రహదారులకు సహకారం

CM YS Jagan meets Union Minister Nitin Gadkari - Sakshi

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో సీఎం జగన్‌ సమావేశం 

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో కీలక రోడ్డు వ్యవస్థల నిర్మాణం, రహదారుల అనుసంధానానికి సహకరించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ చేరుకున్న ఆయన బుధవారం ఉదయం జాతీయ రహదారులు, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక రోడ్డు ప్రాజెక్టులపై చర్చించారు.  

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి జ్ఞాపిక అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

► విశాఖ– భోగాపురం బీచ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరింత మెరుగైన ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర పర్యటన సందర్భంగా గడ్కరీ సూచించిన నేపథ్యంలో అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సీఎం వివరించారు. విశాఖ నుంచి వేగంగా భోగాపురం చేరుకునేలా సౌకర్యవంతమైన రోడ్డుతోపాటు పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ప్రాజెక్టును తీర్చిదిద్దేందుకు సహాయ సహకారాలు అందించాలని కోరారు.  
► విజయవాడ వెస్ట్రన్‌ బైపాస్‌ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. దీనికి సీఆర్‌డీఏ గ్రిడ్‌ రోడ్డును అనుసంధానించి పనులు ముందుకుసాగేలా చర్యలు తీసుకోవాలి.  
► విజయవాడ వెస్ట్రన్‌ బైపాస్‌కు సంబంధించి మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌కు భూములు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వెంటనే డీపీఆర్‌ సిద్ధం చేసి పనులు ముందుకు తీసుకెళ్లాలి. 
► విజయవాడ ఈస్ట్రన్‌ బైపాస్‌కు సంబంధించి కూడా డీపీఆర్‌ సిద్ధం చేసి పనులు వేగంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. 
► రాష్ట్రంలో 20 ఆర్వోబీలను కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఇప్పటికే మంజూరు చేయగా మిగిలిన 17 ఆర్వోబీలనూ మంజూరు చేయాలి. 
► రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలు, పారిశ్రామిక నోడళ్లు, స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్లను కలుపుతూ 1,723 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి. కొత్తగా ఏర్పడ్డ  జిల్లాల కేంద్రాలను కలుపుతూ ఈ రోడ్ల నిర్మాణం చేపట్టాలి. 
► రాష్ట్రంలో దాదాపు 14 ప్రాంతాల్లో రోప్‌ వే నిర్మాణానికి పర్యాటక శాఖ ప్రతిపాదనలు పంపింది. ఇప్పటికే రెండు చోట్ల నిర్మాణానికి ఆమోదం లభించగా మిగిలిన ప్రతిపాదనలకూ అనుమతి మంజూరు చేయాలి.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top