రబీ సాగు అంతంత మాత్రమే
● 1.07 లక్షల హెక్టార్లకు గాను 77 వేల హెక్టార్లలో సాగు
● రాయితీ విత్తనం, పంటల బీమా లేనందున అనాసక్తి
అనంతపురం అగ్రికల్చర్: రబీ కింద పంటలు అంతంత మాత్రంగానే సాగులోకి వచ్చాయి. సీజన్ ముగిసే దశకు వచ్చినా ఆశించినస్థాయిలో పంటలు సాగు చేయలేదని వ్యవసాయశాఖ తాజా నివేదిక వెల్లడిస్తోంది. 1.07 లక్షల హెక్టార్లు అంచనా వేయగా.. 72 శాతంతో అంటే 77 వేల హెక్టార్లకు మాత్రమే సాగు పరిమితమైంది. అక్టోబర్‌లో సాధారణ వర్షపాతం నమోదైనా నవంబర్, డిసెంబర్‌లో వర్షాలు కురవకపోవడంతో సాగు మందగించినట్లు తెలుస్తోంది. ప్రధానపంట వర్షాధారంగా పప్పుశనగ 65 వేల హెక్టార్ల అంచనా కన్నా అధికంగా సాగులోకి వస్తుందని అనుకున్నా.. రాయితీ విత్తనం ఇవ్వకపోవడంతో సాగు బాగా తగ్గించినట్లు అవగతమవుతోంది. 50 వేల హెక్టార్ల వద్ద పప్పుశనగ ఆగిపోయింది. ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ కింద పరిహారం ఇవ్వకపోవడం, ఇక ఈ ఏడాది పంటల బీమా పథకం కూడా అమలు చేయకపోవడంతో రైతులు అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. ఇక వేరుశనగ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. 18 వేల హెక్టార్లు అంచనా వేయగా ప్రస్తుతానికి 8 వేల హెక్టార్ల వద్ద ‘సాగు’తోంది. జొన్న, మొక్కజొన్న సాగుపై రైతులు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. జొన్న 4,900 హెక్టార్లకు గాను 3,700 హెక్టార్లలో సాగు చేశారు. మొక్కజొన్న 7,888 హెక్టార్లకు గాను 10 వేల హెక్టార్ల పైచిలుకు విస్తీర్ణంలో సాగు చేశారు. ఉలవ 1,387 హెక్టార్లు, కుసుమ 800 హెక్టార్లు, పొద్దుతిరుగుడు 785 హెక్టార్లు, పత్తి 115 హెక్టార్లు, మినుము 280 హెక్టార్లు, పెసర 250 హెక్టార్లు... ఇలా కొన్ని పంటలు నామమాత్రంగా సాగులోకి వచ్చాయి. నీటి వసతి కింద వరి 6,069 హెక్టార్లు అంచనా వేయగా.. ప్రస్తుతానికి 1,400 హెక్టార్ల వద్ద ‘సాగ’వుతోంది. ఈ–క్రాప్ ప్రక్రియ ఇంకా 10 శాతం కూడా పూర్తి చేయకపోవడం విశేషం. ఫిబ్రవరి 28 లోపు పూర్తీ చేయాలని ఆదేశాలు ఉన్నా... సాగు మాదిరిగానే ఈ–క్రాప్ కూడా మందకొడిగా చేపడుతున్నారు.


