పక్కా భవనాలు కట్టించాలి: సీఎం వైఎస్‌ జగన్‌

CM YS Jagan Review Meeting On Mana Badi Nadu Nedu Today - Sakshi

మన బడి నాడు- నేడు కార్యక్రమంపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

సాక్షి, అమరావతి: విద్యాకానుకలో ఇంగ్లీష్‌-తెలుగు డిక్షనరీని చేర్చాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠ్యపుస్తకాల నాణ్యత బాగుండాలని, విద్యార్థులకు ఏర్పాటు చేసే బెంచ్‌లు సౌకర్యవంతంగా ఉండాలని పేర్కొన్నారు. మనబడి నాడు-నేడు కార్యక్రమంపై సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మొదటి దశ నాడు-నేడు పనులు మార్చికల్లా పూర్తి చేయాలి. స్కూళ్ళు కలర్‌ఫుల్‌గా మంచి డిజైన్లతో ఉండాలి. స్కూళ్ళలో ఇంటీరియర్‌ కూడా బావుండాలి. రెండో దశలో మరింత మార్పులు చేయాలి, విద్యార్ధులకు ఏర్పాటుచేసే బెంచ్‌లు సౌకర్యవంతంగా ఉండాలి. పనుల్లో ఎక్కడా నాణ్యతా లోపం రాకూడదు. మనసా వాచా కర్మణ నిబద్ధతతో పనిచేయాలి. అప్పుడే మనం అనుకున్న ఫలితాలు సాధిస్తాం.

టేబుల్స్‌ విషయంలో మరింత జాగ్రత్త అవసరం, టేబుల్స్‌ హైట్‌ కూడా చూసుకోవాలి. ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడో తరగతి వరకు సీబీఎస్‌ఈ విధానంలో బోధన జరగాలి. ఆ తర్వాత ఏటా ఒక్కో తరగతికి పెంచుతూ పోవాలి.అలా 2024 నాటికి 10వ తరగతి వరకు  సీబీఎస్‌ఈ విధానం అమలు చేయాలి’’ అని మార్గనిర్దేశం చేశారు. అదే విధంగా 390 పాఠశాలల భవన నిర్మాణానికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌‌ దాస్, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు, సమగ్రశిక్షా అభియాన్‌ ఎస్‌పిడి వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

పక్కా భవనాల్లో ప్రభుత్వ పాఠశాలలు
‘‘ప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాలు లేని పరిస్థితి ఎక్కడా ఉండకూడదు. కచ్చితంగా భవనాలు కట్టించాలి. నాడు – నేడులో భాగంగా ఆ పాఠశాలలన్నింటికీ భవన నిర్మాణాలు శరవేగంగా జరగాలి. రాష్ట్రవ్యాప్తంగా పక్కా భవనాలు లేని 390 పాఠశాలలకు భవనాల నిర్మాణం చేపట్టాలి’’ అని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రత
స్కూళ్లలో టాయిలెట్ల శుభ్రతపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా, ఇప్పటికే 27వేల మంది ఆయాలను నియమించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. మార్చి మొదటివారంలో వీరందరికీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరికరాలు, పరిశుభ్రంగా ఉంచేందుకు లిక్విడ్స్‌ అన్నీ స్కూళ్లకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

విద్యార్ధుల హాజరుపై ఆరా
విద్యార్ధుల హాజరుకు సంబంధించి తల్లులు, ఎడ్యుకేషన్‌ సెక్రటరీలు, వాలంటీర్ల మ్యాపింగ్‌ ప్రక్రియ నడుస్తోందని అధికారులు వెల్లడించారు.ఈ క్రమంలో వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు స్పందించిన అధికారులు మార్చి  15 కల్లా పూర్తిచేస్తామని తెలిపారు.

ఎక్కడా రాజీ పడొద్దు: విద్యాకానుకపై సీఎం
విద్యాకానుకలో ఇంగ్లిషు – తెలుగు డిక్షనరీని చేర్చాలి. అలాగే పాఠ్యపుస్తకాలు కూడా క్వాలిటీగా ఉండాలి.  ప్రైవేటు స్కూళ్లలో ఇస్తున్న పుస్తకాల నాణ్యతతో పోటీగా ఉండాలి. ఎక్కడా కూడా రాజీపడొదద్దు. టీచర్లకూ డిక్షనరీలు ఇవ్వాలి. అమ్మ ఒడి కింద ఆప్షన్‌ తీసుకున్న విద్యార్ధులకు ఇచ్చే ల్యాప్‌టాప్‌లు క్వాలిటీ, సర్వీస్‌ ముఖ్యం.

అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ
అంగన్‌ వాడీ టీచర్లకు శిక్షణ ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ప్రతి రెండు నెలలకోసారి వారు ఎంతవరకు నేర్చుకున్నారన్నదానిపై ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించాలన్నారు. పరీక్షలో ఉత్తీర్ణులు అయ్యారా? లేదా? అన్నదానితో సంబంధం లేకుండా వారు ఎంతవరకు శిక్షణ కార్యక్రమాల ద్వారా అప్‌గ్రేడ్‌ అయ్యారో పరిశీలించి, మరింతగా వారికి ట్రైనింగ్‌ ఇవ్వాలని పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top