Kambhampati Hari Babu: ప్రొఫెసర్‌ స్థాయి నుంచి గవర్నర్‌ గా..

Bjp Leader Kambhampati Hari Babu Appointed Mizoram Governor - Sakshi

సాక్షి, విశాఖపట్నం: బీజేపీ సీనియర్‌ నేత కంభంపాటి హరిబాబు మిజోరాం రాష్ట్ర గవర్నర్‌గా నియమితులవడంపై విశాఖలో అన్ని వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలకతీతంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. హరిబాబు ప్రకాశం జిల్లాలో జన్మించినప్పటికీ విద్యార్థి నుంచి విశాఖలోనే స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు. విద్య, ఉద్యోగం, రాజకీయ ప్రస్థానం విశాఖ కేంద్రంగానే సాగించారు. 

ఏయూ విద్యార్థి నుంచి ప్రొఫెసర్‌ వరకు..  
హరిబాబు ప్రకాశం జిల్లా తిమ్మసముద్రం గ్రామంలో 1953, జూన్‌ 15న జన్మించారు. పాఠశాల విద్య పూర్తి చేసిన తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీటెక్‌ పూర్తి చేశారు. పీహెచ్‌డీ పట్టా కూడా ఏయూ నుంచే పొందారు. ఇక్కడే అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. 1993లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. 

విద్యార్థి నాయకుడిగా.. 
విద్యార్థి దశలోనే నాయకుడిగా అనేక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1972–73లో ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థి యూనియన్‌కు సెక్రటరీ అయ్యారు. 1975–75లో లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ ఆధ్వర్యంలో జరిగిన లోక్‌ సంఘర్ష సమితి ఉద్యమంలో పాల్గొన్నారు. ఎమర్జెన్సీ కాలంలో అంతర్గత భద్రతలో భాగంగా అరెస్ట్‌ అయ్యారు. విశాఖ సెంట్రల్‌ జైలు, ముషీరాబాద్‌ జైలులో 6 నెలలు ఉన్నారు. జైఆంధ్రా ఉద్యమంలో పాల్గొన్నారు. 1977లో క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. జనతా పార్టీలో చేరి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడిగా సేవలందించారు. 1978లో జనతా యువమోర్చాకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1991–93 మధ్యలో పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడిగా ఉన్నారు. 1993–2003 కాలంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. 

విశాఖ–1 ఎమ్మెల్యేగా.. 
1999లో విశాఖ–1 నియోజకవర్గం నుంచి హరిబాబు పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2003లో శాసనసభలో ఆ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌గా పనిచేశారు. 2004 ఎన్నికల్లో కూడా అక్కడే నుంచి పోటీ చేసినప్పటికీ ఓటమిపాలయ్యారు. 2014 మార్చిలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అదే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. తన పదవీ కాలం ముగిసిన తరువాత తిరిగి ఎన్నికల్లో పోటీ చేయలేదు.   

అభినందనల వెల్లువ 
గవర్నర్‌గా నియమితులైన హరిబాబుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దసపల్లా హిల్స్‌ ప్రాంతంలో ఉన్న ఆయన నివాసం సందడిగా మారింది. బీజేపీ నేతలతో పాటు అన్ని పక్షాల నేతలు, సన్నిహితులు హరిబాబు ఇంటికి వెళ్లి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలియజేస్తున్నారు. బీజేపీ విశాఖ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర, బీజేపీ జిల్లా ఇన్‌చార్జి కోడూరి లక్ష్మీనారాయణ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top