కల్లుగీత..రాత మారేలా..! సీఎం వైఎస్‌ జగన్‌ చొరవతో తీరిన కష్టాలు

CM YS Jagan Assurance To The Families Of Kallu Gita Workers - Sakshi

కల్లుగీత కార్మికుల కుటుంబాలకు భరోసా...

ప్రమాద బీమా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు

ప్రభుత్వం నూతన పాలసీతో కల్లు కిస్తీలు పూర్తిగా రద్దు

జిల్లాలో దాదాపు 2500 మంది కార్మికులకు లబ్ధి

రాత్రనక..పగలనక చెట్టుకు లొట్టి కట్టి కల్లు గీసే కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబం మొత్తం బాధ పడేవాళ్లు. అదే కాలో చెయ్యో విరిగితే విధి రాత అనుకొని తమను తామే నిందించుకొనే వారు. ఇదంతా గతం. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కల్లుగీత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేలా పలు పథకాలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేశారు. ఆర్థిక భద్రతతో పాటు ఎందులోనూ వారు నష్టపోకుండా భరోసా కల్పించారు. దీంతో జిల్లాలో దాదాపు 2500 మంది కల్లు గీత కార్మికుల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.

పొదిలి రూరల్‌(ప్రకాశం జిల్లా): కల్లుగీత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వారికి భరోసా కల్పిస్తున్నాయి. జిల్లాలో పెద్దగా నీటి వనరులు లేకపోవడంతో ఈత, తాటి వనాల సంఖ్య తక్కువగా ఉన్నాయి. జిల్లాలో మొత్తం 11 టీసీఎస్‌ సొసైటీలు (తాడీ కో–ఆపరేటివ్‌ సొసైటీలు) ఉన్నాయి. అవి ఒంగోలు, టంగుటూరు, కనపర్తి, చీమకుర్తి, పొదిలి, పెదారికట్ల, మర్రిపూడి, కనిగిరి, పామూరు, గిద్దలూరు, నాగులుప్పలపాడు ప్రాంతాల్లో  ఉన్నాయి. ఒక్కొక్క సొసైటీలో 10 నుంచి 15 మంది లోపు సభ్యులుంటారు. 136 కల్లు దుకాణాలు ఉన్నాయి. టీఎఫ్‌టీలు (ట్రీ ఫర్‌ ట్యాఫర్‌) కల్లు గీసేవారు 2300 మంది ఉన్నారు. దాదాపు 25 వేల చెట్లు ఉన్నాయి. ఈ క్రమంలో కల్లు గీతనే వృత్తిగా చేసుకొని జీవిస్తున్న కుటుంబాలు పరిస్థితి దుర్భరంగా మారింది. ఆశించిన ఆదాయం లేదు..ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు లేవు. ఇలాంటి తరుణంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం గీత కార్మికుల జీవితాలకు బలమైన ఆర్థిక పునాదులు వేస్తోంది. 

పరిహారం పెంచి..భరోసానిచ్చి:  
కల్లు గీసే సమయంలో కార్మికులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే గతంలో వైఎస్సార్‌ బీమా పరిహారం కింద రూ.5 లక్షలు చెల్లించేవారు. దీనిని తాజా ప్రభుత్వం రూ.10 లక్షలకు పెంచింది. ఇందులో వైఎస్సార్‌ బీమా రూ.5 లక్షలతో పాటు ఎక్స్‌గ్రేషియా కింద మరో రూ.5 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. దీనికి వైఎస్సార్‌ గీత కార్మిక భరోసా పథకంగా పేరు పెట్టారు. అంతేగాక ఐదేళ్ల కాల పరిమితితో కల్లు గీత విధానాన్ని ఖరారు చేసినట్లుగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఖరారు చేసిన కల్లు గీత పాలసీ 2022 నుంచి 2027 సెప్టెంబరు 30 వరకు అమలులో ఉంటుంది. ఈ పథకం అమలుతో గౌడ, శెట్టిబలజ, ఈడిగ, కులాలకు చెందిన కుటుంబాలకు మేలు జరుగుతుంది. ఈ నిర్ణయంతో జిల్లాలో దాదాపు 2500 మందికి ప్రయోజనం కలగనుంది. కల్లు అద్దెలను (కిస్తీలను) ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది.  

ప్రత్యామ్నాయ మార్గం...  
కల్లు గీత సొసైటీలలో గీసే వానికి చెట్టు పథకం, షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో షెడ్యూల్డ్‌ జాతుల వారు కల్లు గీసుకోవడం కోసం ఐదేళ్లకు లైసెన్స్‌ కూడా ఇస్తారు. ఒక వేళ ఎవరైనా కార్మికులు కల్లు గీస్తూ ప్రమాదానికి గురై శాశ్వత వైకల్యానికి గురైతే ప్రత్యామ్నాయ నైపుణ్యాభివృద్ధి ద్వారా ఆదాయ మార్గాలను చూపిస్తారు. అలాగే వైఎస్సార్‌ బీమా ద్వారా నష్ట పరిహారం చెల్లిస్తారు. అంతే కాదు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌.షెల్టర్‌బెడ్‌ అభివృద్ధి పథకం కింద తాటి, ఈత చెట్ల పెంపకానికి చర్యలు తీసుకుంటారు. కాలువ గట్లు నదీ, సాగర తీరాలను పటిష్టం చేస్తూ కల్లు గీతకు కావాల్సిన తాటి, ఈత చెట్లను సంవృద్ధిగా పెంచనున్నారు.  

జగనన్న మేలు మరువలేం  
కల్లు గీత కార్మికుల కష్టాలను గుర్తించి వారి అభ్యున్నతికి పాటు పడుతున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేసిన మేలు ఎప్పటికీ మరువలేం. కల్లు గీస్తూ ప్రమాదవశాత్తు మరణించిన కార్మికులకు చెల్లించే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. దీన్ని అందరూ స్వాగతిస్తున్నారు. కల్లుగీత కార్మికుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.  
– జూపల్లి ఏడుకొండలు, రాష్ట్ర ఈడిగ 
కార్పొరేషన్, డైరెక్టర్, పొదిలి మండలం   

గీత కార్మికులకు భరోసా ఏర్పడింది 
కల్లు గీత కార్మికులకు ప్రమాద బీమా పెంచడం మంచి పరిణామం. గతంలో కల్లుగీత కార్మికుల జీవితాలు ఎంతో దుర్భరంగా ఉండేవి.  మా స్థితిగతులను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి కిస్తీలను రద్దు చేయడం, మరికొన్ని సమస్యలను పరిష్కరించడంతో ఎంతో భరోసా ఏర్పడింది. ఆయనకు గీత కార్మిక కుటుంబాలు రుణపడి ఉంటాయి.  
– కంచర్ల కోటయ్య గౌడ్, రాష్ట్ర గౌడ కార్పొరేషన్‌ డైరెక్టర్, గిద్దలూరు  

ఎక్స్‌గ్రేషియాపై హర్షం 
గీత కార్మికుల సమస్యలపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలకు పెంచారు. గీత కార్మికుల కష్టాలు గుర్తించి వారి సంక్షేమానికి పాటు పడిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారు. వీరి నిర్ణయంపై గీత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.   
– రామచంద్రరావు, ప్రకాశం జిల్లా కల్లుగీత కార్మికుల సంఘం అధ్యక్షుడు 

నూతన పాలసీతో ఎంతో మేలు   
ప్రభుత్వం చేపట్టిన నూతన పాలసీ విధానంతో కల్లుగీత కార్మికుల కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది. కల్లు గీస్తూ ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రమాద బీమా కింద రూ.5 లక్షలు ఇచ్చేవారు. నూతన పాలసీ వలన గతంలో ఇస్తున్న ప్రమాద బీమాతో పాటు మరో రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నారు. దీంతో ఆ కుటుంబాలకు ఆర్థికంగా చేయూత ఇచ్చినట్లువుతుంది. అంతేగాక సాధారణ ప్రమాదం జరిగి కాలు, చేయి విరిగితే అటువంటి వారికి ప్రత్యామ్నాయ మార్గాలను చూపించింది.  
– రాయపాటి హనుమంతారావు, జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారి  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top