అల.. అంతర్వేదిలో.. కొంగొత్త 'రథ'సప్తమి

CM Jagan Inaugurates New Chariot Of Antarvedi Temple - Sakshi

లక్ష్మీనారసింహుని కల్యాణోత్సవాలకు అంకురార్పణ

సంప్రదాయబద్ధంగా సీఎం వైఎస్‌ జగన్‌ పూజలు 

స్వయంగా వింజామర సేవ.. తీర్థ ప్రసాదాల స్వీకరణ

నూతన రథానికి శాస్త్రోక్తంగా పూజలు

అనంతరం రథం లాగిన సీఎం

స్వల్ప వ్యవధిలో రథం నిర్మాణంపై ప్రశంస

సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో రథసప్తమి రోజున ఉత్సవాలకు అర్చకులు అంకురార్పణ గావించారు. సీఎం జగన్‌ ఆలయంలోకి ప్రవేశించినప్పటి నుంచి  రథాన్ని లాగే వరకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గతేడాది సెప్టెంబరు 5న స్వామి వారి రథాన్ని దుండగులు దగ్ధం చేసిన సంగతి తెలిసిందే. భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి.. కల్యాణోత్సవం నాటికి కొత్త రథం తయారవుతుందని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఐదు నెలల్లోనే అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కొత్త రథాన్ని తయారు చేయించారు. కల్యాణోత్సవాల నేపథ్యంలో నూతన రథాన్ని ప్రారంభించారు.

స్వామి వారికి పట్టు వస్త్రాల సమర్పణ
సీఎం వైఎస్‌ జగన్‌.. ఆలయానికి పశ్చిమ వైపున ఉన్న రాజగోపురానికి నమస్కరిస్తూ.. గంటా మంటపం, ముఖ మంటపం మీదుగా అంతరాలయంలోకి ప్రవేశించారు. శాస్త్రోక్తంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతరాలయంలో స్వామికి ప్రీతిపాత్రమైన వింజామర సేవలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు నూతన పట్టువస్త్రాలను సమర్పించారు. కోవిడ్‌–19 నేపథ్యంలో మార్చి 20 నుంచి రద్దు చేసిన అంతరాలయ దర్శనాన్ని.. ప్రస్తుతం కల్యాణోత్సవం సందర్భంగా సీఎం ద్వారా తిరిగి పునరుద్ధరించారు. అర్చకులు సీఎం జగన్‌ గోత్ర నామంతో అర్చన గావించారు. మంత్రపుష్ప సమర్పణ అనంతరం హారతిని సీఎం భక్తి భావంతో కళ్లకు అద్దుకుని నమస్కరించారు. అంతకు ముందు ఆలయ ప్రధాన అర్చకులు పాణంగిపల్లి శ్రీనివాస్, స్థానాచార్య వింజమూరి రామ రంగాచార్యులు, వేద పండితులు చింతా వేంకట శాస్త్రి, అర్చకులు శ్రీను తదితరులు ధ్వజ స్తంభం వద్ద ఉన్న సింహద్వారం వద్ద ముఖ్యమంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.

రాజ్యలక్ష్మి అమ్మవారికి పూజలు
♦ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం రాజ్యలక్ష్మీ అమ్మవారి ఉపాలయంలోని వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
♦ఆశీర్వచన మంటపం వద్ద అర్చకులు, వేద పండితులు సీఎంకు వేదాశీర్వచనం పలికి శేష వస్త్రంతో సత్కరించారు. లక్ష్మీనరసింహ స్వామి చిత్ర పటాన్ని అందజేశారు. అర్చకులు అందించిన స్వామి వారి ప్రసాదం పులిహోర, చక్కెర పొంగలిని ముఖ్యమంత్రి స్వీకరించారు. 
♦అనంతరం దేవస్థానంలో సుదర్శన హోమం జరిగే ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శన, నూతన రథం తయారీకి సంబంధించిన ఫొటోలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తిలకించారు. కొత్త రథం తయారీలో వినియోగించిన బస్తర్‌ టేకు సేకరణ మొదలు.. చివరలో సంప్రోక్షణ ప్రక్రియ వరకు ఆయా దశలకు సంబంధించిన ఫొటోలను ఆసక్తిగా వీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరితగతిన రథం తయారీని ప్రశంసించారు. 
♦అనంతరం ఆలయానికి తూర్పు వైపున ఉన్న రాజగోపురం వద్ద నుంచి ఉన్న స్వామి వారి 38 ఎకరాల భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులను దేవదాయ శాఖ కమిషనర్‌ అర్జున్‌రావు ముఖ్యమంత్రికి వివరించారు.


హారతి తీసుకుని నమస్కరిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి  

పసుపు, కుంకుమ పెట్టి.. కొబ్బరి కాయ కొట్టి..
♦స్వామి సన్నిధి నుంచి పశ్చిమ రాజగోపురం ద్వారా సీఎం.. రథం వద్దకు చేరుకున్నారు. స్వయంగా పసుపు, కుంకుమలతో నూతన రథానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి కొబ్బరి కాయ కొట్టారు. ఇతర భక్తులతో కలిసి రథాన్ని కొద్ది దూరం లాగారు. అనంతరం ఆలయానికి నలువైపులా ఉన్న భక్తులకు నమస్కరిస్తూ ముందుకు కదిలారు.
♦ఈ కార్యక్రమంలో సీఎం వెంట దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మంత్రులు పినిపే విశ్వరూప్, కురసాల కన్నబాబు, చెల్లుబోయిన వేణు, తానేటి వనిత, ఎంపీలు పిల్లి సుభాష్‌ చంద్రబోష్, వంగా గీత, చింతా అనురాధ, మార్గాని భరత్, ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాణీ మోహన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి ధనుంజయరెడ్డి, సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్‌ తలశిల రఘురామ్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి, ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 


నృసింహుని రథానికి పూలదండ వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 
 
చదవండి: (మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు..)

 (కోనసీమలో పల్లెపోరు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top