సాక్షి, తిరుపతి: తిరుపతి ఎంపీ గురుమూర్తి వినతిపై రైతులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. గాజులమండ్యం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై కేంద్రం సానుకూల స్పందించింది. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశానుసారం చక్కెర కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించడంతో పాటు ఆధునీకరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ దృష్టికి ఎంపీ గురుమూర్తి తీసుకెళ్లారు.
ఈ అంశంపై స్పందించిన కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌సీడీసీ), షుగర్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఎస్‌డీఎఫ్) సహకారంతో ఈ కర్మాగార పునరుద్ధరణ సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. దేశవ్యాప్తంగా మూతపడిన సహకార చక్కెర కర్మాగారాల పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ లేఖలో పేర్కొన్నారు.


