మట్కాకు ముకుతాడు వేయరా?
● తాడిపత్రిలో విచ్చలవిడిగా మట్కా
● నిర్వాహకులు అధికార పార్టీ వారే
● గొడవలు జరుగుతున్నా పట్టని పోలీసులు
● బీటర్లపైనే ప్రతాపం.. నిర్వాహకులపై కేసులు నిల్
తాడిపత్రి టౌన్: మట్కా మాఫియాకు తాడిపత్రి ప్రాంతం కేరాఫ్‌గా నిలుస్తోంది. సులభంగా సంపాదించాలనే ఆశతో మట్కాకు ఆకర్షితులైన వారు నిలువునా నష్టపోతున్నారు. ఆర్థికంగా కుదేలై కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నారు. సమూలంగా మట్కా నిర్మూలిస్తామంటున్న పోలీసులు ఆ దిశగా పురోగతి సాధించడం లేదు. దీంతో మట్కా రోజురోజుకూ విస్తరిస్తూ పోతోంది. పోలీసులు మామూళ్లు స్వీకరిస్తూ చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటమే ఇందుకు కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాడిపత్రి పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్, నందలపాడు, శ్రీనివాసపురం, ఆర్టీసీ బస్టాండ్, గన్నెవారిపల్లి, విజయనగర్ కాలనీల్లోని టీడీపీ నాయకులు మట్కా నిర్వాహకలుగా అవతారమెత్తి ఆయా ప్రదేశాల్లోని హోటళ్లు, లాడ్జీలు, చిన్నపాటి అంగళ్లను మట్కా కేంద్రాలుగా మార్చారు. రోజూ పట్టణం నుంచే రూ.50 లక్షల వరకు మట్కా వ్యాపారం టర్నోవర్ జరుగుతోందని సమాచారం.
ఆధిపత్యం కోసం గొడవలు
మట్కా వ్యాపారంలో రూ.లక్షల ఆదాయం వస్తుండటంతో నిర్వాహకులు కొంతమంది యువకులను గ్యాంగ్‌లుగా తయారు చేస్తున్నారు. ఆయా మట్కా కేంద్రాల వద్ద ఆధిపత్యం కోసం ఒక గ్యాంగ్ మరో గ్యాంగ్‌పై దాడులకు పాల్పడుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుస్తున్నాయి. అయితే దాడులకు పాల్పడిన రెండు గ్యాంగ్‌లు అధికారపార్టీకి చెందిన వారే కావడంతో పోలీసులు ఫిర్యాదు అందలేదన్న సాకుతో ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని తెలుస్తోంది. రెండు వారాల క్రితం పాత కూరగాయల మార్కెట్, పెద్ద బజార్‌లలో రెండు మట్కా గ్యాంగ్‌ల నడుమ రాళ్లదాడులు చోటు చేసుకొని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం పట్టణ ప్రజలను నిర్ఘాంతపోయేలా చేస్తోంది.
నిర్వాహకులపై కేసులేవీ?
తాడిపత్రి పట్టణ, రూరల్ పరిధిలోని పోలీసులు నిత్యం మట్కా బీటర్లపై కేసులు నమోదు చేస్తూ.. వారి వద్ద కొంతమేర నగదు దొరికిందని చూపుతున్నారు. అయితే ఇంతవరకు ఒక్క మట్కా నిర్వాహకున్ని కూడా పట్టుకోకపోవడంతో పోలీస్ చర్యలు ఎలా ఉన్నాయో అర్థం అవుతోంది. మట్కా నిర్వాహకుల నుంచి ప్రతి నెలా పోలీస్ అధికారులకు మామూళ్ల వెళ్తున్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. ప్రజలను మభ్యపెట్టేందుకు మట్కా బీటర్‌ను అరెస్ట్ చూపుతూ సాయంత్రానికి బెయిల్‌పై ఇంటికి పంపుతూ పోలీసులు చేతులు దులుపుకుంటున్నారు.


