కోవిడ్‌ కట్టడిలో సీఎం జగన్‌ చర్యలు భేష్‌

CM Jagan actions in Covid Preventions Is Good says Dharmendra Pradhan‌ - Sakshi

వైద్యం విషయంలో అత్యంత వేగంగా స్పందిస్తున్నారు

ఈ రెండేళ్లలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న ప్రధాని, సీఎం జగన్‌ 

రాష్ట్ర సహకారంతోనే స్టీల్‌ ప్లాంట్‌లో సాధ్యమైన ఆక్సిజన్‌ ఉత్పత్తి 

స్టీల్‌ప్లాంట్‌లో 300 బెడ్స్‌తో కోవిడ్‌ కేర్‌ ఫెసిలిటీ సెంటర్‌ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర 

ప్లాంట్‌ను ప్రైవేటీకరించి ఉంటే ఈ సేవలు సాధ్యమయ్యేవా?: ఎంపీ విజయసాయి రెడ్డి 

సాక్షి, విశాఖపట్నం: ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌ మహమ్మారిని ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యల వల్ల సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని కేంద్ర పెట్రోలియం, స్టీల్, నేచురల్‌ గ్యాసెస్‌ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రశంసించారు. విశాఖపట్నంలోని స్టీల్‌ప్లాంట్‌లో ఉన్న గురజాడ కళాక్షేత్రంలో 1000 పడకల కోవిడ్‌ కేర్‌ ఫెసిలిటీ సెంటర్‌ ఏర్పాటులో భాగంగా తొలి విడత సిద్ధమైన 300 పడకల ఆస్పత్రిని ఆదివారం ఆయన వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రంలో నా స్నేహితుడు.. డైనమిక్‌ లీడర్, సోదరుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇద్దరూ అద్భుతంగా పనిచేస్తున్నారన్నారు. ప్రధాని మోదీ మాదిరిగా.. వైఎస్‌ జగన్‌ లక్ష్యం ఉన్న నాయకుడని కితాబిచ్చారు. ఈ రెండేళ్ల కాలంలో ఎదురైన సవాళ్లను వీరు ఎంత సమర్థంగా ఎదుర్కొన్నారో అందరికీ తెలిసిందేనన్నారు. ప్రభుత్వమంటే ప్రజలకు, వారి సంక్షేమానికి, వారి ఆరోగ్య భద్రతకు జవాబుదారీతనంగా ఉండాలని, ఈ విషయంలో వైఎస్‌ జగన్‌ కృషికి ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. కోవిడ్‌ కట్టడి విషయంలో ఏపీ.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అన్నారు.  ధర్మేంద్ర ప్రధాన్‌ ఇంకా ఏమన్నారంటే..

డిసెంబర్‌ నాటికి అందరికీ వ్యాక్సినేషన్‌
– రాష్ట్ర ప్రభుత్వం, సీఎం చొరవ వల్లే కొత్త ఆక్సిజన్‌ ప్లాంట్‌ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి, కనీసం 100 మెట్రిక్‌ టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసేందుకు ఆర్‌ఐఎన్‌ఎల్‌ కృషి చేస్తోంది.  
– దేశంలో జూన్‌ తర్వాత.. వ్యాక్సినేషన్‌ సామర్థ్యం పెరుగుతుంది. డిసెంబర్‌ నాటికి దేశంలో అందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తాం.
– ఆర్‌ఐఎన్‌ఎల్‌ సామాజిక బాధ్యత ఉన్న కార్పొరేట్‌ సంస్థ. అందుకే కార్పొరేట్‌ కోటా కింద వ్యాక్సిన్‌ కొనుగోలు చేసి.. ఏపీ ప్రభుత్వానికి అందించాల్సిన అవసరం ఉంది.
– నెల్లూరు జిల్లాలోని శ్రీ సిటీ.. దేశంలోనే అతి పెద్ద క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంక్‌గా అవతరించబోతోంది. భవిష్యత్తులో మెడికల్, ఆక్సిజన్, లాజిస్టిక్‌ మెకానిజమ్‌లో కీలకంగా మారనుంది. మెగా ఎకో సిస్టమ్‌ ఏర్పాటు చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌కు అభినందనలు. 
– ఈ కార్యక్రమంలో ఉక్కు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులాస్టే, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ పీకే రథ్,  అనకాపల్లి ఎంపీ బీవీ సత్యవతి తదితరులు పాల్గొన్నారు.  

సీఎం ముందు చూపే కారణం
సీఎం జగన్‌ ముందు చూపు కారణంగానే దేశంలోనే కోవిడ్‌ మరణాల రేటు అత్యల్పంగా ఉన్న రాష్ట్రాల్లో 0.64 శాతంతో ఆంధ్రప్రదేశ్‌ ఒకటిగా ఉంది. సీఎం చొరవ వల్లే రాష్ట్రంలో 32,125 అక్సిజన్‌ బెడ్స్‌ ఏర్పాటు చేశాం.  రూర్కెలా, జంషెడ్‌ పూర్, దుర్గాపూర్‌ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి 150 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ని అదనంగా అందించాలి. 
– ఆళ్ల నాని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి 

స్టీల్‌ ప్లాంట్‌ సేవలు అనిర్వచనీయం
కోవిడ్‌ కష్ట కాలంలో స్టీల్‌ ప్లాంట్‌ చేసిన సేవలు అనిర్వచనీయం. దేశం మెడికల్‌ లిక్విడ్‌ ఆక్సిజన్‌ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో దేశానికి ప్రాణవాయువు అందించిన ఘనత ఆర్‌ఐఎన్‌ఎల్‌ ఆధ్వర్యంలో వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌దే. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేసి ఉంటే దేశానికి ఇంత సేవ చేయగలిగేదా? కేంద్రం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచన చేయాలి.
– వి.విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top