ఆర్బీకేల సేవలు ఆదర్శనీయం

Biswabhusan Harichandan comments about Rythu Bharosa Centres - Sakshi

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌

సాక్షి, అమరావతి: ఏకగవాక్ష విధానంలో రైతులకు అవసరమైన సేవలన్నీ అందిస్తోన్న వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు ఆదర్శనీయమని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. దళారుల పాత్ర లేకుండా చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయడం రైతులకు భరోసాను ఇస్తోందని సంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో గురువారం వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య భేటీ అయ్యారు. ఆర్బీకేల పనితీరు నివేదికను గవర్నర్‌కు సమర్పించారు. త్వరలో తాను ఆర్బీకేలను సందర్శిస్తానని గవర్నర్‌ చెప్పారు.5 రాష్ట్రాల ప్రతినిధులు ఏపీలోని ఆర్బీకేలను సందర్శించి అధ్యయనం చేశారని గవర్నర్‌కు పూనం మాలకొండయ్య వివరించారు.

చేనేత వస్త్రాలు భారతీయ సంస్కృతికి ప్రతీకలు
చేనేత వస్త్రాలు భారతీయ సంస్కృతికి ప్రతీకలని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. విజయవాడ రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో ఆప్కో చైర్మన్‌ మోహనరావు గురువారం భేటీ అయ్యి చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతోన్న చర్యలను వివరించారు. గన్నవరం, విశాఖ, తిరుపతి విమానాశ్రయాల్లో ఆప్కో కేంద్రాలను త్వరలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. చేనేత రంగాన్ని కేంద్రం జీఎస్టీ నుంచి మినహాయింపునకు చొరవ చూపాలని గవర్నర్‌ను కోరారు. దీనిపై గవర్నర్‌ సానుకూలంగా స్పందిస్తూ జీఎస్టీ మినహాయింపు అంశంలో పూర్తిగా సహకరిస్తానని చెప్పినట్లు మోహనరావు తెలిపారు.

సుహృద్భావాన్ని పెంపొందించే హోలీ
హోలీ పండుగ సమాజంలో సహృద్భావం, సద్భావనను పెంపొందిస్తుందని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. శాంతి, శ్రేయస్సుకు ప్రతీకగా నిలిచే హోలీ పండుగ సామాజిక నిర్మాణాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన హోలీ శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్‌ మార్గదర్శకాలు పాటిస్తూ హోలీ పండుగను జరుపుకోవాలని గవర్నర్‌ సూచించినట్టుగా రాజ్‌భవన్‌ వర్గాలు గురువారం ఓ ప్రకటనలో తెలిపాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top