ప్రైమరీ టీచర్లకు బ్రిడ్జి కోర్సు తప్పనిసరి

Bridge course is mandatory for primary teachers - Sakshi

బీఈడీ, ఎంఈడీ చేసి ఎస్జీటీలుగా ఎంపికైన వారికి వర్తింపు 

సాక్షి, అమరావతి: బీఈడీ, ఎంఈడీ చేసి ప్రైమరీ స్కూళ్లలో (1–5 తరగతులు) టీచర్లు (ఎస్జీటీ)గా చేరే వారు ఇకపై 6 నెలల బ్రిడ్జి కోర్సును తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. సర్వీసులో చేరిన తర్వాత రెండేళ్లలో ఈ కోర్సులో ఉత్తీర్ణులు కావల్సి ఉంటుంది. ఈ మేరకు నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్సీటీఈ) నూతన మార్గదర్శకాలను ఇటీవల జారీ చేసింది.

ప్రైమరీ స్కూల్‌ టీచర్‌ (సెకండరీ గ్రేడ్‌ టీచర్లు–ఎస్జీటీ) పోస్టులకు ఎలిమెంటరీ టీచర్‌ ట్రైనింగ్‌ (డీఎడ్, డీఎల్‌ఈడీ) పాసయిన వారిని మాత్రమే గతంలో అనుమతించేవారు. బీఈడీ, ఎంఈడీ చేసిన వారు కేవలం స్కూల్‌ అసిస్టెంటు పోస్టులకు మాత్రమే అర్హులుగా ఉండేవారు. అయితే సుప్రీంకోర్టు సూచనల మేరకు ఎన్సీటీఈ ఈ నిబంధనను కొద్దికాలం కిందట మార్పు చేసింది.

బీఈడీ, ఎంఈడీ చేసిన వారు కూడా ఎలిమెంటరీ టీచర్‌ పోస్టులకు అర్హులుగా ప్రకటించింది. మన రాష్ట్రంలో టెట్‌ నిర్వహణలో ఎస్జీటీ పోస్టులకు పేపర్‌–1ను, స్కూల్‌ అసిస్టెంటు పోస్టులకు పేపర్‌–2ను వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. ఎన్సీటీఈ నిబంధనలు మార్చిన అనంతరం ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసే బీఈడీ, ఎంఈడీ అభ్యర్థులకు పేపర్‌–1ను తప్పనిసరి చేసింది. ఇలా పేపర్‌–1ను రాసి ఎస్జీటీ పోస్టులకు ఎంపికయ్యే బీఈడీ, ఎంఈడీ అభ్యర్థులు సర్వీసులో చేరిన అనంతరం బ్రిడ్జి కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది.

అలాగే 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్‌ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేట్‌ డిగ్రీ, ఒక ఏడాది బీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ శిక్షణ, లేదా 55 శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేషన్, మూడేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ, ఎంఈడీలు చేసి ఉండాలని ఎన్సీటీఈ పేర్కొంది. ఈ అర్హతలున్న వారు ఆయా రాష్ట్రాల్లో టీచర్‌ ఎలిజిబులిటీ టెస్టు (టెట్‌), లేదా సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబులిటీ టెస్టు (సీటీఈటీ)లలో అర్హత సాధించాల్సి ఉంటుంది. వీటిలో ఒక సారి అర్హత సాధిస్తే ఆ సర్టిఫికెట్‌కు జీవితకాల పరిమితి ఉంటుంది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top