‘ఆసరా’కు ఎసరు.. బాలింతలకు కొసరు | Chandrababu coalition govt cheated in Aarogyasri Aasara Money to Poor | Sakshi
Sakshi News home page

‘ఆసరా’కు ఎసరు.. బాలింతలకు కొసరు

May 12 2025 4:49 AM | Updated on May 12 2025 11:12 AM

Chandrababu coalition govt cheated in Aarogyasri Aasara Money to Poor

జగన్‌ పాలనలో ఆరోగ్య ఆసరా కింద రూ.5 వేల సాయం

టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే నిలిపివేత

పేదలకు గరిష్ట మేలు చేకూర్చే డీబీటీ సాయానికి మంగళం

దాని స్థానంలో కేవలం రూ.వందలు విలువైన బేబీ కిట్‌ ఇస్తామంటూ ప్రకటన

ఈ సర్కారు ఐదేళ్ల పాలనలో మొత్తం 15 లక్షల మందికి రూ.750 కోట్ల మేర నష్టం

సాక్షి, అమరావతి: ‘ఆడబిడ్డ నిధి’ కింద 18 ఏళ్లు పైబడిన మహిళలకు ఏటా రూ.18 వేలు ఇస్తాం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.. బడికెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున తల్లికి వందనం అందిస్తాం’.. అంటూ ఎన్నికలకు ముందు ఎన్నో సాధ్యంకాని హామీలను ఎడాపెడా ఇచ్చేసిన చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక వాటిలో ఒక్కటీ అమలుచేయకుండా మహిళలను దగా చేస్తున్నారు. తానిచ్చిన హామీలను అటకెక్కించడమే కాకుండా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో అమలుచేసిన సంక్షేమ పథకాలను సైతం నిర్దాక్షిణ్యంగా ఆపేశారు. 

ఆరోగ్యశ్రీ కింద బాలింతలకు అందే రూ.ఐదు వేల ఆసరా సాయానికీ మంగళం పాడేశారు. వైఎస్‌ జగన్‌ పాలనలో ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రసవానంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన 24 గంటల్లో డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) విధానంలో బాలింతకు ఆసరా సాయాన్ని ఇచ్చేవారు. కానీ, గతేడాది టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే ఈ సాయాన్ని పూర్తిగా అటకెక్కించింది. ఇలా ఆరోగ్యశ్రీ ఆసరాకు గండికొట్టి ఏకంగా రూ.5 వేలు చొప్పున బాలింతలకు నష్టం చేకూరుస్తూ.. కేవలం రూ.వందలు విలువచేసే సబ్బు, పౌడర్‌ డబ్బాలతో కూడిన బేబీ కిట్‌ ఇస్తామంటూ ప్రకటించింది.

ఐదేళ్లలో 15 లక్షల మందికి అన్యాయం..
రాష్ట్రంలో ఏటా ఆరోగ్యశ్రీ పథకం కింద మూడు లక్షలకు పైగా ప్రసవాలు నమోదవుతుంటాయి. ఆరోగ్య ఆసరా పథకం కింద ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంటనే వీరందరికీ గత ప్రభుత్వంలో రూ.5 వేలు చొప్పున బ్యాంకులో జమచేసేవారు. ఈ సాయాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిలిపేయడంతో ఏటా మూడు లక్షల చొప్పున లెక్కేసినా 2024–29 మధ్య ఐదేళ్లలో 15 లక్షల మంది మహిళలకు సాయం నిలిచిపోతుంది. అలాగే, ఒక్కొక్కరికి రూ.5 వేలు చొప్పున ఐదేళ్లలో కనిష్టంగా  రూ.750 కోట్లను పేద, మధ్యతరగతి బాలింతలు నష్టపోతున్నారు. 

ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తోంది. మొదటి ఏడాదిలో రూ.5 వేలు చొప్పున ఇప్పటికే బాలింతలకు దాదాపు రూ.150 కోట్ల మేర కోల్పోయారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే సక్రమంగా తమకు ఆసరా సాయం అంది ఉండేదని వీరు చెబుతున్నారు. ఇలా పెద్ద మొత్తంలో పేదింటి మహిళలకు నష్టం చేకూర్చి కేవలం రూ.వందలు విలువచేసే కిట్లు పంపిణీకి ప్రభుత్వం ప్రయత్నిస్తుండడంపై వారు దుమ్మెత్తి పోస్తున్నారు.



కిట్‌ల కొనుగోలులోనూ లూటీ తంతు?
ఇక ఆస్పత్రులకు మందుల సరఫరా.. అత్యవసర వైద్యసేవల కల్పన.. రోగనిర్ధారణ.. ఇలా వివిధ రకాల కాంట్రాక్టులను ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు అవినీతిమయంగా మార్చేశారు. అయినవాళ్లు, పెద్ద మొత్తంలో కమీషన్లు ఇచ్చే సంస్థలకే కాంట్రాక్టు కట్టబెట్టడం ద్వారా పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. ఇదే తంతు బేబీ కిట్‌ల కొనుగోలులోనూ చోటుచేసుకునే అవకాశాలున్నాయి. ఇప్పటికే బేబీ కిట్‌లు సరఫరా చేసే ఒకరిద్దరు కాంట్రాక్టర్లు ఓ అమాత్యుడిని కలిసినట్లు తెలిసింది. ఆ అమాత్యుడి సిఫార్సుతో వీరు వైద్యశాఖను సంప్రదించినట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement