ఉల్లం‘గనుల్లో బినామీలు’

CBI Case Against TDP Leader Yarapathineni Illegal Mining - Sakshi

టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని అక్రమ మైనింగ్‌పై సీబీఐ కేసు  

17 మంది నిందితుల్లో ఆరుగురు ఆయన బినామీలే

బినామీలను అడ్డుపెట్టి రూ.వందల కోట్ల సంపదను కొల్లగొట్టిన వైనం

మరి కొందరిపై సీబీఐ కేసులు నమోదు చేసే అవకాశం

టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సాగించిన అక్రమ మైనింగ్‌పై సీబీఐ కేసు నమోదు వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా టీడీపీ శ్రేణుల్లో యరపతినేని బినామీల వ్యవహారంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆరుగురు బినామీలపై కేసు నమోదు కావడంతో మిగిలినవారు భయపడుతున్నారు. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో తమ పేర్లు లేకపోవడం తాత్కాలికంగా ఊరట ఇస్తున్నా ముందు ముందు తమ పేర్లు, పాత్ర బయటపడుతుందన్న భయం వారిని వెంటాడుతోంది.

సాక్షి, గుంటూరు: టీడీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్‌కు పాల్పడిన విషయం బహిరంగ రహస్యమే. ఆయన బినామీలు, అనుచరులను అడ్డుపెట్టుకుని పిడుగురాళ్ల మండలం కోనంకి, దాచేపల్లి మండలం కేశానుపల్లి, నడికుడి గ్రామాల పరిధిలో జరిగిన అక్రమ మైనింగ్‌ విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. బుధవారం 17 మందిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నిందితుల్లో ఆరుగురు యరపతినేని బినామీలేనని టీడీపీలోనే చర్చ నడుస్తోంది.

అక్రమ మైనింగ్‌పై కేసుల నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులు మరికొందరిపై కేసులు నమోదు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే యరపతినేని బినామీలపై కేసులు నమోదవ్వడంతో అక్రమ మైనింగ్‌లో కీలక పాత్ర పోషించిన ఘట్టమనేని బుల్లెబ్బాయి, ఘట్టమనేని నాగేశ్వరరావు, ముప్పన వెంకటేశ్వర్లు తదితరులు ఆందో ళనలో ఉన్నట్టు తెలుస్తోంది. సీబీఐ నమోదు చేసి న ఎఫ్‌ఐఆర్‌లో తమ పేర్లు లేకపోవడం తాత్కాలికంగా ఊరటనిస్తున్నప్పటికీ పూర్తి స్థాయి విచారణ మొదలైతే తమ పేర్లు, పాత్ర బయపడుతుందని భయం వారిని వెంటాడనుంది.   

యరపతినేని బినామీల చరిత్ర ఇదీ..  
ఏ–1 నెల్లూరి శ్రీనివాసరావు : కేశానుపల్లికి చెందిన నెల్లూరి శ్రీనివాసరావు పెట్రోలు బంకులో సూపర్‌వైజర్‌గా పనిచేస్తూ టీడీపీలో యరపతినేని అనుచరుడిగా తిరుగుతుండేవాడు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కేశానుపల్లి గ్రామంలో ఉన్న క్వారీలన్నింటిని తమ ఆధీనంలోకి తీసుకుని పర్యవేక్షణ బాధ్యతలు మొత్తం నెల్లూరు శ్రీనివాసరావుకు అప్పగించేశారు. క్వారీల్లో అక్రమంగా లైమ్‌స్టోన్‌ను తవ్వడం నుంచి మిల్లులకు సరఫరా చేయడం వరకు ఇతనే చూశాడని ప్రచారం. అక్రమ మైనింగ్‌ పుణ్యమా అని పెట్రోల్‌ బంకులో పనిచేసిన శ్రీనివాసరావు నేడు రూ.కోట్లకు పడగలెత్తాడు.
 

ఏ–6 బత్తుల నరసింహారావు: 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే అప్పటి వరకు నడుస్తున్న వడ్డెర కో–ఆపరేటీవ్‌ సొసైటీని రద్దు చేసి యరపతినేని అండతో కొత్త సొసైటీ ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా కొనసాగాడు. కేశానుపల్లిలో 25 ఎకరాలు, నడికుడి రైల్వే స్టేషన్‌ సమీపంలోని అంజనీపురం కాలనీ పక్కనే ఉన్న జేపీ సిమెంట్, ప్రభుత్వ భూములు సుమారు 150 ఎకరాలు ఆక్రమించేశారు. యరపతినేని కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్‌ మాఫియా అండతో వడ్డెర సొసైజీలోని యరపతినేని అనుచరులతో లైమ్‌ స్టోన్‌ను దోచేయడంలో కీలకపాత్ర పోషించాడు. నడికుడి, కేశానుపల్లిల్లో అక్రమ మైనింగ్‌ బ్లాస్టింగ్స్, తదితర వ్యవహారాలను చూసుకున్న నరసింహారావు కుమారుడు బత్తుల రాంబాబుపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు.  

ఏ–7 మీనిగ అంజిబాబు: పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామానికి చెందిన మీనిగ అంజిబాబు 2014 టీడీపీ అధికారంలోకి రాకముందు వరకూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే యరపతినేని కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్‌ మాఫియా ముఠాలో ఇతను ఒక సభ్యుడుగా మారాడు. ఇతను క్వారీ వద్ద కాపలాగా ఉంటూ రోజువారి టిప్పర్లలో లైమ్‌స్టోన్‌ను ఏఏ మిల్లులకు తరలించారనే వివరాలను బుల్లెబ్బాయి ద్వారా యరపతినేనికి తెలిపేవాడు. అక్రమ మైనింగ్‌ జరిగే క్వారీల్లో కొందరు కురాళ్లను అంజిబాబు నిఘా కొనసాగించేవాడు. కూలీలకు డబ్బు చెల్లించడం, క్వారీవైపు ఇతరులు ఎవ్వరినీ కన్నెత్తకుండా చేయడం లాంటివి చేస్తూ చోటా డాన్‌లా ఇతను వ్యవహరించాడు.
ఏ–9 గ్రంధి అజయ్‌కుమార్‌: పిడుగురాళ్ల పట్టణానికి చెందిన గ్రంధి అజయ్‌ కొండమోడులో యరపతినేని కనుసన్నల్లో నడిచే అక్రమ క్వారీ వ్యవహారాలను చూసుకున్నాడు.  
ఏ–12 గుదె వెంకట శివకోటేశ్వరరావు: పిడుగురాళ్లకి పట్టణానికి చెందిన గుదె వెంకట శివకోటేశ్వరరావు అలియాస్‌ కోటి అక్రమ మైనింగ్‌కు మందు గుండు సామాగ్రి సరఫరా చేస్తూ మైనింగ్‌ కార్యక్రమాలను పరిశీలిస్తుంటాడు. మిల్లులకు సరఫరా చేసిన లైమ్‌స్టోన్‌ తాలుకూ డబ్బును వసూలు చేసి ఏ రోజుకు ఆ రోజు యరపతినేనికి లెక్కలు చెప్పడం వంటి కార్యకలాపాలు ఇతనే చూసుకున్నాడు.  
ఏ–16 నీరుమల్ల శ్రీనివాసరావు: పిడుగురాళ్ల పట్టణానికి చెందిన నీరుమల్ల శ్రీనివాసరావు వార్డు స్థాయిలో టీడీపీ క్రీయాశీల నేత, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బినామిల్లో ఒకడు. ఇతడు 1.30 లక్షల టన్నుల తెల్లరాయిని అక్రమ మైనింగ్‌ ద్వారా దోచేశాడని మైనింగ్‌ అధికారులు 2018లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top