సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ఉంటే చర్యలు 

CDMA Praveen Kumar orders on Single use plastic - Sakshi

నేటి నుంచి అన్ని పట్టణాలు, నగరాల్లో నిషేధం అమలు 

ప్రజల్లో అవగాహనకు వార్డుల్లో ప్రచార కార్యక్రమాలు 

సీడీఎంఏ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశాలు  

సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్‌ వినియోగాన్ని నియంత్రించేందుకు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో చర్యలు చేపట్టినట్లు ఏపీ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నియంత్రణపై కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆదేశాలను శుక్రవారం నుంచి అమలుచేస్తున్నట్లు ప్రకటించారు. వీటి ప్రకారం.. ఒకసారి వినియోగించి పారేసే (సింగిల్‌ యూజ్‌) ప్లాస్టిక్‌ వస్తువులు తయారుచేయడం, దిగుమతి చేయడం, నిల్వచేయడం, పంపిణీ, విక్రయంతో పాటు ఉపయోగించడం చట్ట ప్రకారం నిషేధించినట్లు ఆయన తెలిపారు.

ముఖ్యంగా ప్లాస్టిక్‌ స్టిక్‌లతో కూడిన ఇయర్‌ బడ్స్, ప్లాస్టిక్‌ జెండాలు, క్యాండీ స్టిక్స్, బెలూన్లకు కట్టే ప్లాస్టిక్‌ స్టిక్కులు, ఐస్‌క్రీమ్‌ స్టిక్స్‌తో పాటు టీ, కాఫీ కలుపుకునేందుకు వాడే ప్లాస్టిక్‌ స్టిక్స్‌ను పూర్తిగా నిషేధించినట్లు ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు. ఈ మేరకు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సింగిల్‌ యూజ్‌ ప్లాటిక్‌ నిషేధంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వార్డు వలంటీర్లు ప్రచారం చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా అన్ని వార్డుల్లోను ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ నియమాలపై కరపత్రాలను పంపిణీ చేయాలని, కూడళ్లల్లో హోర్డింగ్స్‌ను ఏర్పాటుచేయాలన్నారు. సినిమా థియేటర్లలో స్లైడ్లను ప్రదర్శించడంతో పాటు, టీవీ స్క్రోలింగ్స్, ర్యాలీలు నిర్వహించాలన్నారు.  

ఆ వస్తువులు ఉంటే లైసెన్స్‌ రద్దు 
వాణిజ్య షాపులు, రిటైలర్లు, అమ్మకందారులు, వీధి వ్యాపారులు, కూరగాయలు, పండ్ల మార్కెట్లు, మాల్స్‌తో పాటు ఇతర సంస్థల్లో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ పరికరాలు, క్యారీ బ్యాగులు నిల్వచేయడంతో పాటు వినియోగించినట్లు తేలితే ఆయా దుకాణాలు, షాపుల వాణిజ్య లైసెన్సులు రద్దుచేస్తామని హెచ్చరించారు. దీంతోపాటు భారీగా జరిమానాలు కూడా విధిస్తామన్నారు.

ఇక శుక్రవారం నుంచి అమలులోకి వచ్చే నిబంధనలను అమలుచేసేందుకు, దుకాణాలను తనిఖీ చేసేందుకు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 805 టాస్క్‌ఫోర్సు బృందాలను నియమించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటిదాకా ఈ బృందాలు 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల 158 మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ బ్యాగులను సీజ్‌ చేసి, రూ.1.54 కోట్ల జరిమానా వసూలు చేసినట్టు సీడీఎంఏ ప్రవీణ్‌కుమార్‌ వివరించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top