అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో ఆగిన రక్త పరీక్షలు 

Blood Tests Stop At Urban Health Centers In kadapa - Sakshi

రీ ఏజెంట్స్‌ సరఫరా లేకే ఈ దుస్థితి 

రోగ నిర్ధారణ జరగకుండానే వైద్యం 

వేధిస్తున్న మందుల కొరత 

దృష్టి సారించని జిల్లా యంత్రాంగం 

ఇబ్బందులు పడుతున్న సామాన్యులు 

కడప సెవెన్‌రోడ్స్‌: ఆరోగ్యం బాగోలేకపోతే వైద్యుని వద్దకు వెళతాం. అవసరమైన పరీక్షలు నిర్వహించి రోగ నిర్ధారణ చేస్తారు. ఆ తర్వాతే ఆ వ్యాధిని పోగొట్టేందుకు తగిన మందులు ఇస్తారు. ఎక్కడైనా జరిగేది, జరగాల్సింది  కూడా ఇదే. కానీ కడప అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. రోగ నిర్ధారణ జరగకుండానే ఏవో మందులు ఇచ్చి రోగులను పంపేస్తున్నారు.

అందుకు అక్కడి సిబ్బందిని తప్పుబట్టాల్సిన పనిలేదు. ఎందుకంటే రక్త పరీక్షలకు అవసరమైన రీ ఏజెంట్స్‌ (కారకాలు) సరఫరా లేకపోవడంతో వారు అలా చేస్తున్నారు. జిల్లా స్థాయి అధికార యంత్రాంగం దీనిపై దృష్టి సారించకపోవడం వల్లనే ఈ పరిస్థితి దాపురించినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల వైఖరి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఉంది.

ఇది వర్షాకాలం. దోమకాటు, కలుషిత నీరు తాగడం వల్ల డెంగీ, మలేరియా, టైఫాయిడ్, ఇతర వైరల్‌ జ్వరాలు వ్యాపిస్తున్నాయి. దీంతో వ్యాధి బారిన పడిన ప్రజలు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. అంతో ఇంతో స్థోమత ఉన్న వారు ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు. వేల రూపాయలు ఖర్చు చేయలేని పేదలు రిమ్స్, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, పీహెచ్‌సీలను ఆశ్రయిస్తున్నారు.

ఆస్పత్రులు, డయోగ్నోస్టిక్‌ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం అక్కాయపల్లె అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌కు పలువురు రోగులు వైద్యం చేయించుకోవడానికి వచ్చారు. తనకు ఐదారు రోజులుగా జ్వరం వస్తోందని, ఇంతకుమునుపు ఇక్కడ చూపించగా పారాసిటమాల్‌ మాత్రలు ఇచ్చారని ఓ రోగి వైద్యుడికి తెలిపారు. కానీ జ్వరం తగ్గలేదని, రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలని కోరారు.

ఇందుకు వైద్యుడు హిమోగ్లోబిన్‌ టెస్ట్‌ చేయించుకు రావాలని చీటీ రాయించారు. అక్కడే ఉన్న ల్యాబ్‌లోకి వెళ్లి పరీక్ష చేయించగా 11.9 శాతం ఉన్నట్లు తెలిసింది. తనకు కావాల్సింది హిమోగ్లోబిన్‌ టెస్ట్‌ కాదని, తనను పీడిస్తున్న జ్వరం ఏదో చెప్పాలని ఆ రోగి అడిగాడు. డెంగీ, మలేరియా, టైఫాయిడో రక్త పరీక్షల ద్వారా తేల్చాలంటే అందుకు అవసరమైన రీ ఏజెంట్స్‌ ప్రభుత్వం నుంచి సరఫరా కాలేదని సిబ్బంది కుండబద్దలు కొట్టారు.

ఇక చేసేది లేక వైద్యుని వద్దకు వెళ్లగా పారాసిటమాల్‌ ఇంజెక్షన్, పారాసిటమాల్‌ మాత్రలు, అజిత్రోమైసిన్‌ యాంటిబయాటిక్‌ మాత్రలు వాడాలని సూచించారు. అయితే హెల్త్‌ సెంటర్‌లో అజిత్రోమైసిన్‌ మాత్రలు లేవు. అందుకు బదులు అమోక్సీలిన్‌ క్యాప్సూల్స్‌ ఇచ్చారు. దీన్నిబట్టి అర్థమవుతున్నదేమిటంటే ఏ జ్వరం పీడిస్తున్నదో నిర్ధారణ కాకున్నా, జ్వరం అనగానే రొటీన్‌గా ఇచ్చే మాత్రలు ఇచ్చి పంపేస్తున్నారు. ఈ పని మందుల షాపు వారైనా చేస్తారు. ఇంత మాత్రానికి ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం ఏముందని పలువురు రోగులు ప్రశ్నిస్తున్నారు.

కాదు, కూడదని అడిగితే రిమ్స్‌కు వెళ్లాలని సలహా ఇస్తున్నారు. జ్వరాలు వంటి చిన్నచిన్న వ్యాధులకు దూరం వెళ్లకుండా ప్రజలకు వైద్యం అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. అవసరమైన సిబ్బంది, పరికరాలు ఉన్నా రీ ఏజెంట్స్‌ వంటివి సరఫరా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడం విచారకరం.

రీ ఏజెంట్స్‌ కొరత నిజమే 
రక్త పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ చేయడానికి అవసరమైన రీ ఏజెంట్స్‌ (కారకాలు) లేని మాట వాస్తవమే. సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టోర్‌ (సీడీఎస్‌) నుంచి సరఫరా కావాల్సి ఉంది. రీ ఏజెంట్స్‌ కొరత ఉంది గనుకే ఎవరైనా ఇన్‌సిస్ట్‌ చేస్తేనే రక్త పరీక్షలు చేస్తున్నాం. అర్బన్‌ సెంటర్లలో లేకపోతే రిమ్స్‌ వెళ్లి రక్త పరీక్షలు నిర్వహించుకోవచ్చు. హెల్త్‌ సెంటర్లలో అజిత్రోమైసిన్‌ లేకపోతే అందుకు బదులు అమోక్సీలిన్‌ క్యాప్సూల్స్‌ వాడినా సరిపోతుంది.     
– డాక్టర్‌ కె.నాగరాజు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, కడప 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top