
సాక్షి,విజయవాడ: అన్నదాతలకు చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచారు. అన్నదాత సుఖీభవం పథకానికి చంద్రబాబు ప్రభుత్వం కోత పెట్టింది. రేపు(శనివారం, ఆగస్టు 2) పథకం అమలులో భాగంగా రూ.40 వేలకు గాను రూ.5 వేలు మాత్రమే ఇచ్చేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో గత ఏడాది ఖరీఫ్, రబీ డబ్బులు మొత్తం ఎగనామం పెట్టింది. రూ.7 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు రైతు భరోసా కోత విధించింది.
వైఎస్ జగన్ ప్రభుత్వంలో 53.58 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చగా.. చంద్రబాబు మాత్రం 46.85 లక్షలకు లబ్ధిదారులను తగ్గించేశారు. గత ఏడాది పూర్తిగా రూ.20 వేలు ఎగనామం పెట్టారు. ఈ ఏడాది కేవలం 5 వేలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం విడుదలకు సిద్ధమైంది.
రూ. 20 వేలు ప్రతీ రైతు కుటుంబానికి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు కేంద్రం ఇచ్చే సాయంతో రూ.20 వేలు ఇస్తామని మెలికపెట్టారు. ఇలా గత ఏడాది రైతులకు చంద్రబాబు ప్రభుత్వం రూ.10,800 కోట్లు ఎగ్గొట్టింది. ఈ ఏడాది కేవలం 2,342 కోట్లు మాత్రమే విడుదల చేయనుంది.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రైతు భరోసా పథకాన్ని కాపీ కొట్టిన ప్రస్తుత సీఎం చంద్రబాబు.. పేరు మార్చి అన్నదాత సుఖీభవ అంటూ 14 నెలలుగా పథకాన్ని అమలు చేయకుండా రైతుల పొట్టకొడుతూ వచ్చారు.
ఈ అంశాన్ని ఎత్తి చూపుతూ సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం కావడంతో ఆగస్టు 2 నుంచి అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5వేల మాత్రమే రైతుల ఖాతాలో జమ చేయనుండడంతో కూటమి ప్రభుత్వంపై రైతన్నలు విమర్శలు గుప్పిస్తున్నారు.