మధ్యతరగతి ప్రజలకూ సొంతిల్లు

CM YS Jagan Review With Municipal Department Officials - Sakshi

నగరాలు, పట్టణాల్లో తక్కువ ధరకు క్లియర్‌ టైటిల్‌తో వివాదాల్లేని ప్లాట్లు

మున్సిపల్‌ శాఖ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌   

లే అవుట్ల అభివృద్ధి.. లాభాపేక్ష లేకుండా లాటరీ పద్ధతిలో కేటాయింపు

 ఇందుకోసం మేధోమథనం చేసి  స్పష్టమైన విధానాన్ని రూపొందించాలి

మధ్యతరగతి ప్రజలకూ సొంత స్థలం, తద్వారా సొంతింటి కల నిజం చేయాలి

రాష్ట్రంలో 17 వేల రెవెన్యూ గ్రామాలుంటే మరో 17 వేల కాలనీలు కడుతున్నాం 

భీమిలి నుంచి భోగాపురం వరకు సముద్ర తీరం వెంట 6 లేన్ల బీచ్‌ రోడ్డు

లే అవుట్ల అభివృద్ధిని ప్రభుత్వమే చేపడితే మధ్యతరగతి ప్రజల్లో ఆందోళనలు, భయాలు ఉండవు. వివాదాలు లేకుండా,  క్లియర్‌ టైటిల్స్‌తో కూడిన ఇంటి స్థలాలను ప్రభుత్వం లాభాపేక్ష లేకుండా లాటరీ  పద్ధతిలో కేటాయిస్తుంది. తద్వారా మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకు ఇంటి స్థలాలు అందుబాటులోకి వస్తాయి. ఈ లే అవుట్లను వినూత్నంగా, అందంగా తీర్చిదిద్దాలి.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాల్లోని మధ్య తరగతి ప్రజలకు సైతం సొంతింటి కలను నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగా తక్కువ ధరలకే క్లియర్‌ టైటిల్‌తో వివాదాల్లేని ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. మధ్య తరగతి ప్రజలకు ఏదైనా చేయాలనే తపనతోనే ఈ ఆలోచన వచ్చిందని స్పష్టం చేశారు. దీనిపై మేధోమథనం చేసి ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించి, తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో మున్సిపల్‌ శాఖకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నగరాలు, పట్టణాల్లో వైఎస్సార్‌ హయాంలో రాజీవ్‌ స్వగృహ పేరిట ఓ కార్యక్రమం చేపట్టారని, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలకు ఫ్లాట్లు ఇవ్వాలన్నది ఆ కార్యక్రమం ఉద్దేశమని గుర్తు చేశారు. ఇప్పుడు ఫ్లాట్లకు బదులు వివాదాల్లేని విధంగా.. క్లియర్‌ టైటిల్‌తో తక్కువ ధరకు ప్లాట్లు (స్థలాలు) ఇవ్వాలన్నది ఆలోచన అని తెలిపారు. ప్రభుత్వమే లే అవుట్లను అభివృద్ధి చేసి, లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయిస్తుందన్నారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద స్థలాలు కొనుక్కుంటున్న వారికి అనేక ఆందోళనలు, సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. సరైన టైటిల్‌ ఉందా? అన్ని రకాల అనుమతులు ఉన్నాయా? లేవా? అనే భయాలు వారిలో ఉన్నాయన్నారు. ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమం వల్ల వీటన్నింటికీ పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే.. 

17 వేల కాలనీలు కడుతున్నాం 
వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ సహా ఇతర అంశాలపై దృష్టి పెట్టండని కలెక్టర్లకు చెప్పాం. ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుపై కూడా ఆలోచించమని చెప్పాం. లే అవుట్‌ల అందాన్ని పెంచేలా వినూత్నంగా ఆలోచనలు చేయమన్నాం. 
బస్‌ బే తోపాటు సృజనాత్మకంగా బస్టాప్‌ కట్టండని చెప్పాం. పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో దాదాపు 16 వేలకు పైగా లే అవుట్స్‌ వచ్చాయి. రాష్ట్రంలో 17 వేల రెవెన్యూ గ్రామాలు ఉంటే.. మనం మరో 17 వేల కాలనీలు కడుతున్నాం. కొన్నిచోట్ల నగర పంచాయతీలుగా కూడా చేస్తున్నాం.
పార్కులు, గ్రామ, వార్డు సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్స్‌.. ఇవన్నీ కూడా ఈ కాలనీల్లో తీసుకువస్తాం. 

తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలతో కార్పొరేషన్‌ ఏర్పాటు 
మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలతో మంగళగిరి– తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. ఇందుకు సంబంధించి రూ.1000 కోట్లతో డీపీఆర్‌ను త్వరగా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 
భీమిలి నుంచి భోగాపురం వరకు సముద్ర తీరం వెంబడి 6 లేన్ల బీచ్‌ రోడ్డుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ రహదారిలో భాగంగా గోస్తనీ నదిపై సుందరమైన వంతెన నిర్మిస్తామన్నారు. 
ఇది విశాఖపట్నానికి ఒక చిహ్నంగా మిగిలిపోతుందని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. దీనిపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. శాలిడ్‌వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌పై కొత్త విధానాలను కూడా పరిశీలించాలని, పట్టణ గృహ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. 
ఈ సమీక్షలో మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్య నాథ్‌ దాస్, మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ విజయ్‌ కుమార్‌ పాల్గొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top