగిపోయి కొట్టుకుపోయింది.నాసిరకానికి ఈ ఫొటోనే సాక్ష్యం.. శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కొండమనాయునిపాలెం వద్ద పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌కు ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ విధానంలో అత్యంత నాసిరకంగా లైనింగ్ వేశారనడానికి ఇదిగో ఆధారం. ఒక సీజన్లో నీటి ప్రవాహానికే కాంక్రీట్ జారిపోయి, కరిగిపోయి కొట్టుకుపోయింది. కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అయ్యింది.ఈ ఫొటో మరో నిదర్శనం.. శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం కళ్లిపల్లి సమీపంలో పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌కు ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ విధానంలో అత్యంత నాసిరకంగా లైనింగ్ పనులు చేశారనడానికి ఇది మరో నిదర్శనం. కనీసం కాలువ స్లోప్ను కూడా సరి చేయకుండా ఇష్టారాజ్యంగా లైనింగ్ చేయడం వల్ల ఒక సీజన్లో నీటి ప్రవాహానికే కాంక్రీట్ కొట్టుకుపోయింది.ఇదిగో బహుమానంపుంగనూరు బ్రాంచ్ కెనాల్లో 26.2 కిలోమీటరు నుంచి 75.075 కిలోమీటర్ వరకు లైనింగ్ పనులు చేపట్టడానికి రూ.207.20 కోట్లతో 2024 డిసెంబర్ 3న ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఇవే పనులను జీఎస్టీ, సీనరేజీ వంటి పన్నులు మినహాయించి రూ.173.10 కోట్లకు ఎస్సార్ కన్స్ట్రక్షన్స్కు ప్రభుత్వం అప్పగించింది. సకాలంలో నాణ్యంగా పనులు చేయని ఆ కాంట్రాక్టు సంస్థపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం తద్భిన్నంగా వ్యవహరించింది. ఆ పనుల అంచనా వ్యయాన్ని రూ.309.92 కోట్లకు పెంచేస్తూ మే 4న ఉత్తర్వులు జారీ చేసింది. అంటే.. నాసిరకంగా పనులు చేసిన టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సంస్థకు రూ.102.72 కోట్ల మేర లబ్ధి చేకూర్చినట్లు స్పష్టమవుతోంది.నిబంధనలకు విరుద్ధంగా ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ లైనింగ్ టెండర్ నిబంధనల ప్రకారం రాతి పొర ఉన్న చోట్ల మాత్రమే షార్ట్ క్రీటింగ్ విధానంలో లైనింగ్ చేయాలి. నిబంధనల్లో ఎక్కడా ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ ప్రస్తావనే లేదు. టెండర్ పేర్కొన్న దానికి భిన్నంగా పని స్వభావం మారితే స్టేట్ లెవల్ టెక్నికల్ కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ) ఆమోదం పొంది.. ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. కానీ.. టెండర్లో నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలనే సాకు చూపి.. షార్ట్ క్రీటింగ్ విధానంలో పనులు చేస్తే జాప్యం జరుగుతుందని సాకులు వెతికి.. ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ విధానాన్ని కాంట్రాక్టర్లు ప్రతిపాదించారు. అయినా ఆ పనులను పర్యవేక్షిస్తున్న ఇంజినీరింగ్ అధికారులు నోరు మెదపలేక పోయారని జల వనరుల శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. రాతి పొర లేకున్నా.. మట్టి పొరకే.. కనీసం కాలువ గట్ల వాలును క్రమానుగతంగా సరి చేయకుండానే ఇష్టారాజ్యంగా అత్తెసరు మందంతో ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ విధానంలో కాంట్రాక్టర్లు లైనింగ్ పనులు కానిచ్చేశారు. షార్ట్ క్రీటింగ్ పద్ధతిలో లైనింగ్ చేస్తే చదరపు మీటరుకు రూ.1,407 చొప్పున బిల్లు చెల్లిస్తారు. అదే ఎస్‌ఎఫ్‌ఆర్‌సీతో లైనింగ్ చేస్తే రూ.1,854 చెల్లిస్తారు. కానీ.. హంద్రీ–నీవా పనుల్లో మాత్రం రూ.2,400 చొప్పున బిల్లులు చెల్లిండంపై ఇంజినీరింగ్ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ విధానంలో అత్యంత నాసిరకంగా వేసిన లైనింగ్ ఒక్క సీజన్లో నీటి ప్రవాహానికే ఎక్కడికక్కడ కొట్టుకుపోయింది.లైనింగ్ పనులు చేయాల్సింది ఇలా..» తొలుత కాలువపై ముళ్ల కంప చెట్లను తొలగించాలి. కాలువపై ఇన్స్పెక్షన్ పాత్ (దారి) వేయాలి. కాలువకు ఇరు వైపులా.. అడుగు భాగంలో ఇన్క్లెయిన్డ్ రోలర్ (పొక్లెయినర్‌కు రోలర్‌ను అమర్చడం)తో గట్టిపరచాలి.» ఆ తర్వాత 12 ఎంఎం, 20 ఎంఎం గ్రానైట్ కంకర, నాణ్యమైన ఇసుక, సిమెంటుతో తయారు చేసిన ఎం–25 మిక్సర్, ఎం–20 మిక్సర్‌తో పేవర్ మిషన్ ద్వారా కాలువకు ఇరు వైపులా లైనింగ్ వేయాలి. ఆ తర్వాత అడుగు భాగంలో లైనింగ్ వేయాలి. రెండు వారాలపాటు క్యూరింగ్ (నీటితో తడపాలి) చేయాలి.» రాతి పొర ఉన్న ప్రాంతాల్లో షార్ట్ క్రీటింగ్ విధానంలో లైనింగ్ చేయాలి. రాతి పొరకు ఇనుప బోల్ట్ కొట్టి.. దానికి ఇనుప జాలరీ అమర్చి.. దానిపై అధిక ఒత్తిడితో ఎం–20 కాంక్రీట్ వేయాలి. » పనులను ఏఈ, డీఈ, ఈఈలు నిరంతరం పర్యవేక్షించాలి. ఎస్ఈ, సీఈలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి. నాణ్యత నియంత్రణ విభాగం(క్వాలిటీ కంట్రోల్) అధికారులు ఎప్పటికప్పుడు సిమెంటు కాంక్రీట్ లైనింగ్ శాంపుల్స్‌ను తీసి.. ల్యాబొరేటరీల్లో పరీక్షించి నాణ్యతను ధ్రువీకరించాలి. నాసిరకంగా ఉన్నట్లు తేలితే.. వాటిని తొలగించి మళ్లీ నాణ్యంగా పనులు చేయించాలి.» పనులు దక్కించుకున్న ప్రధాన కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించడానికి వీల్లేదు. ఏవైనా పనులను సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించాలంటే జల వనరుల శాఖ అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి. 50 శాతం లోపు పనులను అధికారుల అనుమతితో సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించడానికి అవకాశం ఉంటుంది. కానీ.. పనుల నాణ్యతకు ప్రధాన కాంట్రాక్టరే బాధ్యత వహించాల్సి ఉంటుంది.లైనింగ్ పనులు చేసింది ఇలా..» కాలువ గట్లపై ముళ్ల కంప చెట్లను తొలంచి, దారిని వేశారు. కానీ.. ఇన్క్లెయిన్డ్ రోలర్‌తో కాలువ ఇరు వైపులా అడుగు భాగాన్ని గట్టి పరచకుండా కేవలం పొక్లెయిన్ బకెట్‌తో తూతూ మంత్రంగా గట్టిపరిచే పనులు కానిచ్చేశారు. దాంతో కాలువకు ఇరు వైపులా మట్టి ఎక్కడికక్కడ జారిపోయింది. » గతంలో కాలువ తవ్వినప్పుడు వచ్చిన మట్టిని, రాళ్లను గట్లపై పోశారు. ఆ గట్లపై ఉన్న రాళ్ల నుంచి కంకర తయారు చేశారు. ఆ కంకర పిండి పిండిగా నాసిరకంగా ఉంది. సమీపంలో వాగులు, వంకల్లో ఇసుకను తెచ్చారు. నాసిరకం కంకర, ఇసుక.. తక్కువ పరిమాణంలో సిమెంటుతో ఎం–25 మిక్సర్ (ఒక పాలు సిమెంటు, ఒక పాలు ఇసుక, రెండు పాళ్లు 20 ఎంఎం కంకర కలిపి తయారుచేసే మిశ్రమం), ఎ0–20 (ఒక పాలు సిమెంటు, 1.5 పాళ్లు ఇసుక, 3 పాళ్లు 12 ఎంఎం కంకర కలిపి తయారుచేసే మిశ్రమం) మిక్సర్ తయారు చేశారు. » కాలువకు ఇరువైపులా ఇన్క్లెయిన్డ్ రోలర్‌తో గట్టిపరచక పోవడంతో ఎక్కడికక్కడ మట్టి జారిపోతున్నా పేవర్ యంత్రాన్ని వినియోగించకుండా.. కార్మికులతోనే సిమెంటు కాంక్రీట్‌తో లైనింగ్ చేశారు. మట్టి జారిపోతున్నా సరే అలానే లైనింగ్ వేశారు. దీనివల్ల గత ఆగస్టులో కాలువకు నీటిని విడుదల చేయగానే లైనింగ్ ఎక్కడికక్కడ జారిపోయి కొట్టుకుపోయింది. ఎం–25, ఎం–20 కాంక్రీట్‌లో సిమెంటు తక్కువగా, ఇసుక ఎక్కువగా, నాసిరకం కంకర వినియోగించడం వల్ల లైనింగ్ చేసిన ప్రాంతాల్లో ఇసుకపైకి తేలి స్పష్టంగా కన్పిస్తోంది. -
మళ్ళీ నామినేషన్ దందా షురూ!
సాక్షి, అమరావతి: రూ.లక్ష లోపు అంచనా ఉన్న పనులను ఈఈ.. రూ.2 లక్షల్లోపు పనులను ఎస్ఈ.. రూ.3 లక్షల్లోపు పనులను సీఈ నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టర్లకు అప్పగించవచ్చన్నది ప్రభుత్వ నిబంధన. అదీ వరదలు, కరువు వంటి ఉత్పాతాలు ఏర్పడినప్పుడు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేందుకు సంబంధించిన పనులను మాత్రమే నామినేషన్ పద్ధతిలో అప్పగించాలన్నది నిబంధన. ఆ పనులకు టెండర్లు పిలిస్తే తక్షణమే సహాయక చర్యలు చేపట్టడానికి వీలుండదు కాబట్టి నామినేషన్ పద్ధతిలో అప్పగించే వెసులుబాటు కల్పించారు. కానీ, ఈ నిబంధనను నిక్కచ్చిగా అమలుచేయాల్సిన ప్రభుత్వమే దాన్ని నిలువునా పాతరేసింది. రూ.లక్ష కాదు, రూ.2 లక్షలు కాదు.. ఏకంగా రూ.480.22 కోట్ల విలువైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులను ఎన్సీసీ సంస్థకు ప్రభుత్వం కట్టబెట్టింది. ఇవి యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాల్సినవి కావు. అయినా, నిబంధనలు ఉల్లంఘించి వాటిని ఎన్సీసీ సంస్థకు అప్పగించడం వెనుక భారీఎత్తున కమీషన్లు చేతులు మారాయనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ అక్రమాలను కప్పెట్టుకోవడానికి కేబినెట్‌తో ఆమోదముద్ర వేయించడం గమనార్హం. అక్రమాల దందా పునరావృతంఅస్మదీయులకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టి.. ప్రభుత్వ ఖజానాను దోచిపెట్టి కమీషన్లు వసూలుచేసుకోవడం 2014–19 మధ్య ముఖ్యనేతలు రివాజుగా మార్చుకున్నారు. పోలవరం హెడ్‌వర్క్స్ పనుల్లో రూ.2,917 కోట్ల పనులను నవయుగ సంస్థకు నామినేషన్‌పై కట్టబెట్టడమే అందుకు పరాకాష్ట. దేశ చరిత్రలో ఇంత పెద్దఎత్తున నామినేషన్ పద్ధతిలో పనులు కట్టబెట్టిన దాఖలాలు ఎక్కడాలేవు. కృష్ణా పుష్కర ఏర్పాట్లలో భాగంగా ఘాట్ల నిర్మాణం దగ్గర నుంచి నీరు–చెట్టు పనుల వరకూ రూ.15 వేల కోట్లకు పైగా విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అస్మదీయులకు కట్టబెట్టింది. ఇప్పుడూ అదే రీతిలో నామినేషన్ దందాకు తెరతీసింది. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏ ఒక్క పనిని కూడా నామినేషన్‌పై కట్టబెట్టకపోవడం గమనార్హం. పూర్తికాక ముందే నిధులు మిగులా?.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 2014–19 తరహాలోనే మళ్లీ నామినేషన్ దందాకు తెరతీసింది. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం రెండో దశలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్ పనులను ఇందుకు వేదికగా చేసుకుంది. నిజానికి.. ఈ కెనాల్‌ను 79.6 కిమీ నుంచి 220.35 కిమీ వరకూ వెడల్పుచేసి, ప్రవాహ సామర్థ్యం పెంచే పనులకు రూ.1,929 కోట్ల వ్యయంతో 2021, సెపె్టంబరు 4న వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాంకేతిక అనుమతిచ్చింది. ఈ పనులకు నిర్వహించిన టెండర్లలో రూ.1,217.49 కోట్లకు ఎన్సీసీ సంస్థ దక్కించుకుని.. వాటిని పూర్తిచేయానికి 2023, ఫిబ్రవరి 1న ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ పనులను ఎన్సీసీ సంస్థ ఇప్పటివరకూ పూర్తిచేయలేదు. 25 శాతంలోపు మాత్రమే పూర్తయ్యాయని అధికారవర్గాలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాయి. వాస్తవానికి.. ఏదైనా పని పూర్తయ్యాకే ఆ పనికి కేటాయించిన నిధుల్లో మిగిలాయాన్నది తేల్చవచ్చు.కానీ.. ఇక్కడ పూర్తికాక ముందే వాటికి ప్రభుత్వం ఇచ్చిన సాంకేతిక అనుమతిలో రూ.711.51 కోట్ల మేర మిగులు ఉందంటూ తేల్చడంపై అధికారవర్గాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. ఇందులో రూ.480.22 కోట్ల వ్యయంతో పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌కు 75.075 కిమీ నుంచి 207.80 కిమీ వరకూ లైనింగ్ చేసే పనులను నామినేషన్ పద్ధతిలో ఎన్సీసీ సంస్థకు కట్టబెట్టాలని ముఖ్యనేత ఆదేశించారు. దాంతో ఆ పనులను ఎన్సీసీకి అప్పగిస్తూ జలవనరుల శాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. -
అడ్డదారిలో అయినవారికి..
సాక్షి, హైదరాబాద్: టీడీపీ పాలనలో ఆశ్రీత పక్షపాతం యథేచ్ఛగా సాగుతోంది. అయిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టడం కొనసాగుతోంది. తాజాగా రూ. 413 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను వైఎస్సార్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి కంపెనీకి కట్టబెట్టారు. టెండర్లలోనే టైలర్‌మేడ్ నిబంధనలు పెట్టి కావాల్సినవారికి అడ్డదారిలో కాంట్రాక్టులు కట్టబెట్టే మార్గాన్నే ఈ టెండర్లలోనూ ప్రభుత్వం అనుసరించింది. పనుల కోసం ఆర్కే ఇన్ఫ్రా-హెచ్‌ఈఎస్-కోయా సంస్థలు జాయింట్ వెంచర్‌గా ఒక టెండరు, గాయత్రి కన్స్ట్రక్షన్ తరపున ఒక టెండరు దాఖలయ్యాయి. శుక్రవారం హంద్రీ-నీవా ప్రాజెక్టు మదనపల్లె-3 సర్కిల్ కార్యాలయంలో సాంకేతిక, ధరల బిడ్స్‌ను పరిశీలించారు. గాయత్రి కన్స్ట్రక్షన్-డబ్ల్యుపీఐఎల్ జాయింట్ వెంచర్‌కు నిబంధనల మేరకు అర్హతలేదని నిర్ధారించారు. ఈ పని విలువలో సగం.. అంటే రూ.207 కోట్ల విలువైన కాలువ తవ్వకం, లైనింగ్ పనులను ఏడాది కాలంలో పూర్తి చేసి ఉండాలనే నిబంధన పెట్టారు. గాయత్రి ఈ పరిమాణం లో పనులు చేసినట్టు నిర్ధారణ కాలేదు. దీంతో ఆ సంస్థ తరపున దాఖలుచేసిన టెండర్‌ను అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ఆర్కే ఇన్ఫ్రా-హెచ్‌ఈఎస్-కోయా సంస్థలు దాఖలుచేసిన జాయింట్ వెంచర్ దాఖలు చేసిన ఏకైక టెండర్‌ను పరిశీలించారు. ఆ సంస్థ రూ.413కోట్ల పనికి రూ.430,29,99,999తో టెండర్ వేసింది.ఇది అంచనా విలువకు 4.0073 శాతం (రూ.13.50కోట్లు) ఎక్కువ. రెండే కంపెనీలు టెండర్లు వేయడం, అందులో ఒక కంపెనీకి అర్హత లేదని నిర్ధారించి కాంట్రాక్టును ఆర్కే ఇన్ఫ్రాకు కట్టబెట్టారు. చక్రం తిప్పిన నేత : కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను దక్కించుకునేందుకు వైఎస్సార్ జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత ముందునుంచీ కన్నేశారు. అదే జిల్లాకు చెందిన మరో టీడీపీనేత శ్రీనివాసులురెడ్డి టెండర్ దాఖలు చేయగా, ముందునుంచీ కన్నేసిన నేత టెండర్లు దాఖలు చేయకుండా పనుల్లో వాటా కావాలని కోరినట్టు ప్రచారం జరిగింది. దీన్ని ఖరారు చేస్తూ టీడీపీ నేతకే పనులు దక్కాయి. గడువు తొమ్మిది నెలలే :కుప్పం కాలువకు వచ్చే సంక్రాంతికి నీరందించాలని సీఎం నిర్ణయించారు. ఈ కాలువ పలమనేరు నియోజకవర్గంలోని అప్పినపల్లె గ్రామం నుంచి కుప్పం నియోజకవర్గంలోని పరమసముద్రం చెరువు వరకు సాగుతుంది. రూ. 413 కోట్ల అంచనా వ్యయంతో 143 కి లోమీటర్ల కాలువ, మూడుచోట్ల ఎత్తిపోతల పథకాలు, 285చోట్ల కల్వర్టులు, బ్రిడ్జిల నిర్మాణం జరగాలి. ఎనిమిది మండలాల్లో 4.5లక్షల మందికి తాగునీరు, 6,300 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్నది ఈ పథకం లక్ష్యం. ఈ పనులన్నింటిని పూర్తిచేసేందుకు ప్రభుత్వం కేవలం తొమ్మిది నెలల గడువును విధించింది. దీనిపై ఇంజనీర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


