తొమ్మిది పద్దులకు శాసనసభ ఆమోదం

Budget was approved in Andhra Pradesh Assembly Budget Sessions - Sakshi

2023–24 బడ్జెట్‌ పద్దులపై చర్చ

రూ.89,232.55 కోట్ల విలువైన పద్దులను ఆమోదించిన సభ

సాక్షి, అమరావతి: శాసనసభ సమావేశాల్లో భాగంగా శనివారం బడ్జెట్‌ పద్దులకు ఆమోదం లభించింది. ఇందులో భాగంగా రూ.89,232.55 కోట్ల విలువైన తొమ్మిది పద్దులను సభ ఆమోదించింది. అనంతరం వీటిపై సభ్యులు చర్చించారు. తర్వాత వారు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. 2023–24 వార్షిక బడ్జెట్‌లో భాగంగా రోడ్లు–భవనాలు, జలవనరులు, ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర– సాంకేతిక, గృహనిర్మాణం, బీసీ, సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల నిర్వహణ పద్దులు ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి. 

రూ.21,756.69 కోట్లు వెచ్చించాం
మైనార్టీల సంక్షేమం అంటే నాడు వైఎస్సార్‌ గుర్తొస్తే.. నేడు వైఎస్‌ జగన్‌ గుర్తొస్తారు. మైనార్టీల సంక్షేమానికి చంద్రబాబు గత ఐదేళ్లలో రూ.2,665 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే.. మా ప్రభుత్వం 45 నెలల కాలంలోనే రూ.21,756.69 కోట్లు వెచ్చించింది. దేశంలోనే తొలిసారిగా మైనార్టీలకు సబ్‌ప్లాన్‌ తీసుకొచ్చిన ప్రభు­త్వం మాది.    
– అంజాద్‌బాషా, ఉప ముఖ్యమంత్రి

బీసీల కోసం ఆలోచించే ప్రభుత్వం సీఎం జగన్‌ బీసీల జీవితాల్లో మార్పు కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారు. 56 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుతో పాటు నవరత్నాలతో ఆర్థిక భరోసా కల్పి­స్తున్నారు. బీసీల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించే ప్రభుత్వం ఇది.
   – చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి

17 వేల జగనన్న కాలనీలు
ఏపీలో 13 వేల గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో 17 వేల జగనన్న కాలనీలు రూపుదిద్దుకుంటున్నాయి. ప్రతి మహిళకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆస్తిని సీఎం జగన్‌ ఇంటి స్థలం రూపంలో అందించారు. ఇంకా ఎక్కడైనా అర్హులు ఉంటే వారికి కూడా ఇళ్ల స్థలాలు అందిస్తాం.
    – జోగి రమేష్, గృహ నిర్మాణ శాఖ మంత్రి

ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలి
రాష్ట్రంలో ఇరిగేషన్‌పై పేటెంట్‌ రైట్‌ వైఎస్సార్‌కే ఉంది. పోలవరం నిర్మాణంతోపాటు సర్‌ ఆర్థర్‌ కాటన్‌ కట్టడాల ఆధునికీకరణ పనులు ఆయన హయాంలోనే జరిగాయి. ఇప్పుడు వాటిపై దృష్టి సారించాల్సిన సమయం వచ్చింది. దెబ్బతిన్న కాటన్‌ ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలి. కోనసీమ ప్రాంతంలో నీరందని పరిస్థితి ఉంటే రైతుల ఆయిల్‌ ఇంజన్లకు నగదు ఇవ్వాలి. ముంపు చర్యలను కూడా శాశ్వతంగా పరిష్కరించాలి.    
– చిర్ల జగ్గిరెడ్డి, ప్రభుత్వ విప్‌

గతం కంటే అధికంగా కేటాయింపులు
గతేడాదితో పోలిస్తే గిరిజన సంక్షేమానికి 18 శాతం అదనంగా ఈసారి బడ్జెట్‌లో ప్రభుత్వం కేటాయించింది. సబ్‌ప్లాన్‌ కింద 13 శాతం ఎక్కువగా కేటాయింపులు చేసింది. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో గిరిజనుల సంక్షేమానికి రూ.12,600 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. జగన్‌ ప్రభుత్వం 45 నెలల్లోనే రూ.16,975 కోట్లు ఖర్చు చేసింది. ఐదేళ్లు పూర్తయ్యే సరికి రూ.22 వేల కోట్లు ఖర్చు చేయనున్నాం.
    – పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి

మైనార్టీల అభ్యున్నతికి అండగా..
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు విద్య, వైద్యం, ఇళ్లు, సంక్షేమ పథకాలతో భరోసా ఇస్తోంది. విద్య దగ్గర నుంచి పెళ్లి వరకు అన్ని రకాల సాయం అందిస్తూ మైనార్టీల అభ్యున్నతికి అండగా నిలుస్తోంది. వక్ఫ్‌ బోర్డు ఆస్తుల పరిరక్షణకు మరింత పటిష్ట చర్యలు చేపట్టాలి. 
    – హఫీజ్‌ఖాన్, ఎమ్మెల్యే

రోడ్ల పనులను వేగంగా పూర్తి చేయాలి
గత ప్రభుత్వం చేసిన పాపాలకు రోడ్లపై తిరగలేని పరిస్థితి ఉంది. పైగా ఇప్పుడే రోడ్లు దెబ్బతిన్నట్టు టీడీపీ దుష్ప్ర­చారం చేస్తోంది. ఈ బడ్జెట్‌లో రూ.9 వేల కోట్లకుపైగా రోడ్లకు కేటాయించడం హర్షణీయం. ఆయా రోడ్ల పనులను వేగంగా పూర్తి చేయాలి.    
– కరణం ధర్మశ్రీ, ప్రభుత్వ విప్‌

విద్యుత్‌ ఉత్పత్తి పెరిగింది
ఇప్పటి వరకు మా ప్రభుత్వం ఉచిత విద్యుత్‌కు రూ.27,800 కోట్లు ఖర్చు చేసింది. ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్‌ నష్టాలను తగ్గించాలని కేంద్రం చెప్పినట్టు స్మార్ట్‌ మీటర్లు పెడుతుంటే టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. సమృద్ధిగా వర్షాలు పడటంతో డ్యాములు నిండాయి. ఫలితంగా విద్యుత్‌ ఉత్పత్తి పెరిగింది.    
– కిలారి రోశయ్య, ఎమ్మెల్యే

అన్ని రంగాల్లో గిరిజనులు ముందుకు
సామాజికంగా, రాజకీయంగా గిరిజనులను పైకి తీసు­కొస్తున్న ఏకైక ప్రభుత్వం మాది. గతంలో ఎన్నడూ లేని విధంగా గిరిజనులు ప్రస్తుతం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఆంగ్లంలోనూ విద్యనభ్యసిస్తున్నారు. గురుకులాల్లో ఆరోగ్య, భద్రత చర్యలను మరింత మెరుగుపర్చాలి. ప్రస్తుత హైస్కూళ్లను ఇంగ్లిష్‌ మీడియం కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేయాలి. అటవీ ఉత్పత్తుల సంతల ఆధునికీకరణ, ప్రాసెసింగ్‌ యూనిట్ల అభివృద్ధి చేపట్టాలి.
    – విశ్వాసరాయ కళావతి, ఎమ్మెల్యే 

వైఎస్సార్‌ తర్వాత జగన్‌ ఒక్కరే..
పేదలకు ఇళ్లే స్వర్గసీమ. మహానేత వైఎస్సార్‌ తర్వాత పేదలకు ఇళ్ల గురించి ఆలోచించిన వ్యక్తి.. సీఎం జగన్‌. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఇస్తే.. మా రాయదుర్గం నియోజకవర్గంలోనే 13 వేల మందికి పట్టాలు ఇచ్చారు. 
    – కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే

ఎస్సీలకు ఇంటింటికీ సంక్షేమం..
రాష్ట్రంలో ఎస్సీలకు ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఎస్సీల సంక్షేమానికి గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.33 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మా ప్రభుత్వం నాలుగేళ్లలోనే రూ.52 వేల కోట్లు ఖర్చు చేసింది. 
    – కొరముట్ల శ్రీనివాసులు, ప్రభుత్వ విప్‌

బీసీలకు ఉన్నత పదవులు.. 
దేశ చరిత్రలోనే ఎక్కడా లేనివిధంగా 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బీసీలను సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపిస్తోంది. చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటే.. నేడు జగన్‌ ప్రభుత్వంలో బీసీలకు ఉన్నత పదవులు దక్కుతున్నాయి.
    – ఉమాశంకర్‌ గణేష్, ఎమ్మెల్యే 

రాష్ట్ర మహిళలకు ఆర్థికంగా అగ్రస్థానం
ఓఈసీడీలోని అభివృద్ధి చెందిన 38 దేశాల్లో అవలంబిస్తున్న యాక్షన్‌ ప్లాన్‌ మన రాష్ట్రంలో అమలవుతోంది. దేశంలోనే మన రాష్ట్ర మహిళలు ఆర్థికంగా అగ్రస్థానంలో నిలుస్తున్నారు. మహిళా భద్రత, శిశు సంరక్షణకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. అర్హులైన దివ్యాంగులకు అవసరమైన సాయాన్ని సత్వరం అందించేలా మరింత కృషి చేయాలి.
    – కంగాటి శ్రీదేవి, ఎమ్మెల్యే  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top