కావలి టీడీపీలో ఇద్దరు ముఖ్య నేతల మధ్య ఆదిపత్య పోరు తారస్థాయికి చేరింది. దగదర్తికి చెందిన నేత, ఏపీ ఆగ్రో ఇండ్రస్టీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు మరణం తర్వాత ఆ పారీ్టలో వర్గ రాజకీయాలు ముదిరి పాకాన పడ్డాయి. మాలేపాటి కుటుంబానికి పరామర్శకు లోకేశ్ దగదర్తికి వచ్చినా.. కావ్యను రానివ్వకపోగా, ఆయన్ను టోల్‌గేట్ నుంచే వెనక్కి పంపించడం తెలిసిందే. ఆ తర్వాత కావలిలో ఎమ్మెల్యే కావ్య పెత్తనానికి కత్తెర వేశారని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో బీద సైతం కలెక్టర్, జేసీ, ఎస్పీలతో మర్యాద పూర్వక భేటీలు సైతం ఈ ప్రచారానికి బలం చేకూర్చినట్లు అయింది. ఈ క్రమంలో కావ్య బహిరంగ వేదికల్లో కావలిలో తనను కాదని మరెవరి పెత్తనం ఉండబోదని, చంద్రబాబు ప్రతినిధిని నేనేనంటూ బీద పెత్తనం చేస్తే సహించనని పరోక్షంగానే చెప్పడంతో ఇప్పుడు హాట్‌టాపిక్ చర్చ జరుగుతోంది.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి (కావ్య కృష్ణారెడ్డి) తన ఉనికిని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. నిన్నటి వరకు ‘తానే రాజు.. తానే మంత్రి’ అంటూ వ్యవహరించారు. టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న మాలేపాటి ఆకస్మిక మరణం తర్వాత వర్గ రాజకీయాలు పొడచూపాయి. ఈ క్రమంలో కావలిలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పెత్తనానికి లైన్ క్లియర్ అయినట్లు ప్రచారం జరుగుతున్న సమయంలో.. ‘కావలి తన అడ్డా అని’.. మరొకరు పెత్తనం చేస్తే సహించబోనంటూ పరోక్షంగా బీదను కెలికారు. ఈ క్రమంలో మొన్నటికి మొన్న కావ్య ఓ బహిరంగ వేదికలో ‘కావలిలో చంద్రబాబు, టీడీపీ ప్రతినిధిగా నేనే ఉన్నాను.. ఉంటాను. నేను తప్ప రెండో వ్యక్తి ఎవరూ ఉండరు. రెండో వర్గం రాజకీయాలు చేస్తానంటే క్షమించే ప్రసక్తే లేదు. ఏదైనా ఉంటే తాను, అధిష్టానం చూసుకుంటాం.. తాము తీసుకునే నిర్ణయాల్లో ఎవరైనా గీతదాటితే కఠినంగానే వ్యవహరిస్తాను.
ఇప్పటి వరకు ఎవరిపైనా కన్ను పెట్టలేదు. ఇకపై అధిష్టానానికి తెలియజేస్తాను. మీకు ఏదైనా అవసరం వస్తే చేయాల్సింది నేను.. చేయించుకోవాల్సింది మీరు. మధ్యలో వేరెవరికో చెబితే పని కాదంటూ’ పరోక్షంగా బీద పెత్తనం ఉండబోదని టీడీపీకి క్యాడర్‌కు సైతం సంకేతాలిచ్చారు. అయితే మాలేపాటి మరణం తర్వాత కమ్మ సామాజికవర్గం కావ్యకు దూరమైందని బీద వర్గం ప్రచారం చేసిన నేపథ్యంలో, పార్టీ అధిష్టానానికి ఇదే సమాచారం వెళ్లింది. దీంతో కమ్మ సామాజిక వర్గం తనకు దూరం కాలేదని, తనతోనే ఉందని చెప్పడానికి ఆ సామాజికవర్గంలోని కొంత మందిని చేరదీసి తన నివాసంలోనే కమ్మ సంఘం నేతల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం, కావలి అభివృద్ధిలో ఎమ్మెల్యే కావ్య సేవలు అపూర్వమని, ఆయనకే తమ అండదండలని చెప్పించడం ఇప్పుడు బీద వర్గంలో మంట రేపుతోంది.
టీడీపీ క్యాడర్ పరిస్థితి అయోమయం
ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మధ్య ఆధిపత్య పోరు టీడీపీ కేడర్‌ను అయోమయంలోకి నెట్టేసింది. కావలిలో తిరిగి తన ఆధిపత్యం కోసం ఎదురు చూస్తున్న బీదకు మాలేపాటి ఆకస్మిక మరణం అస్త్రంగా మారింది. మాలేపాటి మరణానికి కావ్యనే కారణమనే ప్రచారాన్ని బీద వర్గం చేయడం, ఆయన కర్మక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన కావ్యను వ్యూహాత్మకంగా అడ్డుకోవడంతో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా మారింది. నమ్ముకున్న పారీ్టయే మాలేపాటికి ద్రోహం చేసిందనే ప్రచారం తెరపైకి రావడం, కనీసం పార్టీ అధినేతలు కూడా ఆ కుటుంబాన్ని పలకరించేందుకు రాలేదంటూ వెల్లువెత్తిన విమర్శలు, నిందల నేపథ్యంలో లోకేశ్ దగదర్తికి వచ్చి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కావ్య వల్లే తమ కుటుంబ పరిస్థితి ఇలా అయిందనే కన్నీటి పర్యంతరమయ్యారు. ఇదే సమయంలో కావ్య పెత్తనానికి కత్తెర వేయాలని ఆ కుటుంబ సభ్యులు గట్టిగా కోరడంతోపాటు ఆ సామాజిక వర్గం నుంచి బలమైన ఒత్తిడి రావడంతో లోకేశ్ ఎస్పీ, కలెక్టర్లకు ఎమ్మెల్యే మాటను ఇక నుంచి సీరియస్‌గా తీసుకోవద్దని చెప్పి వెళ్లినట్లు సమాచారం. కావలిలో తన మాట చెల్లుబాటు కాకుండా చేయడంలో బీద ప్రధాన పాత్ర పోషించాడని తెలుసుకున్న ఎమ్మెల్యే తాజాగా చేసిన హెచ్చరికల నేపథ్యంలో టీడీపీ కేడర్ అయోమయంలో పడింది.
ఆధిపత్యపోరు.. తమ్ముళ్ల బేజారు
ఇన్నాళ్లు ఒక నాయకుడిని నమ్ముకుని దందాలు చేసిన టీడీపీ నేతలు.. ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు. టీడీపీ అధిష్టానం బీదకే మొగ్గు చూపిన నేపథ్యంలో ఇకపై కావ్య అనుచరవర్గం ఎవరైనా గీత దాటితే కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఇదే సమయంలో కావ్య కూడా బీద వర్గాన్ని వెంటాడే పరిస్థితులు ఉండడంతో ఎవరు ఎవరి వర్గమని చెప్పుకోవాలంటూ లోలోన మదన పడుతున్నారు. ఇద్దరు నేతలు మండలాల్లో పర్యటనలు చేస్తే ఆ కార్యక్రమాలకు వెళ్లాలా? వద్దా? అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పుడు వీరి పరిస్థితి ‘విడవమంటే పాముకు, కరమంటే కప్పకు కోపం’ అన్న చందంగా మారింది. ఎవరికి మద్దతు ఇస్తే ఎవరు ఆగ్రహిస్తారో అని తమ్ముళ్లు బేజారవుతున్నారు.
నెలల్లోనే మారిన వర్గ రాజకీయాలు
కావ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక తన విజయానికి పాటు పడిన మాలేపాటితో కయ్యానికి కాలు దువ్యారు. ఆ పారీ్టలో కీలక నేతగా ఉన్న బీద రవిచంద్రతోనూ దూరం పెంచుకున్నారు. నియోజకవర్గంలో మాలేపాటితోపాటు బీద మాటను అధికార వర్గాల్లో చెల్లుబాటు కానివ్వకుండా కత్తెర వేశారు. దీంతో మెజార్టీ కేడర్ కావ్య పక్షాన నిలబడింది. బీదకు ఎమ్మెల్సీ పదవి రావడంతో కొంత కేడర్ తిరిగి ఆయన పక్షాన చేరారు. మాలేపాటికి ఏపీ ఆగ్రో ఇండ్రస్టీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడంతో బీద వర్గం మరింత బలపడినట్లు అయింది.


