ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు | CCTV cameras in Andhra Pradesh government hospitals | Sakshi
Sakshi News home page

ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు

Apr 17 2022 4:48 AM | Updated on Apr 17 2022 2:59 PM

CCTV cameras in Andhra Pradesh government hospitals - Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వైద్యం మరింత మెరుగ్గా అందించేందుకు వీలుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని టీచింగ్‌ హాస్పటల్స్‌ మొదలు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకూ అన్నింటిలోనూ సీసీ కెమెరాల ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,968 ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో 8,260 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) ఆధ్వర్యంలో టెండర్లను ఆహ్వానించారు. టెండర్ల గడువు ఈ నెల 18తో ముగియనుంది. సాంకేతిక, ఫైనాన్స్‌ బిడ్ల అనంతరం అర్హత కలిగిన సంస్థకు పనులను అప్పగించనున్నారు. కాంట్రాక్టును దక్కించుకున్న 2 నెలల్లోగా పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది.  

ఒక్కో టీచింగ్‌ ఆస్పత్రిలో 20 కెమెరాలు
రాష్ట్రవ్యాప్తంగా 20 టీచింగ్‌ ఆస్పత్రులు, 17 జిల్లా ఆస్పత్రులు, 48 ఏరియా ఆస్పత్రులు, 178 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు (సీహెచ్‌సీ), 1,145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), 560 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (యుపీహెచ్‌సీ)లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులోనూ ఒక్కో టీచింగ్‌ ఆస్పత్రిలో 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనుండగా.. జిల్లా ఆస్పత్రులలో 16, ఏరియా ఆస్పత్రిలో 8 చొప్పున బిగించనున్నారు. ఇక పీహెచ్‌సీలో 4, యుపీహెచ్‌సీలో 2 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 8,260 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు.  
               

నిబంధనలు ఇవీ.!
► టెండర్‌ దక్కించుకున్న రెండు నెలల్లోగా పని పూర్తి చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 
► ఇక సీసీ కెమెరా రికార్డింగ్‌ బ్యాకప్‌ నెల రోజుల పాటు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. 
► పనులు దక్కించుకున్న సంస్థ రెండేళ్ల పాటు నిర్వహణను చేపట్టాలని నిబంధన విధించారు.
► సీసీ కెమెరాల నిర్వహణలో ఏదైనా సమస్య వస్తే 24 గంటల్లోగా పరిష్కరించాలి. ఒకవేళ 24 గంటల్లోగా సమస్యను పరిష్కరించకపోతే పెనాల్టీ కూడా విధించనున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement