అన్ని క్యాన్సర్లకూ ఆరోగ్యశ్రీ 

CM Jagan at inaugural function Cancer Care Super Specialty Hospital - Sakshi

ఆ దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం   

త్వరలో అత్యాధునిక ఆంకాలజీ సెంటర్‌ 

క్యాన్సర్‌ కేర్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభ కార్యక్రమంలో సీఎం జగన్‌ 

దేశంలో క్యాన్సర్‌ చికిత్స ప్రాముఖ్యతను గుర్తించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. క్యాన్సర్‌ బాధితుల సంరక్షణ, చికిత్సపై సీఎం జగన్‌ దూరదృష్టి అభినందనీయం. రాష్ట్రవ్యాప్తంగా మూడు సమగ్ర క్యాన్సర్‌ ఆసుపత్రుల నిర్మాణానికి సీఎం శ్రీకారం చుట్టారు. 
– డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు, రేడియేషన్‌ ఆంకాలజిస్ట్, ప్రభుత్వ సలహాదారు 

సాక్షి ప్రతినిధి, తిరుపతి: క్యాన్సర్‌ వంటి వ్యాధులకు కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేసి, పేదలందరికీ ఉచితంగా వైద్య సౌకర్యం అందించాలనేదే తమ లక్ష్యమని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో టాటా సంస్థ అద్భుతమైన క్యాన్సర్‌ ఆస్పత్రిని తిరుపతిలో ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. తిరుపతి జూపార్క్‌ రోడ్‌లో టీటీడీ సహకారంతో టాటా సంస్థ ఆధ్వర్యంలో రూ.190 కోట్లతో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ కేర్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (స్వీకార్‌)ను గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రేడియాలజీ విభాగంలో రోగుల కోసం అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన క్యాబిన్లు, వైద్య పరికరాలను, చికిత్సా విధానాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి భరోసా ఇవ్వడమే లక్ష్యమని, రానున్న రోజుల్లో ఆంకాలజీ విభాగంలో అన్ని రకాల సేవలు వర్తింపజేయాలని భావిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో సమగ్రమైన క్యాన్సర్‌ చికిత్స అందించాలన్నది తమ లక్ష్యమని, ఇందులో భాగంగా అన్ని రకాల క్యాన్సర్‌లకు ఒకే గొడుగు కింద ఉచితంగా చికిత్స అందించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్క రోగి కూడా క్యాన్సర్‌తో చనిపోకూడదని, చికిత్స కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లకూడదనేది తమ అంతిమ లక్ష్యమని చెప్పారు.  

క్యాన్సర్‌ కేర్, అడ్వాన్స్‌డ్‌ ఆసుపత్రిని ప్రారంభిస్తున్న సీఎం జగన్, చిత్రంలో మంత్రులు, ఆసుపత్రి బృందం   

క్యాన్సర్‌ చికిత్సపై దృష్టి పెట్టిన ఏకైక రాష్ట్రం ఏపీ
ప్రముఖ రేడియేషన్‌ ఆంకాలజిస్ట్, ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మూడు సమగ్ర క్యాన్సర్‌ ఆసుపత్రుల నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు. క్యాన్సర్‌ సంరక్షణ, చికిత్సపై సీఎం దూరదృష్టి అభినందనీయమన్నారు. పీడియాట్రిక్‌ ఆంకాలజీ సెంటర్, ప్రివెంటివ్‌ ఆంకాలజీ, సెంటర్‌ ఫర్‌ పెయిన్‌ అండ్‌ పాలియేటివ్‌ కేర్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తూ.. భారతదేశంలో క్యాన్సర్‌ చికిత్స ప్రాముఖ్యతను గుర్తించిన ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమేనని చెప్పారు. టాటా ట్రస్ట్‌ సీఈవో ఎన్‌.శ్రీనాథ్, స్వీకార్‌ మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వీఆర్‌.రమణన్, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top