
పులివెందుల అసెంబ్లీ బరిలో సీఎం జగన్
ఏప్రిల్ 25న సీఎం జగన్ నామినేషన్
మే 13న ఏపీలో జరగనున్న ఎన్నికలు
సాక్షి, విజయవాడ:
ఏప్రిల్ 25, గురువారం.. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ వేయబోయే రోజు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం సీఎం నామినేషన్‌కు ముహూర్తాన్ని ఖరారు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్. ఈ నెల 25, గురువారం రోజున పులివెందులలో సీఎం జగన్ స్వయంగా నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేస్తారు. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.
ఏప్రిల్ 24న శ్రీకాకుళంలో బస్సుయాత్ర ముగించుకొని నేరుగా పులివెందుల వెళ్లనున్నారు సీఎం. అదే విధంగా ఈ నెల 22న సీఎం జగన్ తరుపున వైఎస్ అవినాష్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సతీశ్ కుమార్ రెడ్డిపై 90 వేల 110 ఓట్ల మెజారిటీతో వైఎస్ జగన్ గెలుపొందారు.
రాజకీయాల్లోకి అడుగు పెట్టి 15 ఏళ్లు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెట్టి 15 ఏళ్లు దాటుతోంది. 2009లో కడప లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్య మరణం తర్వాత ఓదార్పు యాత్రతో జనంలోకి వెళ్లిన వైఎస్ జగన్.. ఆ యాత్రను అడ్డుకున్నందుకు కాంగ్రెస్ పార్టీకి, లోక్‌సభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 2011లో కడప ఎంపీ స్థానానికి జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికలో వైఎస్ జగన్ ఏకంగా 5 లక్షల 45వేల 672 ఓట్ల తేడాతో గెలిచి రికార్డులు బద్దలు కొట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల శాసనసభ స్థానం నుంచి పోటీ చేసిన వైఎస్ జగన్, 75వేల 243 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. 2019లోనూ పులివెందుల నుంచే పోటీ చేసిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. 90 వేల 110 ఓట్ల మెజార్టీతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకున్నారు.
ఇక ఏపీలో ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరించే అవకాశం ఉంది. ఏప్రిల్ 26వ తేదీన నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది.