నేడు జగనన్న విద్యా కానుక

CM YS Jagan To Launch Jagananna Vidya Kanuka On 8th October - Sakshi

5.32 కోట్ల పాఠ్య, నోట్‌ పుస్తకాలు పంపిణీకి సిద్ధం

1.27 కోట్ల యూనిఫారాలు.. షూలు, సాక్సులు, బెల్టులు, బ్యాగులతో స్కూల్‌ కిట్‌

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వరుసగా వారం రోజుల్లో పంపిణీ

నేడు సీఎం చేతుల మీదుగా లాంఛనంగా పథకం ప్రారంభం

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో కోవిడ్‌ జాగ్రత్తలతో కార్యక్రమం

రూ.650 కోట్ల వ్యయంతో 42 లక్షలకు పైగా విద్యార్థులకు ప్రయోజనం

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యా కానుక గురువారం ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు అందనుంది. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థిని, విద్యార్థులకు ప్రత్యేక స్కూల్‌ కిట్‌లు అందజేయనున్నారు. పాఠశాలల్లో పిల్లల నమోదును గణనీయంగా పెంచడంతో పాటు,  మెరుగైన ఫలితాలు సాధించడమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 42,34,322 మంది విద్యార్థులకు వారి విద్యాభ్యాసానికి అవసరమైన ఏడు రకాల వస్తువులను ఈ కిట్ల రూపంలో అందించనున్నారు. పిల్లలను బడిలో చేర్చే సమయంలో ఇబ్బంది పడే పేదింటి అక్కచెల్లెమ్మలకు విముక్తి కలిగించడంతో పాటు, పాఠశాలల్లో “డ్రాప్‌ అవుట్‌లను గణనీయంగా తగ్గిస్తూ, బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమే లక్ష్యంగా “జగనన్న విద్యా కానుక’ను ప్రభుత్వం అమలు చేస్తోంది. 
 
42,34,322 మంది విద్యార్థులకు లబ్ధి

  • రాష్ట్ర వ్యాప్తంగా 42,34,322 మంది విద్యార్థిని, విద్యార్థులకు దాదాపు రూ.650 కోట్ల ఖర్చుతో స్కూల్‌ కిట్లు పంపిణీ చేస్తున్నారు. స్కూళ్లు తెరిచే నాటికి పిల్లలు యూనిఫామ్‌లు కుట్టించుకునే విధంగా వారికి ముందుగానే ఈ కిట్లు అందజేస్తున్నారు. ప్రతి విద్యార్థికి స్కూల్‌ కిట్‌తో పాటు మూడు మాస్కులు అందించనున్నారు.
  • 3.13 కోట్లకు పైగా పాఠ్య పుస్తకాలు, 2.19 కోట్లకు పైగా నోట్‌ పుస్తకాలు, 1.27 కోట్ల యూనిఫారాలు (క్లాత్‌), బూట్లు, సాక్సులు, బెల్టు, బాల బాలికలకు వేర్వేరు రంగుల బ్యాగులు ఆయా తరగతులకు తగ్గట్టుగా అందించనున్నారు. యూనిఫామ్‌ కుట్టు కూలీ మూడు జతలకి రూ.120 చొప్పున తల్లుల అకౌంట్‌కే నేరుగా జమ చేస్తారు.  
  • స్కూల్‌ కిట్‌కు సంబంధించిన వస్తువుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడలేదు. అత్యంత పారదర్శకంగా రివర్స్‌ టెండరింగ్, ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ విధానంలో సేకరించారు. 
  • కోవిడ్‌ నేపథ్యంలో ప్రతి పాఠశాలలో వరుసగా మూడు రోజుల పాటు కిట్లు పంపిణీ చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు ఆదేశించారు. అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పటికే కిట్లు చేరాయన్నారు. కిట్‌ తీసుకునేటప్పుడు విద్యార్థి బయెమెట్రిక్, ఐరిష్‌ హాజరుకు సహకరించాలని కోరారు.
  • ఏవైనా సమస్యలు ఎదురైతే 9121296051, 9121296052 హెల్ప్‌ లైన్‌ నంబర్లను పని దినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటలలోపు సంప్రదించాలన్నారు.   

పునాదిపాడు జెడ్పీ పాఠశాలలో శ్రీకారం
కంకిపాడు (పెనమలూరు): జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు జెడ్పీ పాఠశాలలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారంభిస్తారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం ప్రోగ్రామ్స్‌ కోఆర్డినేటర్‌ తలశిల రఘురామ్, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథితో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. (చదవండి: ఏపీలో రికార్డు స్థాయిలో పాఠ్యపుస్తకాల పంపిణీ)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top