Tiger Mating Season: ఏకాంతమైతేనే 'సై'ఆట

Confluence of Tigers in calm atmosphere Breeding time of tigers - Sakshi

ప్రశాంత వాతావరణంలోనే పెద్దపులుల సంగమం  

అందుకు ప్రతికూలంగా మారిన మానవ సంచారం 

ఎన్‌టీసీఏ ఆదేశాలతో దేశ వ్యాప్తంగా టైగర్‌ రిజర్వ్‌లలో ఆంక్షలు 

అడవుల నిర్మానుష్యానికి ఆదేశాలు 

జూన్‌ 1 నుంచి మూడు నెలల పాటు పులుల సంతానోత్పత్తి సమయం  

ఆత్మకూరు రూరల్‌: జూన్‌ 1 నుంచి ఆగస్టు 31 వరకు శ్రీశైలం అటవీ రేంజ్‌ పరిధిలోని ఇష్టకామేశ్వరి పుణ్యక్షేత్రానికి భక్తుల రాకపోకలను తాత్కాలికంగా అటవీ శాఖ నిలిపేసింది. ఇష్టకామేశ్వరి క్షేత్రం ఒక్కటే కాదు.. అన్ని పర్యావరణ పర్యాటక కేంద్రాలనూ ఈ మూడు నెలలు మూసివేశారు. ఇది పెద్ద పులుల సంతానోత్పత్తి సమయం(బ్రీడింగ్‌ పీరియడ్‌) అయినందున వాటికి ఏకాంతం కల్పించడమే ఈ ఆంక్షలకు కారణమని అటవీ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

పెద్దపులి ఎంతో సిగ్గరి మనస్థత్వం కలిగినది. ఎంతో ఠీవీగా రాజసంతో నడిచే పెద్దపులి తన సంగమ సమయంలో మాత్రం పూర్తిగా ఏకాంతాన్ని కోరుకుంటుంది. అడవిలో ఏ చిన్న అలజడి రేగినా పులులు సంగమంలో పాల్గొనవు. అయితే తరుచూ అడవుల్లో మానవ సంచారం కారణంగా పెద్ద పులుల్లో సంగమించడం తగ్గిపోయి గర్భధారణ అవకాశాలు పడిపోతున్నాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఎన్‌టీసీఏ(నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ) 2015లో పులుల అభయారణ్యాలున్న రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది.

ఆ మేరకు రుతుపవనాల సమయమైన జూన్‌ 1 నుంచి ఆగస్టు 31 వరకు అభయారణ్యాల్లో మానవ సంచారాన్ని అదుపు చేసే చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఈ ఏడాది జూన్‌ 1 నుంచి ఈ నిషేధాజ్ఞలను ఎన్‌ఎస్‌టీఆర్‌(నాగార్జునసాగర్‌–శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌), జీబీఎం(గుండ్ల బ్రహ్మేశ్వరం) అభయారణ్యాల పరిధిలో అటవీ శాఖ అమలు చేస్తోంది. దీంతో అభయారణ్యాల పరిధిలోని అన్ని ఎకో టూరిజం రిసార్ట్‌లు, జంగల్‌ సఫారీలు, పుణ్యక్షేత్రాలను మూసివేశారు. అవసరం అనుకుంటే ఈ నిషేధాజ్ఞలను మరో రెండు నెలలు కూడా పొడిగించే అవకాశాలున్నాయి. 

తల్లి తలపైకెక్కిన పులి కూనలు   

ఆ సమయంలో మనుషుల పైనా దాడి చేసే అవకాశం  
పులులు సంతానోత్పత్తి సమయాల్లో చాలా ఆవేశపూరితంగా ఉంటాయి. సంగమం సమయంలో ఆవేశంతో మనుషులపై దాడులకు పాల్పడతాయి. అందుకే పులుల సంతానోత్పత్తి కాలంలో నల్లమలలోని అన్ని పర్యాటక, పుణ్యక్షేత్రాలను తాత్కాలికంగా మూసివేయించాం. 
– అలెన్‌ చోంగ్‌ టెరాన్, డీఎఫ్‌వో, ఆత్మకూరు డివిజన్, నంద్యాల జిల్లా  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top