నదులకు జీవం.. అడవుల రక్షణ

Conservation Of 13 Living Rivers Including Godavari And Krishna - Sakshi

‘నమామి గంగే’ తరహాలో 13 నదుల పరిరక్షణకు నడుం బిగించిన కేంద్రం

పర్యావరణ సమతుల్యతను కాపాడి ఏకరీతి వర్షపాతం సాధించే దిశగా నిర్ణయం

‘ఫ్లాష్‌ ఫ్లడ్స్‌’ నివారించి భూగర్భ జలమట్టాల్ని పెంచేందుకు కార్యాచరణ

సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదికల తయారీ బాధ్యత ఐసీఎఫ్‌ఆర్‌ఈకి అప్పగింత 

సాక్షి, అమరావతి: దేశంలోని గోదావరి, కృష్ణాతోపాటు 13 జీవ నదుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. నదీ తీరం వెంబడి ఇరువైపులా అడవులను పెంచడం ద్వారా పర్యావరణ సమతుల్యాన్ని సాధించడం.. హఠాత్తుగా వచ్చే వరదల (ఫ్లాష్‌ ఫ్లడ్స్‌)కు అడ్డుకట్ట వేయడం.. ఏడాది పొడవునా నదుల్లో నీటి ప్రవాహం ఉండేలా చేయడానికి సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక (డీపీఆర్‌)లు రూపొందించే బాధ్యతను ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రీసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌(ఐసీఎఫ్‌ఆర్‌ఈ)కి అప్పగించింది. అడవుల పెంపకం వల్ల నదీ పరీవాహక ప్రాంతంలో ఏకరీతిగా వర్షం కురిసే అవకాశం ఉంటుందని.. వర్షం నీటి ప్రవాహ ఉధృతికి అడ్డుకట్ట వేసి భూగర్భ జలాలు పెంపొందేలా చేస్తాయని.. ఇది నదిలో సహజసిద్ధ ప్రవాహాన్ని పెంచుతుందని పర్యావరణ నిపుణులు విశ్లేíÙస్తున్నారు. మరోవైపు భూమి కోతకు గురవకుండా అడవులు అడ్డుకుంటాయని, ఇది జలాశయాల్లో పూడిక సమస్యను పరిష్కరిస్తుందని చెబుతున్నారు. 

‘నమామి గంగే’ తరహాలో.. 
దేశంలో అత్యధిక శాతం ఆయకట్టుకు సాగునీటిని, అధిక శాతం ప్రజలకు తాగునీటిని అందించే జీవ నదులుగా బియాస్, చీనాబ్, జీలం, రావి, సట్లెజ్, లూని, యమున, నర్మద, గోదావరి, కృష్ణా, కావేరి, బ్రహ్మపుత్ర, మహానది పేరొందాయి. 
గంగా నది ప్రక్షాళన కోసం చేపట్టిన ‘నమామి గంగే’ ప్రాజెక్ట్‌ తరహాలోనే ప్రత్యేక పద్ధతుల ద్వారా ఈ 13 నదులను పరిరక్షించకపోతే తాగు, సాగునీటి ఇబ్బందులు తప్పవని అటవీ, పర్యావరణ శాఖ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచి్చంది. 
దీని ఆధారంగా ఈ నదుల పరిరక్షణకు సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక (డీపీఆర్‌)లు రూపొందించే బాధ్యతను డెహ్రాడూన్‌ కేంద్రంగా పనిచేసే ఐసీఎఫ్‌ఆర్‌ఈకి కేంద్రం అప్పగించింది. 
నది జన్మించిన ప్రదేశం నుంచి.. సముద్రంలో కలిసే వరకూ నదికి ఇరువైపులా ఎంత విస్తీర్ణంలో అడవుల్ని పెంచవచ్చనేది డీపీఆర్‌లో ఐసీఎఫ్‌ఆర్‌ఈ పొందుపర్చనుంది. ఈ నదుల పరిధిలోని అడవుల్లో ఎలాంటి చెట్లను పెంచాలన్నది నిర్ణయిస్తుంది. 
ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే అటవీ విస్తీర్ణం పెరిగి పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల అన్నిచోట్లా ఏకరీతి వర్షపాతం సాధ్యమవుతుంది. 
వర్షపు నీటిని అడవులు ఒడిసి పట్టడం ద్వారా నీటి ప్రవాహాన్ని క్రమబద్ధం చేసి ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ను నివారిస్తాయి. దీనివల్ల భూగర్భ జలమట్టాలు స్థిరపడి నదిలో సహజసిద్ధ (ఊట) ప్రవాహం పెరిగేందుకు దోహదం చేస్తుంది. తద్వారా వేసవిలోనూ నదుల్లో పుష్కలంగా జలాలు లభిస్తాయి. 
అడవుల్ని పెంచడం వల్ల జలాలు కలుషితం కావు. భూమి కోత నివారించబడి ప్రాజెక్టుల్లో పూడిక చేరదు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top