ఎల్లో మీడియాది అసత్య ప్రచారం 

Bharat Yadav Comments On Yellow Media - Sakshi

2019 మార్చి 14న నేను, సునీల్‌ యాదవ్‌ కలిసే ఉన్నాం  

వైఎస్‌ భాస్కర్‌రెడ్డి ఇంట్లో సునీల్‌ యాదవ్‌ ఉన్నారన్నది అవాస్తవం 

సీబీఐ అధికారులు ఎవరికోసమో తప్పు చేస్తున్నారు 

అసలు తప్పు చేసిన వారిని వదిలేస్తున్నారు 

అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తే నిజాలు బయటకు వస్తాయి 

మీడియాతో భరత్‌ యాదవ్‌ 

పులివెందుల రూరల్‌: 2019 మార్చి 14వ తేదీ రాత్రి సునీల్‌ యాదవ్‌ వైఎస్‌ భాస్కర్‌రెడ్డి ఇంట్లో ఉన్నాడండూ ఎల్లో మీడియా చేస్తున్నది అసత్య ప్రచారమని వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారించిన స్థానిక విలేకరి భరత్‌ యాదవ్‌ చెప్పారు. ఆ రోజు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు తాను, సునీల్‌ యాదవ్‌ పులివెందులలో కడప రోడ్డు సమీపంలోని నందిక ఆసుపత్రి దగ్గర ఉన్నామని స్పష్టంచేశారు.

తనను సీబీఐ అధికారులు విచారించిన సందర్భంలో ఈ విషయాన్ని వారికి స్పష్టంగా చెప్పానని తెలిపారు. సీబీఐ అధికారులు వైఎస్‌ వివేకా హత్య కేసులో ఎందుకు ఇంతలా అవాస్తవాలు వెలుగులోకి తెస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడుగా ఉన్న సునీల్‌ యాదవ్‌ తనకు బంధువని చెప్పారు.

ఆయన వివాహాన్ని బంధువుల అమ్మాయితో తానే జరిపించానన్నారు. చిన్న స్థలం పంచాయితీ విషయంలో సునీల్‌ యాదవ్‌ వివేకానందరెడ్డి దగ్గర ఉండటంవల్ల తాను కూడా ఆయనకు దగ్గరయ్యానన్నారు. వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు తననూ విచారించారని, వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పానని అన్నారు.

సీఐ ర్యాంకు అధికారిణి ఆ విషయాలను అన్ని కోణాల్లో పరిశీలించి నిర్ధారించారన్నారు. వాస్తవాలు దాచి సీబీఐ అధికారులు ఎవరి కోసమో ఏదో తప్పు చేస్తున్నారని అన్నారు. అసలు తప్పు చేసిన వారిని వదిలేస్తున్నారని చెప్పారు. ఒకే కోణంలో కాకుండా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తే నిజాలు బయటకు వస్తాయన్నారు.

తాను పేర్లతో సహా సీబీఐ డైరెక్టర్లకు లేఖ రాశానని, అందులో నిజాలు లేవా అని ప్రశ్నించారు. వారికి అవసరం వచ్చినప్పుడు తన దగ్గర నుంచి సమాధానాలు తీసుకుని కేసును ముందుకు తీసుకెళుతున్నారని, తనను మాత్రం మైనస్‌ చేసి చూపిస్తున్నారన్నారు. తాను ఎవరికీ అమ్ముడుపోలేదని, తనను ఎవరూ పోషించలేదని చెప్పారు. సీబీఐపై ప్రజలకు గౌరవం ఉందని, దానిని వారు కాపాడుకోవాలన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top