మనసుంటే మార్గమూ ఉంటుంది: సీఎం జగన్‌

Cm Jagan Released Funds For Fishermen Families - Sakshi

మత్స్యకార కుటుంబాలకు నిధులు విడుదల చేసిన సీఎం

సాక్షి, అమరావతి: ఓఎన్జీసీ పైపులైన్‌ వల్ల నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నిధులు విడుదల చేశారు. దీంతో డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని 23,458 కుటుంబాలకు రూ.161.86 కోట్ల లబ్ధి చేకూరింది. క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ పద్ధతిలో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్‌ ఏమన్నారంటే:
‘‘ఇవాళ ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా..  ఒక మంచి కార్యక్రమాన్ని సూళ్లూరుపేటలో జరుపుకోవాలని అనుకున్నాం. వర్షాల తాకిడి వల్ల అక్కడికి చేరుకొనే పరిస్థితి లేక ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాం. మనం ఇవ్వాలనుకున్న, చేయాలనుకున్న ఆర్థిక సాయం ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఓఎన్జీసీ పైపు లైన్‌ ద్వారా నష్టపోతున్న మత్స్యకారులందరికీ సాయం చేసేందుకు ఇవాళ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా..  ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.’’

‘‘నిజానికి ఇవాళ తిరుపతి జిల్లా వాకాడు మండలం రాయదరువు వద్ద పులికాట్‌ సరస్సు ముఖద్వారం వద్ద పూడిక తీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనుకున్నాం.  ఆ కార్యక్రమం వీలునుబట్టి ఈ నెలాఖరులోనో, వచ్చే నెలలోనో చేపడతాం. ఇవాళ ఓఎన్జీసీ పైపులైన్‌ నిర్మాణం వల్ల, జరుగుతున్న తవ్వకాల వల్ల ఉభయ గోదావరి, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల్లో 16,408 మంది మత్స్యకారుల కుటుంబాలకు, కాకినాడ జిల్లాలో మరో 7500 మంది, మొత్తంగా 23,458 మంది ఉపాధి కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు కలిగిన నష్టాన్ని భర్తీ చేస్తున్నాం.

నెలకు రూ.11,500 చొప్పున చెల్లించే ఈ కార్యక్రమంలో ఓఎన్జీసీతో మాట్లాడి, వారితో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. మత్స్యకారుల తరపున  ఓఎన్జీసీతో మాట్లాడి 3 దశల్లో రూ. 323 కోట్లు నష్టపరిహారం ఇప్పటికే ఇప్పించాం. ఈ రోజు 4వ విడతగా ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు 6 నెలలకు సంబంధించి రూ.161 కోట్లు పరిహారం ఈరోజు ఇక్కడి నుంచి నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమం జరుగుతోంది.

నాలుగో విడతలో ఇవాళ మనం ఇస్తున్న రూ.161 కోట్లు కలుపుకుంటే మొత్తంగా రూ.485 కోట్లు పరిహారంగా 23,458 కుటుంబాలకు మనం ఇవ్వగలిగాం. ఇంతకుముందు 2012లో కోనసీమ జిల్లా ముమ్మడివరంలో జీఎస్‌పీసీ అప్పట్లో ఇదే రకమైన కార్యక్రమం చేయడం వలన 16,554 మంది మత్స్యకార కుటుంబాలకు నష్టం జరిగింది. రూ.78 కోట్లు ఇవ్వాల్సి ఉంటే.. అప్పటి నుంచి మళ్లీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు కూడా ఇవ్వని పరిస్థితి. మనకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఐదేళ్లు పరిపాలన చేసినా కూడా కనీసం ఇది ఇప్పించాలి, మత్స్యకార కుటుంబాలకు తోడుగా ఉండాలనే ఆలోచన చేయలేదు. ఈ డబ్బులు పడకపోతే ఆ మత్స్యకార కుటుంబాలు ఏ రకంగా బతకగలుగుతాయి ? వాళ్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పించాలన్న ఆలోచన గతంలో జరగలేదు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనసు పెట్టి వారికి ఇవ్వాల్సిన డబ్బులు ఫస్ట్‌ మనం ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చేసి.. తర్వాత కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ డబ్బును వెనక్కు ఇప్పించుకోగలిగాం.

ఎక్కడ మనసు ఉంటుందో అక్కడ మార్గం ఉంటుంది. ఎక్కడైతే మంచి చేయాలనే తపన ఉంటుందో అక్కడ దేవుడి సహకారం ఉంటుంది. దానికి నిదర్శనమే జీఎస్‌పీసీ పరిహారం ఉదంతం. ఇవాళ కూడా ఉభయగోదావరి జిల్లాల్లో  23,458 మంది మత్స్యకార కుటుంబాలకు మంచి చేసే కార్యక్రమాన్ని కూడా క్రమం తప్పకుండా, ప్రతి సంవత్సరం వచ్చేటట్టుగా అడుగులు వేస్తూ.. నాలుగోదఫా రూ.161 కోట్లు ఇప్పిస్తూ... మొత్తంగా రూ.485 కోట్లు ఇప్పించే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 

ఇవాళ మత్స్యకారుల సంక్షేమం పట్ల ఎంతగా ప్రభుత్వం స్పందిస్తూ అడుగులు ముందుకు వేస్తోందన్నది చెప్పడానికి.. నిన్న విశాఖపట్నంలో జరిగిన ఘటనే ఉదాహరణ. 40 బోట్లు కాలిపోయాయని మన దృష్టికి వస్తే వెంటనే వాళ్లని ఆదుకోవాలని తపన, తాపత్రయం పడ్డాం. వాటికి ఇన్సూరెన్స్‌ ఉందా ? లేదా ? అని విచారణ చేశాం. ఇన్సూరెన్స్‌ లేదని తెలిసిన వెంటనే ఎట్టిపరిస్థితుల్లోనూ  ఆ మత్స్యకార కుటుంబాలకు నష్టం జరగకూడదని.. వాళ్లకు మేలు చేయాలని, ప్రతి బోటు విలువ లెక్కగట్టమని చెప్పాం. ఆ బోటుకు సంబంధించి  80 శాతం ప్రభుత్వమే ఇచ్చేట్టుగా వెంటనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది.  ఆ చెక్కులు ఈరోజే పంపిణీ చేయాలని మంత్రులు, అధికారులను ఆదేశించాం. ప్రతి విషయంలో మనసుపెట్టి అన్ని రకాలుగా మత్స్యకారులకు తోడుగా ఉండే ప్రభుత్వం మనది. 

ఈ కార్యక్రమంలో సహకరించిన, తోడుగా ఉన్న ఓఎన్జీసీ అధికారులందరికీ మనస్పూర్తిగా నా తరఫున, ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అని సీఎం తన ప్రసంగం ముగించారు.

చదవండి: స్కిల్‌ స్కాంలో చంద్రబాబు పాత్రకు ఆధారాలున్నాయి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top