వైఎస్సార్‌ చేయూతను ప్రారంభించడం నా అదృష్టం

CM YS Jagan Said It Was My Good Fortune To Start YSR Cheyutha - Sakshi

సాక్షి, అమరావతి: మహిళా సాధికారతే లక్ష్యంగా అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఉద్దేశించిన వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్‌ చేయూతను ప్రారంభించడం నా అదృష్టం. 45 నుంచి 60 ఏళ్ల మహిళలకు ఏ పథకం లేదు. వైఎస్సార్‌ చేయూత ద్వారా వారి కుటుంబాలకు మంచి జరగాలి. వీరికి ప్రభుత్వానికి సంబంధించి ఏ పథకమూ లేదు. కానీ కుటుంబాలను నడిపించే బాధ్యత వీరిదే. వీరికి మంచి జరిగితే.. కుటుంబానికి మొత్తానికి మంచి జరిగినట్టే. వీరికి మంచి జరగాలనే ఈ పథకం.

కార్పొరేషన్లను ప్రక్షాళన చేశాం
గతంలో కార్పొరేషన్ల పేరుతో రుణాలు ఇచ్చేవారు. గ్రామంలో 1,000 మంది ఉంటే.. ఒకరికో, ఇద్దరికో రుణాలు వచ్చే పరిస్థితి. అదికూడా రాజకీయపలుకుబడి ఉండి, లంచాలు ఇచ్చుకునే పరిస్థితి. దీనివల్ల ఎవ్వరికీ ఏమీ జరిగేది కాదు, ఎవ్వరికీ ఉపయోగపడేది కాదు. మిగిలిన వాళ్లు బాధపడాల్సి వచ్చేది. ఇవన్నీ మార్పులు చేస్తూ, ఈవయస్సులో ఉన్న అక్కలకు తోడుగా ఉండాలనే ఉద్దేశంతో కార్పొరేషన్లను ప్రక్షాళన చేశాం.మొదట పెన్షన్‌ రూపంలో డబ్బు ఇద్దామనుకున్నాం. నెలకు రూ.1,000 అనుకుంటే.. ఏడాదికి రూ.12వేలు. 45ఏళ్లకే పెన్షన్‌ ఏంటి? అంటూ మమ్మల్ని వెటకారం చేశారు. పోనీలే అనుకుని ఏడాదికి రూ.12వేలు కాదు, రూ.18750 ఇస్తాం.

నాలుగేళ్లపాటు చేయిపట్టుకుని నడిపిస్తాం అని చెప్పి ఈ పథకాన్ని తీసుకువచ్చాం. ప్రతి ఏటా రూ.18,750 చొప్పున రూ.75వేలు ఇస్తున్నాం. తమ జీవితాలను మార్పు చేసుకునే అవకాశం మహిళలకు వస్తుంది. దీన్ని ఎన్నికల ప్రణాళికలో పెట్టాం. అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి పథకాన్ని వర్తింపు చేస్తామని చెప్పాం. మీ తమ్ముడిగా, అన్నగా చేయగలుగుతున్నాం. ఈ పథకంలో ఒక అడుగు ముందుకు వేశాం. అక్కల అకౌంట్లోకి నేరుగా బదిలీచేస్తున్నాం. పాత అప్పులకి జమచేసుకోకుండా అన్‌ఇన్‌కంబర్డ్‌ బ్యాంకు ఖాతాల్లోకి పంపుతున్నాం. దీనికోసం బ్యాంకులతో మాట్లాడాం. దీంతో ఇంకో అడుగు ముందుకు వేశాం. అక్కలకు, చెల్లెమ్మలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ముందడుగు వేశాం.  ('వైఎస్సార్‌ చేయూత'ను ప్రారంభించిన వైఎస్‌ జగన్‌)

వ్యాపార అకాశాలను మీ ముందుకు తీసుకొచ్చాం
పాల రంగంలో దేశంలోనే దిగ్గజ సంస్థ అమూల్‌తో ఒప్పందం చేసుకున్నాం. రియలన్స్, హిందుస్థాన్‌ లీవర్, ప్రాక్టర్‌ అండ్‌ గాంబల్, ఐటీసీ లాంటి దిగ్గజ కంపెనీలో ఒప్పందాలు చేసుకున్నాం. రాబోయే కాలంలో మరిన్ని పెద్ద కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటాం. మహిళలకు వ్యాపార అవకాశాలను అందుబాటులోకి తీసుకు రావడమే లక్ష్యం. ప్రతి అక్కకు, చెల్లెమ్మకు 2 పేజీల లేఖ కూడా పంపిస్తున్నాం. ప్రభుత్వం చూపుతున్న వ్యాపార అవకాశాలను ఉపయోగించుకోవాలని, దాని ద్వారా మేలు పొందాలని అనుకుంటే.. ఆప్షన్‌ ఇవ్వొచ్చు. దీనికోసం బ్యాంకులతో కూడా ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. కంపెనీలు తమ ఏజెన్సీలకు ఇచ్చే రేటుకన్నా తక్కువ రేటుకు తమ ఉత్పత్తులను ఇస్తారు. దీనివల్ల ఎక్కువ లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా వృద్దిచెందేలా సుస్థిర జీవనోపాధి పొందవచ్చు.

అక్క, చెల్లెమ్మలు తమ కాళ్లమీద తాము నిలబడాలి
గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు మిమ్మల్నిఅందర్నీకూడా ఈ రెండు పేజీల లేఖతో మీ ముందుకు వస్తారు. తమకు మేలు జరుగుతుందని అక్కలు అనుకున్నప్పుడు.. ఆ ఆప్షన్‌ ఎంపిక చేసుకున్న తర్వాత సెర్ప్, మెప్మా ప్రతినిధులు ఆ మహిళతో మాట్లాడతారు. కంపెనీ ప్రతినిధులతో మాట్లాడతారు, బ్యాంకులతో ఆ అధికారులు మాట్లాడుతారు. ఆ వ్యాపారంలో వాళ్లు అడుగుపెట్టేలా ముందుకు సాగుతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45 నుంచి 60 ఏళ్లవరకూ ఉన్న మహిళలకు నాలుగేళ్లలో రూ.75వేల వరకూ ఇస్తున్నాం. ప్రతి ఏటా రూ.18750 లు ఇస్తాం. ఈ డబ్బును సద్వినియోగం చేసుకోవాలి. అక్క, చెల్లెమ్మలు తమ కాళ్లమీద తాము నిలబడాలి. 

కానీ, ఇదే చేయాలని ఏ అక్కమీద కూడా ఆంక్షలు లేవు. ఇది పూర్తిగా మీ స్వేచ్ఛ. ప్రభుత్వం మాత్రం అక్కచెల్లెమ్మలకోసం ఏడాదికి రూ.18,750 ఇస్తుంది. డబ్బు దేనికి వాడుకోవాలన్నది అది వారి ఇష్టం. లేదు ప్రభుత్వం చూపించిన అవకాశాల వల్ల లాభం జరుగుతుందని అనుకుంటే.. వారికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఎన్ని ఉన్నా, అట్టడుగున ఉన్న మహిళలకు చేయూత నందించడానికి, వారి కాళ్లమీద వాళ్లు నిలబడ్డానికి ఈనిర్ణయం తీసుకున్నాం. దాదాపు 25 లక్షల కుటుంబాలకు ఈరోజు మేలు జరుగుతుంది. 

దరఖాస్తుకు మరో అవకాశం
జాబితాలో ఎవరిపేరైనా లేకపోతే ఎవ్వరూ కూడా కంగారు పడాల్సిన పనిలేదు. మన ప్రభుత్వం ప్రతి అక్కకు, చెల్లెమ్మకు ఎలా మేలు చేయాలని ఆలోచించే ప్రభుత్వమే. గ్రామ సచివాలయానికి వెళ్లి అర్హతలు చూసుకుని మళ్లీ దరఖాస్తు చేసుకోండి. వచ్చే నెలలో ఈ దరఖాస్తులను పరిశీలించి అందరికీ అందేలా చర్యలు తీసుకుంటారు. 60 ఏళ్లు వచ్చే వరకూ ఈపథకం కొనసాగుతుంది.. అక్కడ నుంచి వారికి పెన్షన్‌ ప్రారంభం అవుతుంది. ఆ సమయానికి ఏడాదికి దాదాపు రూ.30వేల రూపాయలు వస్తాయి. 45 ఏళ్లు వయసు చేరుకున్న తర్వాత ప్రతి ఏటా మహిళలు ఈ పథకంలోకి వస్తారు. అక్కచెల్లెమ్మలకు అన్ని రకాలుగా తోడుగా మీ కుటుంబాలకు మేలు జరగాలని కోరుకుంటున్నాం' అని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top