AP: టీమ్‌ 24.. కొత్త జట్టు రెడీ!

CM YS Jaganmohan Reddy exercise on Cabinet Reorganization - Sakshi

మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కసరత్తు 

11న నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ హరిచందన్‌ను కలిసిన సీఎం 

కొత్త జిల్లాలు, నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకార తేదీలపై చర్చ

నేడు మంత్రివర్గం చివరి భేటీ

కొత్త జట్టు కూర్పుపై స్పష్టతకు అవకాశం.. సామాజిక న్యాయానికి మరోసారి పెద్దపీట

రెండున్నరేళ్ల తర్వాత కొత్తవారికి అవకాశమిస్తానని ఆదిలోనే చెప్పిన సీఎం.. కరోనా వల్ల జాప్యం

సాక్షి, అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై సీఎం వైఎస్‌ జగన్‌ కసరత్తు చేస్తున్నారు. బుధవారం విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో సమావేశమైన సీఎం వైఎస్‌ జగన్‌ తొలుత పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఏర్పాటైన కొత్త జిల్లాల గురించి వివరించారు. మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణపై ఈ సందర్భంగా గవర్నర్‌తో చర్చించినట్లు తెలిసింది. కొత్త మంత్రుల ప్రమాణస్వీకార తేదీల గురించి కూడా గవర్నర్‌తో చర్చించినట్లు సమాచారం. ఈ నెల 11వతేదీన నూతన మంత్రులతో గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సముచిత ప్రాధాన్యం కల్పించి సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వైఎస్సార్‌సీపీ వర్గాలు వెల్లడించాయి.

నేడు మంత్రివర్గ భేటీ
నూతన మంత్రివర్గంపై తుది కసరత్తు చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలపై చర్చించనున్నారు. ప్రస్తుత మంత్రివర్గంతో నిర్వహించే చివరి సమావేశం ఇదే కానుందని వైఎస్సార్‌సీపీ వర్గాలు వెల్లడించాయి. ఈ భేటీ తర్వాత మంత్రులు రాజీనామాలు చేసే అవకాశం ఉంది.

ఆదిలోనే స్పష్టత..
2019 ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లతో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాలను గెలుచుకుని వైఎస్సార్‌సీపీ ఆఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. 2019 మే 30న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జూన్‌ 8న మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. రెండున్నరేళ్ల తర్వాత కొత్త వారికి మంత్రులుగా అవకాశం కల్పిస్తామని, మంత్రివర్గం నుంచి బయటకు వచ్చినవారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. రెండున్నరేళ్లకు ఒకసారి చొప్పున ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టత ఇచ్చారు. కరోనా మహమ్మారి  వల్ల మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో కొంత జాప్యం జరిగింది. ఆ ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణపై దృష్టి సారించారు.

సామాజిక న్యాయానికి పెద్దపీట..
మంత్రివర్గంలో సామాజిక న్యాయానికి సీఎం జగన్‌ పెద్దపీట వేశారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో 60 శాతం మంత్రి పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చి సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఐదుగురికి, బీసీల నుంచి ఏడుగురికి, ఎస్టీల నుంచి ఒకరికి, మైనార్టీల నుంచి ఒకరికి, కాపు సామాజిక వర్గం నుంచి నలుగురికి, కమ్మ సామాజిక వర్గం నుంచి ఒకరికి, రెడ్డి సామాజిక వర్గం నుంచి నలుగురికి, క్షత్రియుల నుంచి ఒకరికి, వైశ్య సామాజిక వర్గం నుంచి ఒకరికి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. ఉప ముఖ్యమంత్రులుగా ఐదుగురిని నియమించగా వారిలో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలవారే కావడం గమనార్హం. తొలిసారిగా ఎస్సీ మహిళ మేకతోటి సుచరితను హోంమంత్రిగా నియమించారు. ఇప్పుడు కూడా అదే పంథాను కొనసాగిస్తూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.    

గవర్నర్‌తో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో సమావేశమయ్యారు. ఈ నెల 11న రాష్ట్ర మంత్రివర్గాన్ని పునర్య్వవస్థీకరిస్తారన్న సమాచారం నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. విజయవాడలోని రాజ్‌భవన్‌కు బుధవారం సాయంత్రం 5.15 గంటలకు చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌కి గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్‌ హరిచందన్‌తో సీఎం వైఎస్‌ జగన్‌ దాదాపు 50 నిమిషాలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్గ పునర్య్వవస్థీకరణ గురించి సీఎం గవర్నర్‌కు వివరించినట్టు సమాచారం. ఇటీవల చేపట్టిన జిల్లాల పునర్విభజనతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి సీఎం వైఎస్‌ జగన్‌ గవర్నర్‌కు వివరించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top