Chinna Jeeyar Swami: సమ్మక్క– సారలమ్మలను తూలనాడలేదు 

Chinna Jeeyar Swami Explanation Sammakka Saralamma Controversy Comments - Sakshi

వారు గ్రామ దేవతలు మాత్రమేనని అన్నాం..: చినజీయర్‌ స్వామి 

ఎప్పుడైనా మాటల పూర్వాపరాలు చూడాలి 

కొందరు కావాలని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు 

మేం రాజకీయాలకు దూరం.. సేవా దృక్పథంతో పనిచేస్తున్నాం 

తమకు ఎవరితోనూ గ్యాప్‌ ఉండదని వ్యాఖ్య 

తాడేపల్లిరూరల్‌: ‘‘సమ్మక్క–సారలమ్మ గ్రామ దేవతలేనని అన్నాం. వారిని చిన్నచూపు చూసినట్టు, తూలనాడినట్టు కొందరు ప్రచారం చేస్తున్నారు. అది పొరపాటు. నేను ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదు. ఆదివాసీ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు అగ్రాసనం ఉండాలని ఆలోచించిన సంప్రదాయం నుంచి వచ్చిన వాళ్లం. వారిని చిన్నచూపు చూసే ఆలోచన చేయబోం.

కానీ కొందరు స్వార్థ ప్రయోజనాలతో నా వ్యాఖ్యలను వక్రీకరించి విమర్శలు చేస్తున్నారు. అమాయక ప్రజలను రెచ్చగొట్టడం సమాజానికి మంచిది కాదు..’’అని త్రిదండి చినజీయర్‌ స్వామి స్పష్టం చేశారు. ఆధ్యాత్మికతతో ఉన్నవారు వివాదాలకు తావు ఇవ్వరని, తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేసే వారి జ్ఞానానికే ఈ విషయాన్ని వదిలేస్తున్నామని చెప్పారు. శుక్రవారం ఏపీలోని తాడేపల్లిలో ఉన్న సీతానగరం విజయకీలాద్రి పర్వతంపై చినజీయర్‌ స్వామి మీడియాతో మాట్లాడారు. ఆయా అంశాలు ఆయన మాటల్లోనే.. 

‘‘ఈ మధ్య నాపై కొన్ని వివాదాలు వచ్చాయి. కొంతమంది దేవతలను చిన్నచూపు చూసినట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏదైనా విన్నప్పుడు ఆ మాటల పూర్వాపరాలు చూడాలి. చిన్న వీడియో చూసి ఒక వ్యక్తి ఇలా అన్నాడని ప్రచారం చేయడం హాస్యాస్పదం. మేం ఆదివాసీ జనాలను ఏదో అన్నట్టుగా, కామెంట్‌ చేస్తున్నట్టుగా వినపడుతుంది.

మేం అటువంటి కామెంట్‌ చేయం. సమాజ హితంపై కాంక్ష ఉన్నవారైతే.. వచ్చి ఏం జరిగిందనే విషయం తెలుసుకోవాలి, సరైన పద్ధతిలో స్పందించాలి. 20 ఏళ్లకు ముందు మాట్లాడిన వీడియో నుంచి దానిని తీశారు. ఆ రోజున మాట్లాడినప్పుడు సమ్మక్క–సారలమ్మ స్వర్గం నుంచి దిగివచ్చిన వారు కాదు, గ్రామ దేవతలేనని అన్నాం. వారు సమాజంలో ఉన్న ఎన్నో సమస్యలను ఎదుర్కొని భక్తులచేత పూజలందుకుంటున్నారని చెప్పాం. కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఉక్రెయిన్, రష్యా వివాదం ఇప్పుడే తగ్గుతోంది. దీంతో ప్రచారం కోసం దీన్ని చర్చకు తీసుకువస్తున్నట్లు కనపడుతోంది. 

మాకు ఆస్తులేమీ ఉండవు 
ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక మాకు వ్యక్తిగతఆస్తులేమీ ఉండవు. సేవా కార్యక్రమాలు చేసేప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అలా మాంసం తినవద్దని చెప్పిన మాట వాస్తవమే. కొందరు దానిని వక్రీకరించి మాట్లాడటం బాధాకరం. సమాజానికి మంచి చేసేవారితో కలిసేందుకు మేం ఎప్పుడూ సిద్ధమే. స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ అనేది మా నినాదం. ఆదివాసుల సంక్షేమానికి వికాస తరంగిణి సంస్థ ద్వారా సేవ చేస్తున్నాం. అందులో ముఖ్యంగా మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నాం. 

ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుతున్నాం.. 
మా జీయర్‌ సొసైటీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మహిళలు మంత్రోచ్ఛారణ చేయకూడదని చాలామంది అభిప్రాయం. కానీ మేం మహిళలను ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుతున్నాం. జీయర్‌ ట్రస్ట్‌ ద్వారా వైద్య పరీక్షలు చేయించి.. మహిళలు ఆరోగ్యంగా ఉండేలా చూస్తున్నాం. ఇందులో అన్ని మతాలు, కులాలకు చెందిన మహిళలు ఉన్నారు.

మేం మెడికల్‌ క్యాంప్‌ పెట్టినపుడు సేవ చేయడానికి వచ్చే వైద్యులు కూడా అనేక వర్గాలకు చెందినవారు ఉంటారు. ఆదివాసులను విమర్శించాల్సిన అవసరం మాకు లేదు’’అని చినజీయర్‌ స్వామి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అహోబిల స్వామి, మాజీ ఎంపీ, జీయర్‌ ట్రస్ట్‌ సభ్యుడు గోకరాజు గంగరాజు, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.

మా దగ్గర అందరూ సమానమే.. 
మేం రాజకీయాలకు దూరం. మా దగ్గర అందరూ సమానమే. రాజకీయాల్లోకి వెళ్లాలన్న కోరిక మాకు ఉండదు. ఎవరితోనూ గ్యాప్‌ అనేది ఉండదు. వివాదాలు ఉండవు. మేమెప్పుడూ దక్షతతో మంచి కార్యక్రమాలు చేస్తాం. ఎవరినీ మోసం చేయకుండా ఉంటాం. రాబట్టే ధైర్యంగా మాట్లాడగలుగుతాం. వారికి వీరికి దడుస్తూ ఏదో మూలన నక్కి మాట్లాడటం మా చర్రితలో ఎప్పుడూ లేదు. మేం సన్యాసులం.. మా పేరుతో బ్యాంకు ఖాతా కూడా ఉండదు. మేం ఎవరికీ భయపడబోం.. అలాగే ఎవరి వెంటా పడబోం. 

శుక్రవారం ఏపీలోని తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడుతున్న చినజీయర్‌ స్వామి. చిత్రంలో అహోబిలస్వామి, నరసాపురం మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తదితరులు   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top