
ఎంత భూమైనా సరే.. 99 పైసలకే విక్రయిస్తాం
మీకు నచ్చిన రేటుకు తెగనమ్ముకోండి..!
బాబు సర్కారు భలే ఎత్తుగడ..
‘రియల్’ దందాకు రెడీ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా లోకేశ్ మార్కు విధానం
ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ (లిఫ్ట్) పేరుతో ప్రత్యేక పాలసీ.. ఊరూ పేరు లేని ఉర్సా లాంటి కంపెనీలు వందలాదిగా సృష్టించి ధారాదత్తం చేసే ఎత్తుగడ
ఉర్సాకు కారుచౌకగా కట్టబెట్టే యత్నాలపై తీవ్ర విమర్శలు రావడంతో తెరపైకి మరో పాలసీ
ఇక రాష్ట్రమంతటా పప్పు బెల్లాల మాదిరిగా అదే విధానంలో పందేరం..
‘‘ఫార్చూన్ 500 యూరోప్’’పై ఉన్నతాధికారుల్లో అనుమానాలు
ఆ ఇండెక్స్‌లో నల్లధన రాజదాని స్విట్జర్లాండ్‌కు చెందిన 36కిపైగా కంపెనీలు
సాక్షి, అమరావతి: ఏ ప్రభుత్వమైనా ఓ కంపెనీకి ఉదారంగా భూములివ్వాలంటే ముందుగా దాని ట్రాక్ రికార్డు చూస్తుంది! కంపెనీ శక్తి, సామర్థ్యాలు ఏమిటి? ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది? రాష్ట్రానికి పారదర్శకంగా ఎన్ని పెట్టుబడులు వస్తాయో చూస్తుంది. అంతటా నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తుంది. కానీ ఇలాంటివి ఏవీ పట్టించుకోకుండా పప్పు బెల్లాల మాదిరిగా భూముల పందేరానికి టీడీపీ కూటమి సర్కారు సిద్ధమైంది.
ఐటీ కంపెనీల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీసింది. ఎన్ని ఎకరాల భూమి అయినా సరే కేవలం 99 పైసలకే ఇస్తాం...! ఐటీ పేరుతో వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేసుకోండి..! ఆ తరువాత మార్కెట్ ధరకు అమ్మేసుకోండి..! అంటూ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ (లిఫ్ట్) పేరుతో విలువైన భూములను కొట్టేసేందుకు ప్రభుత్వ పెద్దలు స్కెచ్ వేశారు.
ఐటీ కంపెనీలను ఆకర్షిస్తున్నామంటూ పక్కా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సన్నాహాలు చేశారు. తొలుత ఒకటి రెండు ప్రముఖ కంపెనీలను తెరపైకి తీసుకొచ్చి కనీసం పాలసీ కూడా సిద్ధం కాకముందే విశాఖలో 99 పైసలకే భూములను కట్టబెట్టారు. ఈ క్రమంలో ఊరూ పేరు లేని ఉర్సాకు కారుచౌకగా భూములను కట్టబెట్టే యత్నాలపై తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో ఉలిక్కిపడి ‘లిఫ్ట్’ పేరుతో ఓ పాలసీని తీసుకొచ్చారు.
ఉర్సా లాంటి వందలాది సత్తాలేని కంపెనీలను సృష్టించి తమకు కావాల్సిన వారికి భూములు అప్పనంగా అప్పగించేందుకు సిద్ధపడ్డారు. అసలు టెక్నాలజీతో సంబంధం లేని కంపెనీలకు భూములను ధారాదత్తం చేస్తున్నారు! తొలుత విశాఖలో ఐటీ కంపెనీలను ప్రోత్సహించి ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా భూములను కేటాయించనున్నట్లు ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నామినల్ రేటు అంటే 99 పైసలు..
ఐటీ కంపెనీలను ఆకర్షించేందుకు ఇప్పటికే ఏపీ ఐటీ అండ్ గ్లోబల్ కేపబులిటీ సెంటర్స్ (జీసీసీ) పాలసీ 2024–29 ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు కేటాయించడం కోసం ప్రత్యేకంగా ‘లిఫ్ట్’ పాలసీని తెరపైకి తెచ్చింది. ముందుగా ఐటీ లేదా జీసీసీతో అభివృద్ధి చేసే వాణిజ్య సముదాయంలో 20 శాతం కొనుగోలు లేదా లీజుకు తీసుకునేలా ఒప్పందం చేసుకుంటే చాలు.. అడిగినంత భూమిని కేవలం 99 పైసలకే కట్టబెట్టనుంది.
మిగిలిన 80 శాతంలో 30 శాతం ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు, జీసీసీలకు ఇస్తే చాలు 50 శాతం భూమిని వాటికి నచ్చినట్లుగా విక్రయించుకోవచ్చని ఆ జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. ‘‘నామినల్ రేటు అంటే 99 పైసలు..’’ అని అందులో పేర్కొనడం గమనార్హం.
ప్రత్యేకంగా ‘ఫార్చూన్ 500 యూరప్’ ఎందుకు?
ఐటీ, ఐటీఈఎస్, జీసీసీలకు 99 పైసలకే భూమి ఇస్తామంటూనే ‘‘ఫార్చూన్ 500 యూరోప్’’ను ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకోవడంపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. వీటిలో నాన్ ఐటీ కంపెనీలే ఉన్నాయి. టెక్నాలజీతో ఏమాత్రం సంబంధంలేని యూరోప్ ఫార్చూన్ 500 ఇండెక్స్‌ను ఎంపిక చేసుకోవడంపై సందేహాలు ముసురుకుంటున్నాయి. ఈ ఇండెక్స్‌లో నల్లధన రాజధాని స్విట్జర్లాండ్‌కు చెందిన 36కిపైగా కంపెనీలు ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఫార్చూన్ 500 యూరోప్ తేవడంపై ఉన్నతాధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
డెవలపర్స్ ముసుగులో ‘రియల్’ వ్యాపారం
ఐటీ పార్కు డెవలపర్స్, జీసీసీ డెవలపర్స్‌కు కూడా ఈ పాలసీ కింద 99 పైసలకే భూమిని కేటాయిస్తారు. జీసీసీ డెవలపర్స్ కనీసం ఒక ఎకరా భూమిలో 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే విధంగా అభివృద్ధి చేయాల్సి ఉంటుందని జీవోలో పేర్కొన్నారు. ఫార్చూన్, ఫోర్బ్స్ కంపెనీల్లో ఒక దానిని యాంకర్ కంపెనీగా ఎంపిక చేసుకొని అభివృద్ధి చేసిన భూమిలో 20 శాతం తీసుకునే విధంగా ఒప్పందం చేసుకోవాలి. ఎకరాకు కనీసం 500 మందికి ఉపాధి కల్పించాలి.
ఇలా అభివృద్ధి చేసిన భూమిలో కనీసం 50 శాతం భూమిని ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలు, జీసీసీలకు ఇవ్వాల్సి ఉంటుందని ఉత్తర్వులో పేర్కొన్నారు . అదే ఐటీ పార్కు డెవలపర్స్ అయితే ఎకరాకు 1,00,000 చదరపు అడుగులు చొప్పున కనీసం 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అంటే ఐటీ డెవలపర్స్‌కు కనీసం 10 ఎకరాల భూమిని కేటాయిస్తారు.