ఓటుహక్కు శక్తివంతమైన ఆయుధం 

Biswabhusan Harichandan comments in 12th National Voters Day - Sakshi

ప్రజాస్వామ్య పరిరక్షణ బాధ్యత యువతపైనే అధికం 

12వ జాతీయ ఓటర్ల దినోత్సవంలో గవర్నర్‌ విశ్వభూషణ్‌

సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుహక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. 12వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో మంగళవారం రాష్ట్రస్థాయి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజ్‌భవన్‌ నుంచి వెబినార్‌ ద్వారా హాజరైన గవర్నర్‌ హరిచందన్‌ మాట్లాడుతూ.. అర్హత గల ప్రతి పౌరుడు ఓటరుగా పేరు నమోదు చేసుకుని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని సూచించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా భారతదేశం ఉన్నందుకు మనమంతా గర్వించాల్సిన విషయమన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ బాధ్యత ప్రధానంగా యువతపై ఉందని, వారంతా ఓటరు నమోదు ప్రక్రియలో క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

పౌరులు ఓటరుగా పేరు నమోదు చేసుకునే ప్రక్రియలో భారత ఎన్నికల సంఘం పారదర్శకంగా ఉంటూ.. దీనిని మరింత సులభతరం చేసేందుకు అనేక రకాల వినూత్న చర్యలను చేపట్టడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆధార్‌తో ఫొటో ఓటరు గుర్తింపు కార్డును అనుసంధానించడం ద్వారా పేరు నమోదు ప్రక్రియను సులభతరం చేయడంతోపాటు ఒకే వ్యక్తి పేరు రెండుసార్లు నమోదు కాకుండా నివారించేందుకు అవకాశం కలిగిందన్నారు. రాష్ట్రంలో ఈ నెల 5వ తేదీ నాటికి 4.07 కోట్ల మంది ఓటర్లుగా నమోదయ్యేందుకు నిర్వహించిన విస్తృత ప్రచార అవగాహనా కార్యక్రమాల్లో భాగస్వాములైన రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలకు గవర్నర్‌ కృతజ్ఞతలు తెలిపారు.   

ఓటర్లలో 50 శాతం మంది యువతే 
ఆన్‌లైన్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ మాట్లాడుతూ.. ఓటర్లలో 50 శాతం మంది యువత ఉండటం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో అర్హత గల ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేసేందుకు పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు. ముఖ్యంగా విద్యాసంస్థల్లో ఎలక్టోరల్‌ లిట్రసీ క్లబ్‌లు ఏర్పాటు చేసి అర్హత గల వారందరికీ అవగాహన కల్పించి ఓటర్లుగా నమోదు చేశారని అన్నారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్‌ మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం వ్యవస్థాపక దినోత్సవంలో భాగంగా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని 2011 నుంచి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 45,950 ప్రాంతాల్లో ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

ఈ సందర్భంగా భారత ప్రధాన ఎన్నికల అధికారి సుశీల్‌ చంద్ర పంపిన వీడియో సందేశాన్ని సమావేశంలో ప్రదర్శించారు. తొలుత కార్యక్రమంలో పాల్గొన్న అందరితో గవర్నర్‌ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఓటర్ల నమోదు, ఎన్నికల నిర్వహణ, పోలింగ్‌ కేంద్రం స్థాయి నుంచి జిల్లా కేంద్రం వరకూ వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనపర్చిన వివిధ జిల్లాల ఎన్నికల అధికారులు కార్తికేయ మిశ్రా, ఎ.సూర్యకుమారి, నాగలక్ష్మి, నెల్లూరు ఎన్నికల అధికారి కేవీఎన్‌ చక్రధరబాబు, వైఎస్సార్‌ జిల్లా రాజంపేట సబ్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్, విధాన పరిషత్‌ ద్వైవార్షిక ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి పీవీ సుబ్బారెడ్డిలకు సీఈవో విజయానంద్‌ ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందించారు. జిల్లాకు ఒకరు చొప్పున 13 మంది ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు, 13 మంది ఏఈఆర్వోలు, 13 మంది బూత్‌ స్థాయి అధికారులకు, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు సెక్షన్‌ అధికారులకు, విజయనగరం, ప్రకాశం జిల్లాలకు చెందిన ఇద్దరు ఎస్‌ఎల్‌ఏ టీం సిబ్బందికి ప్రశంసా పత్రాలను, జ్ఞాపికలను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి విజయానంద్‌  అందించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top