ఒక్క గ్రామంలోనూ పక్కాగా జరగని భూముల రీ సర్వే
సాక్షి, అమరావతి: భూముల తల రాతను మార్చేలా గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన భూముల రీ సర్వేను చంద్రబాబు ప్రభుత్వం సక్రమంగా చేయలేక సతమతమవుతోంది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా ఒక్క గ్రామంలోనూ రీ సర్వే పూర్తి చేయలేకపోయింది. గత జగన్ ప్రభుత్వం 8 వేలకుపైగా గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి, అక్కడ డిజిటల్ రికార్డులను అందుబాటులోకి తెచ్చింది. అధికారంలోకి రాకముందు ఆ రీ సర్వేపై ఇష్టానుసారం ఆరోపణలు చేసి.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన చంద్రబాబు, ఆ తర్వాత యూటర్న్ తీసుకున్న విషయం తెలిసిందే.
రీ సర్వే మంచిదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో తాను అభాండాలు వేసిన దాన్ని రద్దు చేయలేక కొన్నాళ్లు డ్రామాలతో కాలక్షేపం చేశారు. ఈ నేపథ్యంలోనే జగన్ హయాంలో జరిగిన రీ సర్వే దేశానికే రోల్ మోడల్‌గా ఉన్నట్లు చెప్పడం, రీ సర్వే చేసిన రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామని కేంద్రం ప్రకటించడంతో.. రీ సర్వేలో తప్పులు సరి చేస్తామంటూ చంద్రబాబు కొత్తపాట పాడారు. మరోవైపు జగన్ హయాంలో 8 వేలకుపైగా గ్రామాల్లో పూర్తయిన రీ సర్వేను చూపించి కేంద్రం నుంచి ప్రత్యేక ప్రోత్సాహకంగా రూ.400 కోట్ల నిధులు తెచ్చుకున్నారు. అయినా ఆ నిధులను రీ సర్వే కోసం ఖర్చు చేయకుండా ఇతర అవసరాలకు మళ్లించారు. కనీసం రెవెన్యూ శాఖకు కొన్ని నిధులైనా ఇవ్వాలని ఆ శాఖ కోరినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఈ కార్యక్రమం ముందుకు సాగడం లేదు.
సౌకర్యాలు లేవు.. సిబ్బందికి ఇతర పనులు
రీ సర్వే చేసే బృందాలకు అవసరమైన కంప్యూటర్లు, రోవర్లు ఇవ్వకుండా రీ సర్వే చేయాలని ఒత్తిడి చేశారు. రెవెన్యూ యంత్రాంగానికి సర్వే చేయడానికి అవసరమైన సౌకర్యాలు కల్పించకుండానే సర్వే చేయాలంటూ మొక్కుబడి తంతు నడిపారు. మరోవైపు వీఆర్‌ఓలు, సర్వేయర్లకు ఇతర పనులు అప్పగించడంతో రీ సర్వే ముందుకు సాగలేదు. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ద్వారా నిరంతరం చేపట్టే అభిప్రాయ సేకరణ సర్వేలు, పింఛన్ల పంపిణీ తదితర పనుల కోసం వారిని పెద్ద ఎత్తున వినియోగించారు.
ప్రధాని పర్యటనలు, యోగా డే ఇతర కార్యక్రమాల పనులన్నీ వారికే అప్పగించారు. ఆ పనుల్ని ఎంపీడీఓలు పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు వారిపై ఒత్తిడి తెచ్చారు. ఆ సమయంలో రీ సర్వే చేయాలని రెవెన్యూ శాఖ చెప్పినా దాంతో తమకు సంబంధం లేదని, తాము చెప్పిన పని చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. తహశీల్దార్లకు సైతం రెవెన్యూ పనులు చాలా ఉండడంతో రీ సర్వే గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఫలితంగా ఏడాదిన్నరలో ఒక్క గ్రామంలో కూడా రీ సర్వే పూర్తి చేయలేకపోయారు.
రీ సర్వేలో మొదటి స్థానం ఎవరి ఘనత?
గతంలో రీ సర్వే ప్రారంభమైన వెంటనే 19 నోటిఫికేషన్ ఇచ్చే ముందే ఆయా భూములకు సంబంధించిన రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించే వారు. వారి రికార్డులు చూసేవారు. ఇప్పుడు అలా కాకుండా సర్వే అయిపోయాక రైతుల అభిప్రాయాలు తీసుకోవాలనే విధానాన్ని తెచ్చారు. దీంతో తప్పులు వస్తే తమ పరిస్థితి ఏమిటని రైతులు లబోదిబోమంటున్నారు. దీంతో ఇటీవలే తప్పులు సరి చేయడానికి అవకాశం కల్పించారు. ఈ క్రమంలో రీ సర్వేలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని కేంద్ర మంతి పెమ్మసాని ప్రకటించారు.
చంద్రబాబు ప్రభుత్వం ఒక్క గ్రామంలో కూడా సర్వే పూర్తి చేయకుండా ఏపీ ఎలా నంబర్ వన్‌గా నిలిచిందన్న దానికి ఆయన వద్ద సమాధానం లేదు. వైఎస్ జగన్ హయాంలో విజయవంతంగా రీ సర్వే జరగడం, 8 వేలకుపైగా గ్రామాల్లో సర్వే పూర్తయి కొత్త డిజిటల్ రికార్డులు అందుబాటులోకి రావడం వల్లే ఇది సాధ్యమైంది. రీ సర్వేకు ప్రోత్సాహకంగా వచ్చిన రూ.400 కోట్లు ఇతర అవసరాలకు ఖర్చు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం రీ సర్వేను మాత్రం వైఎస్ జగన్ ప్రభుత్వ తరహాలో విజయవంతంగా కొనసాగించలేకపోతోంది.


