
కానిస్టేబుల్ కుటుంబంపై టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని అనుచరుల దాడి
బాధితుడు వేడుకున్నా వారిపై కేసు నమోదు చేయని సీఐ
ఇక నేను పోలీసు ఉద్యోగం చేసి ప్రయోజనమేంటని ఆవేదన
డీఎస్పీకి ఫిర్యాదు చేస్తానన్న కానిస్టేబుల్
క్రికెట్ బాల్ కారుకు తగలడంతో చెలరేగిన వివాదం
పోలీసుస్టేషన్ ఎదుట బాధిత కానిస్టేబుల్ కుటుంబం ఆందోళన
అనంతపురం సెంట్రల్ : సామాన్య ప్రజలు అన్యాయానికి గురైతే ఠక్కున గుర్తొచ్చేది పోలీసులు. అలాంటిది న్యాయం చేసే పోలీసుకే పోలీసుస్టేషన్లో అన్యాయం జరుగుతోంది. తన భార్యపై దాడిచేసిన వారి మీద కేసు నమోదుచేయాలని రెండ్రోజులుగా ఓ కానిస్టేబుల్ పోలీసులను వేడుకుంటున్నా కనికరించడంలేదు. దాడికి పాల్పడిన వారు టీడీపీ ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు అనుచరులు కావడంతో చర్యలు తీసుకోవడానికి పోలీసు ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీంతో కానిస్టేబుల్, అతని కుటుంబ సభ్యులు శనివారం అనంతపురం నాలుగో పట్టణ పోలీసుస్టేషన్ వద్ద ఆందోళన చేశారు.
వివరాలివీ..
అనంతపురం శ్రీనగర్ కాలనీ సమీపంలోని ఎలైట్ హోమ్స్‌లో పోలీసు డాగ్‌స్క్వాడ్‌లో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ హరినాథ్‌కుమార్ ఉంటున్నారు. కింది పోర్షన్‌లో కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మేనల్లుడు తేజ సంబంధీకులు భువన్ చక్రవర్తి కుటుంబం ఉంటోంది. అయితే, శుక్రవారం సాయంత్రం హరినాథ్‌కుమార్, అతని స్నేహితుడు వాకింగ్‌కు వెళ్లారు.
అదే సమయంలో.. పక్కింటి బాలుడు క్రికెట్ ఆడుకుంటూ బంతి వేయాలని వీరిని కోరాడు. దీంతో సదరు కానిస్టేబుల్ బంతి వేయడంతో బాలుడు బ్యాట్‌తో కొట్టాడు. బంతి భువన్ చక్రవర్తి కారుకు తగిలింది. దీంతో.. ఆయన దాదాపు 20 మంది ఎమ్మెల్యే అమిలినేని అనుచరులను తీసుకొచ్చి కానిస్టేబుల్ ఇంటిపై దాడిచేశారు. ఇక ఈ విషయంపై నాల్గవ పట్టణ సీఐ జగీదీష్‌ను వివరణ కోరగా.. ఇరు వర్గాలు ఘర్షణకు దిగారని.. కానిస్టేబుల్ భార్య సుజాత తమతో దురుసుగా ప్రవర్తించారంటూ భువన్ చక్రవర్తి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారని ఆయన చెప్పారు.
స్టేషన్‌లో కూడా దాడి చేశారు
కానిస్టేబుల్ భార్య సుజాత మాట్లాడుతూ.. ‘మాకు న్యాయం చేయాలని స్టేషన్‌కు వస్తే అక్కడ కూడా వారు దాడిచేశారు. చెప్పుకోలేని మాటలు మాట్లాడారు. స్టేషన్‌లో శుక్రవారం రాత్రి 2 గంటల వరకూ ఉన్నాం. శనివారం కూడా మ.2 గంటల వరకూ ఉన్నప్పటికీ పోలీసులు మాకు న్యాయం చేయలేదు. పైగా నీ ఉద్యోగం ఊడిపోతుంది.. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో.. బట్టలు తీసుకుని కర్నూలు బందోబస్తుకు పో అంటూ నా భర్తను బెదిరిస్తున్నారు.
పోలీసుశాఖలో పనిచేసి ఏం ఉపయోగం? ఇంత అవమానకరమైన బతుకు బతకడం కంటే చావడమే మేలు. సీఎం సార్.. మమ్మల్ని కాపాడండి. మా ప్రాణాలకు ఏమైనా జరిగితే ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుదే బాధ్యత’.. అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.
పోలీసులకే రక్షణ లేకపోతే ఎలా?
ఈ సందర్భంగా స్టేషన్ వద్ద హరినాథ్‌కుమార్ మీడియా సమక్షంలో మాట్లాడుతూ.. ‘పోలీసు శాఖలో పనిచేస్తున్న నాకే రక్షణ లేకుండాపోతోంది. దాదాపు 20 మంది రౌడీలను నా ఇంటిపైకి తీసుకొచ్చి భువన్ చక్రవర్తి, అతని భార్య కళ్యాణి, చెల్లెలు అంజలి కలిసి నా భార్య సుజాతపై దాడిచేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని నాలుగో పట్టణ పోలీసుస్టేషన్‌కు వచ్చి వేడుకున్నా. కేసు తీసుకోవడానికి సీఐ నిరాకరిస్తున్నారు. ఎందుకంటే వారి వెనుక కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉన్నారట. ఇక నేను పోలీసు ఉద్యోగం చేసి కూడా ఏం ప్రయోజనం? ఈ ఘటనపై డీఎస్పీకి ఫిర్యాదు చేస్తా’.. అని చెప్పారు.