వైఎస్‌ జగన్: గిడ్డంగులు,కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణంపై సీఎం సమీక్ష | YS Jagan Review On Construction Of Warehouses And Cold Storages - Sakshi
Sakshi News home page

గిడ్డంగులు,కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణంపై సీఎం జగన్‌ సమీక్ష

Published Fri, Aug 14 2020 2:17 PM

CM YS Jagan Review On Construction Of Warehouses And Cold Storages - Sakshi

సాక్షి, తాడేపల్లి: గిడ్డంగులు, కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పీఎం కిసాన్‌ సీఈవో, అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌, ఏఐఎఫ్‌ మిషన్‌ డైరెక్టర్‌  వివేక్‌ అగర్వాల్‌తో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. (పల్లెకు 104 పరుగులు)

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఏఐఎఫ్‌)కి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రికి వివేక్‌ అగర్వాల్‌ తెలిపారు. రాష్ట్రానికి అన్ని రకాలుగా సహకరిస్తామని పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ ప్రద్యుమ్నతో పాటు, వ్యవసాయ, మార్కెటింగ్, ఆర్థిక శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. (అమరావతికి నిధుల సమీకరణ)

ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఉంటాయని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. రైతులకు సంబంధించిన ప్రతి సమస్యను ఆర్‌బీకేలు పరిష్కరిస్తాయన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందిస్తామని వెల్లడించారు. కియోస్క్‌లో ఆర్డర్‌ చేయగానే 48 గంటల్లోగా ప్రభుత్వం నిర్ధారించిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందుతాయని తెలిపారు. అలాగే ఈ-క్రాప్‌ చేస్తామన్నారు.

‘‘గ్రామ సచివాలయంలో ఉన్న రెవెన్యూ అసిస్టెంట్, అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు కలిసి ఈ–క్రాపింగ్‌ చేస్తారు. వాటిలో పంటలకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదవుతాయి.ఇంకా జియో లొకేషన్‌ ట్యాగ్‌ కూడా చేస్తారు. రుణాలు రాలేదని ఎవ్వరైనా చెబితే.. వెంటనే చర్యలు తీసుకుంటాం. అలాగే బీమా సదుపాయం కూడా కల్పిస్తాం. ఆర్బీకేల్లో కనీస గిట్టుబాటు ధరలను ప్రకటిస్తాం. మార్కెట్‌లో ధరలు తగ్గితే వెంటనే మార్కెటింగ్‌లో జోక్యం (ఎంఐఎస్‌) చేసుకుంటామని’’ సీఎం తెలిపారు. రైతుల ఉత్పత్తులకు సరసమైన ధరలు లభించేలా చర్యలు తీసుకుంటామని, దీని కోసం ప్రత్యేక ఫ్లాట్‌ఫాం కూడా తీసుకువస్తున్నామని సీఎం వెల్లడించారు. అంతే కాకుండా గ్రామాల్లో జనతా బజార్లను తీసుకు వస్తామన్నారు.

‘‘ప్రభుత్వం కొనుగోలు చేసిన వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది. వినియోగదారులకు తక్కువ ధరలకు లభించడమే కాకుండా రైతులకూ మేలే జరుగుతుంది. వీటితోపాటు ప్రతి గ్రామంలో గోడౌన్లను, స్టోరేజీ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రీ ప్రాసెసింగ్‌తో పాటు, గ్రేడిండ్‌ కూడా అక్కడే చేస్తాం. అలాగే మండలాల్లో కోల్డ్‌ స్టోరేజీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. నియోజకవర్గాల వారీగా అవసరమైన మేరకు క్లస్టర్లను ఏర్పాటు చేసి.. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తాం. రైతుల నుంచి కొనుగోలు చేసిన వాటికి అదనపు విలువ జోడిస్తాం.టమోటా, చీనీ, మొక్కజొన్న, మామిడి, అరటి తదితర పంటలకు సంబంధించి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ చేస్తాం. ఆర్బీకేల ఆలోచన వచ్చిన దగ్గర నుంచి.. వాటి ఏర్పాటుతో పాటు.. ఈ అంశాలన్నింటిపైనా మేం దృష్టి పెట్టాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కార్యక్రమాలు మా లక్ష్యాల సాధనకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. ఫిషరీస్, ఆక్వాకు సంబంధించి కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాం. పంట చేతికి వచ్చేసరికి ధరలు తగ్గిపోయే పరిస్థితి. దీనిపై కూడా దృష్టి పెట్టామని’’ సీఎం తెలిపారు.

అమూల్‌తో ఇటీవలే ఒప్పందాలు కుదుర్చుకున్నామని, పాడి పరిశ్రమ వృద్దికి ఇది తోడ్పడుతుందని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. అణగారిన వర్గాలకు, భూమి లేని నిరుపేదలకు ఇది మంచి ఉపయోగకరమని,  పాడి పశువుల పెంపకంతో వీరికి మేలు జరుగుతుందన్నారు. వ్యవసాయంలో ఉత్తమ యాజమాన్య పద్ధతులను కూడా ఆర్బీకేల ద్వారా రైతులకు తెలియజేస్తున్నామన్నారు.

సీఎం విజన్‌ బాగుంది: వివేక్‌ అగర్వాల్‌
రైతులకు సబ్సిడీలే కాదు.. సదుపాయాలు కల్పించడం అన్నది చాలా ముఖ్యమని వివేక్‌ అగర్వాల్‌ అన్నారు.  ముఖ్యమంత్రి దార్శినికత రైతులకు మేలు చేస్తుందని ఆయన తెలిపారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement