
సాక్షి, తిరుపతి: భారత సైన్యానికి వందనం.. 135 కోట్ల మందిని పరిరక్షిస్తున్న వీర సైనికులకు వందనం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఎండ, చలి, వర్షాన్ని లెక్కచేయకుండా కాపలా కాస్తున్నారని సైనికుల సేవలను కొనియాడారు. బంగ్లాదేశ్ ఏర్పడింది అంటే.. అది మన సైన్యం గొప్పతనమని గుర్తుచేశారు. మృత్యుభయం వీడి మాతృభూమి సేవలో తరిస్తున్నారని అభినందించారు. ఈ సందర్భంగా వీర పురస్కారాలు పొందేవారికి ఏపీ ప్రభుత్వం తరఫున భారీ నజరానా సీఎం జగన్ ప్రకటించారు.
తిరుపతిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో గురువారం నిర్వహించిన స్వర్ణిమ్ విజయ్ వర్ష్ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని మాట్లాడారు. సైనికుల త్యాగాలు మరువలేనివని, మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైన్యం గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు. పరమవీరచక్ర పురస్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.కోటి, మహావీరచక్ర, కీర్తిచక్ర పురస్కారాలకు రూ.80 లక్షలు, వీరచక్ర, శౌర్యచక్ర పురస్కారాలకు రూ.60 లక్షలు ప్రకటిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.
అంతకుముందు 1971లో జరిగిన భారత్ - పాక్ యుద్ధంలో విశేష సేవలందించిన మహావీరచక్ర, పరమవిశిష్ట సేవా మెడల్ గ్రహీత, యుద్ధవీరుడు రిటైర్డ్ మేజర్ జనరల్ సి.వేణుగోపాల్‌ను సీఎం జగన్ సత్కరించారు. అనారోగ్యానికి గురవడంతో సీఎం జగన్ నేరుగా ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించి ఘనంగా సన్మానించారు. పరేడ్ మైదానంలో మరికొంత మంది సైనికులకు సీఎం జగన్ సన్మానించారు.
చదవండి: యుద్ధవీరుడికి సీఎం జగన్ ఘనంగా సన్మానం
చరిత్రలో లేని విధంగా ఇళ్లు నిర్మాణం : సీఎం జగన్