అప్పు చేసి ఫీజులు | Complaints to the Higher Education Council and the Higher Education Department regarding Fee Reimbursement | Sakshi
Sakshi News home page

అప్పు చేసి ఫీజులు

Apr 12 2025 4:15 AM | Updated on Apr 12 2025 8:06 AM

Complaints to the Higher Education Council and the Higher Education Department regarding Fee Reimbursement

అందని రీయింబర్స్‌మెంట్‌.. అప్పుల పాలవుతున్న తల్లిదండ్రులు 

సర్టిఫికెట్లు చేతికి రాక పిల్లల చదువులకు గండం  

చేసేది లేక పొలం బాట పడుతున్న విద్యార్థులు 

మంత్రి లోకేశ్‌ను ట్యాగ్‌ చేస్తూ పిల్లల అవస్థలపై పోస్ట్‌లు 

ఉన్నత విద్యా మండలి, విద్యా శాఖకు ఫిర్యాదుల వెల్లువ 

వైఎస్సార్‌ సీపీ హయాంలో క్రమం తప్పకుండా ఫీజులు 

పిల్లల చదువులకు పూర్తి అండగా నిలిచిన వైఎస్‌ జగన్‌  

ఐదేళ్లలో ఏకంగా రూ.18,663.44 కోట్లు వ్యయం  

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలానికి చెందిన మన పార్టీ కార్యకర్త కుమార్తె పి.పుష్పిత నూజివీడు పాలిటెక్నిక్‌ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతోంది. రూ.30 వేలు ఫీజు కట్టలేదని హాల్‌ టికెట్‌ ఇవ్వలేదు. దయచేసి హాల్‌ టికెట్‌ ఇప్పించి పరీక్ష రాసేలా సాయం చేయగలరని ప్రార్థన..!  – మంత్రి లోకేశ్‌కు ‘ఎక్స్‌’ ఖాతాలో ఓ టీడీపీ కార్యకర్త అభ్యర్థన ఇదీ!! 

పిల్లల ఫీజుల విషయం రచ్చకెక్కడంతో వివాదాల్లో ఇరుక్కోవడం ఎందుకనే ఉద్దేశంతో కాలేజీ యాజమాన్యం ఆ ఒక్క విద్యార్థినికి మాత్రం హాల్‌టికెట్‌ విడుదల చేసింది. కానీ ఫీజులు మంజూరుకాక, కాలేజీకి వెళ్లలేక మౌనంగా కుమిలిపోతున్న లక్షల మంది పిల్లల గోడును పట్టించుకునేవారే కరువయ్యారు. 

సాక్షి, అమరావతి:  గత ఐదేళ్లూ క్రమం తప్పకుండా ఫీజు డబ్బులు అందుకుని ఆత్మ విశ్వాసంతో చదువులపై దృష్టి సారించిన విద్యార్థులంతా ఇప్పుడు  చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో దిక్కు తోచని పరిస్థితుల్లో కూరుకుపోయారు. ఒకపక్క విద్యా సంవత్సరం ముగుస్తున్నా ఫీజుల డబ్బులు అందకపోవడం, సర్టిఫికెట్లు చేతికి రాకపోవడంతో భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్నారు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలవుతుండగా.. కొందరు విద్యార్థులు చదువులకు దూరమై కూలీలుగా మారిపోయి పొలం పనులకు వెళుతున్న  దుస్థితి మళ్లీ కనిపిస్తోంది. 

రెండేళ్లలో ఇవ్వాల్సింది రూ.7,800 కోట్లు 
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ప్రతి క్వార్టర్‌కు రూ.700 కోట్ల చొప్పున ఏడాదికి రూ.2,800 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనికి అదనంగా వసతి దీవెన కింద ఏప్రిల్‌లో మరో రూ.1,100 కోట్ల చొప్పున హాస్టల్‌ ఖర్చుల కోసం అందచేయాలి. అంటే ఒక విద్యా సంవత్సరంలో రూ.3,900 కోట్లు విద్యార్థులకు ఇవ్వాలి. మొత్తంగా రెండేళ్లలో రూ.7,800 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. పలు దఫాలు తల్లిదండ్రులు, పిల్లలు నిలదీయడంతో రూ.వెయ్యి కోట్లు విడుదల చేసినట్లు చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్నా అవి తమకు చేరలేదని చాలా కాలేజీలు అంటున్నాయి. 

ఇక ఈ ఏడాది బడ్జెట్‌ కేటాయింపుల్లోనూ ఫీజులకు  చంద్రబాబు ప్రభుత్వం భారీగా కోతలు విధించడంతో తల్లిదండ్రులు హతాశులయ్యారు. రాజకీయాలకు అతీతంగా చదువులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం పిల్లలను బలి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రైవేటు కళాశాలల్లో ఫీజుల వేధింపులపై ఉన్నత విద్యా మండలి, ఉన్నత విద్యా శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా  ఎక్కడా స్పందన కనిపించట్లేదు. పైగా దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తున్న ఉన్నత విద్యా మండలి అధికారాలకు త్వరలో కత్తెర వేసేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం.   

క్వార్టర్‌కే దిక్కులేదు.. సెమిస్టర్‌ బాంబు..! 
గత ప్రభుత్వం విద్యార్థుల చదువులకు సంపూర్ణ భరోసా కల్పిస్తూ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేసింది. పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందిస్తూ ప్రతి త్రైమాసికానికి సంబంధించి ఫీజులను విద్యార్థుల తల్లులు ఖాతాల్లో నేరుగా జమ చేసే విధానాన్ని తెచ్చింది. క్రమం తప్పకుండా ఫీజులు చెల్లించడంతో కళాశాలలపై ఆర్థిక భారం చాలావరకు తగ్గింది. 

టీడీపీ కూటమి సర్కారు వచ్చాక పారదర్శకతకు పాతరేసింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా కళాశాలలకే ఫీజులు చెల్లిస్తామని చెప్పి అది కూడా అమలు చేసిన పాపాన పోలేదు. త్రైమాసికం వారీగా ఫీజులు చెల్లించటానికే ముప్పుతిప్పలు పెడుతున్న ప్రభుత్వం ఇకపై సెమిస్టర్‌ వారీగా ఇస్తామని ప్రకటించడంతో ప్రైవేట్‌ విద్యా సంస్థల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.  

ప్రైవేట్‌ పీజీ  రీయింబర్స్‌మెంట్‌ గాలికి.. 
ప్రైవేటులో పీజీకి సైతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీలిచ్చారు. దీన్ని నమ్మి ప్రైవేటు కాలేజీల్లో పీజీ కోర్సుల్లో చేరిన విద్యార్థులంతా అప్పులు చేసి ఫీజులు కట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.  

రూ.3 వడ్డీకి రూ.20 వేలు అప్పు చేశా 
మా అమ్మాయి విజయవాడలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతోంది. ప్రభుత్వం ఫీజుల డబ్బులు ఇవ్వకపోవడంతో మూడు రూపాయల వడ్డీకి రూ.20 వేలు అప్పు చేసి కాలేజీకి కట్టా. ప్రతి నెలా రూ.600 వడ్డీ కడుతున్నా. నా భర్త పక్షవాతంతో మంచానికి పరిమితమయ్యాడు. పనులు దొరకడం లేదు. ఇల్లు గడవడం కష్టంగా ఉంది.  – కె.కుమారి, ఇంటర్‌ విద్యార్థిని తల్లి, విజయవాడ 

అప్పు చేసి రూ.40 వేలకు పైగా కట్టాం
తిరుపతి సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాలలో మా అబ్బాయి బీటెక్‌ చదువుతున్నాడు. ప్రభుత్వం ఫీజులు ఇవ్వకపోవడంతో అప్పు చేసి రూ.40 వేలకు పైగా కాలేజీకి కట్టాం. నా భర్త మేస్త్రీ పని చేస్తారు. ఆయన కూలితోనే కుటుంబం గడవాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వస్తుందనే ఆశతో పెద్దబ్బాయిని ఇంజనీరింగ్‌లో చేర్పించాం. ఇప్పుడు పరిస్థితి తల్లకిందులైంది. ఇంకో అబ్బాయి ఇంటర్‌ చదువుతున్నాడు.      – ప్రభావతమ్మ, ఇంజినీరింగ్‌ విద్యార్థి తల్లి, తిరుపతి  

జగన్‌ హయాంలో ఆదుకున్నారిలా..
జగనన్న విద్యా దీవెన:     రూ.12,609.68 కోట్లు 
వసతి దీవెన :     రూ.4,275.76 కోట్లు 
2017-19 మధ్య టీడీపీ పెట్టిన బకాయిల చెల్లింపు: రూ.1,778 కోట్లు 
ఐదేళ్లలో చేసిన ఖర్చు రూ.18,663.44 కోట్లు 
వైఎస్సార్‌సీపీ హయాంలో హాస్టల్‌ మెయింటెనెన్స్‌ చార్జీలు (పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌ షిప్‌ - ఎంటీఎఫ్‌) 
విభాగం                                   చెల్లింపులు(ఒక్కో విద్యార్థికి) 
ఐటీఐ                                          రూ.10 వేలు 
పాలిటెక్నిక్‌                                    రూ.15 వేలు 
డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ కోర్సులు    రూ.20 వేలు 
(నోట్‌: వీలైనంత ఎక్కువ మందిని అర్హులుగా చేర్పించేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కుటుంబ వార్షిక ఆదాయం పరిమితిని పెంచింది. గతంలో బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీలకు వార్షిక ఆదాయ పరిమితి రూ.లక్ష ఉంటే, ఎస్సీ, ఎస్టీలకు రూ.2 లక్షలకు ఉండేది. 2019 - 24 మధ్య వైఎస్సార్‌ సీపీ హయాంలో అన్ని వర్గాల వారికి  కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచి ఎక్కువమందికి లబ్ధి చేకూర్చారు)   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement