అందుబాటులోకి అడ్వాన్స్‌డ్ విద్యుత్ రైలింజన్
గుంతకల్లు: అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కలిగిన మరో విద్యుత్ రైలింజన్‌ను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. జీ5 3–ఫేజ్ ఎలక్ట్రికల్ లోకోమోటివ్ 44080 వ్యాగ్–9 హెచ్‌సీ (మైక్రో ప్రాసెసర్ బేస్డ్ హెవీ క్యాబులిటీ లోకోమోటివ్)ను శనివారం గుంతకల్లు రైల్వే లోకోషెడ్‌లో డీఆర్‌ఎం చంద్రశేఖర్‌గుప్తా, ఏడీఆర్‌ఎం సుధాకర్ జెండా ఊపి ప్రారంభించారు. డీఆర్‌ఎం మాట్లాడుతూ ఈ విద్యుత్ రైలింజన్ ప్రస్తుతం ఉన్న లోకోమోటివ్‌ల కంటే వేగంగాను, ఎక్కువ వ్యాగిన్లు (బోగీ)లు లాగే సామర్థం కలిగి ఉంటుందన్నారు. తొలుత ఈ లోకోను గూడ్స్‌రైళ్లకు ఉపమోగిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ప్రయాణికుల రైళ్లకు అనుగుణంగా మార్పు చేసి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కూడా వినియోగిస్తామన్నారు. కార్యక్రమంలో సీనియర్ డీఈఈ వీరయ్య, టీఆర్‌డీఈ సుదర్శన్, ఈఎల్‌ఎస్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
హెచ్చెల్సీకి నీటి సరఫరా బంద్
బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయం నుంచి ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కు వచ్చే నీటిని తుంగభద్ర బోర్డు అధికారులు శుక్రవారం బంద్ చేశారు. దీంతో శనివారం ఆంధ్ర సరిహద్దులోని 105వ కిలోమీటర్ వద్ద కాలువలో 90 శాతం మేర నీటి సరఫరా తగ్గుముఖం పట్టింది. గత ఏడాది జూలై 17న తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీకి నీరు విడుదల చేయగా.. అదే నెల 19న ఆంధ్ర సరిహద్దులోని 105వ కిలోమీటర్ వద్దరు నీరు చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి 180 రోజులు ఏకధాటిగా నీరు సరఫరా కొనసాగిందని హెచ్చెల్సీ అధికారులు తెలిపారు. హెచ్చెల్సీ వాటా 27.755 టీఎంసీలు, కేసీ కెనాల్ మళ్లింపు కోటా కింద మరో 3 టీఎంసీలు కలిపి మొత్తం 30.755 టీఎంసీలు కేటాయింపు చేసిన ట్లు వెల్లడించారు. నీటి సరఫరా నిలిపివేయడంతో హెచ్చెల్సీ కింద మిరప సాగు చేసిన ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెలాఖరు వరకు నీరు ఇస్తే తప్ప గట్టెక్కే పరిస్ధితి లేదని చెబుతున్నారు. కణేకల్లు హెచ్చెల్సీ సబ్ డివిజన్ పరిధిలో ఐదు వేల ఎకరాలు, ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లో జీబీసీ కింద 25 వేల ఎకరాల్లో మిరప సాగైంది. ప్రస్తుతం పూత, పిందె దశల్లో ఉంది. ఈ నెలాఖరు వరకు నీటిని సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.
పొంచి ఉన్న జల గండం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాకు జల గండం ముప్పు పొంచి ఉంది. అననుకూల వర్షాల నడుమ ఈసారి సాధారణ వర్షపాతం నమోదు కాని పరిస్థితి. ఈ ఏడాది (జూన్ – మే వరకు) ఇప్పటి వరకు 460 మి.మీకు గాను 456 మి.మీ వర్షం కురిసింది. తాజాగా 93 ఫిజోమీటర్ల నుంచి సేకరించిన గణాంకాల ప్రకారం భూగర్భజలాల నీటిమట్టం 9.56 మీటర్లుగా నమోదైంది. ఇక నుంచి వర్షాలు కురిసే పరిస్థితి లేనందున ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నీటిమట్టం మరింత తగ్గనుందని అంచనా వేస్తున్నారు.
డేంజర్ జోన్‌లోని మండలాలు
భూగర్భజలశాఖ తాజా నివేదిక పరిశీలిస్తే... 13 మండలాల్లో నీటి మట్టం క్రమంగా తగ్గుతోంది. అందులో రాయదుర్గం, అనంతపురం రూరల్, గుమ్మఘట్ట, బెళుగుప్ప, కణేకల్లు, బ్రహ్మసముద్రం, కంబదూరు, తాడిపత్రి, కూడేరు, పామిడి, డి.హిరేహాల్, కళ్యాణదుర్గం, కుందుర్పి మండలాలు ఉన్నాయి. ఇక పుట్లూరు, యాడికి, శెట్టూరు మండలాల్లో ఇప్పటికే ప్రమాదకరస్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ మండలాలన్నీ క్రమంగా నీటిమట్టం తగ్గుతూ వస్తుండటంతో ‘డేంజర్ జోన్’ కింద గుర్తించారు.
సురక్షిత మండలాలు ఇవే..
జిల్లాలోని పెద్దపప్పూరు, గార్లదిన్నె, ఉరవకొండ మండలాలు పూర్తిగా సేఫ్ జోన్‌లో నిలిచాయి. బొమ్మనహాళ్, రాప్తాడు, గుంతకల్లు, విడపనకల్లు, ఆత్మకూరు, యల్లనూరు, పెద్దవడుగూరు, అనంతపురం అర్బన్, వజ్రకరూరు, నార్పల, బుక్కరాయసముద్రం, గుత్తి, శింగనమల మండలాల్లో కూడా భూగర్భజలాల పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు నివేదిక వెల్లడిస్తోంది.
అందుబాటులోకి అడ్వాన్స్‌డ్ విద్యుత్ రైలింజన్
అందుబాటులోకి అడ్వాన్స్‌డ్ విద్యుత్ రైలింజన్


