Bapatla District: పారిశ్రామికాభివృద్ధికి అడుగులు | Sakshi
Sakshi News home page

Bapatla District: పారిశ్రామికాభివృద్ధికి అడుగులు

Published Thu, Dec 1 2022 6:50 PM

Bapatla District: Tourism and Industrial Development Full Swing - Sakshi

సాక్షి, బాపట్ల: జిల్లాలో తీర ప్రాంతం విస్తరించి ఉండడంతో అటు పర్యాటకం, ఇటు పారిశ్రామికంగా అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఓ వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం సరికొత్త అవకాశాలు కల్పిస్తూ, ప్రోత్సహిస్తుంది. నూతనంగా ఏర్పడ్డ బాపట్ల జిల్లాలో 74 కిలోమీటర్ల తీర ప్రాంతం విస్తరించి ఉంది. సూర్యలంక, పాండురంగాపురం, రామచంద్రాపురం, ఓడరేవు, కృపానగర్, అడవిపల్లెపాలెం బీచ్‌లు పర్యాటకానికి అనువుగా ఉండడంతో తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది పర్యాటకులు వచ్చి సంతోషంగా గడిపి వెళ్తున్నారు. తీరంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తుండడంతో స్టార్‌ హోటళ్లను తలదన్నేలా రిసార్ట్స్‌ వెలుస్తున్నాయి. 

అతిథ్య రంగం కూడా పుంజుకుంటుంది. తీర ప్రాంతం వెంబడి రొయ్యలు, చేపల సాగు విస్తృతంగా చేస్తుండడంతో ఆక్వా పరంగా రొయ్యల హేచరీలు, ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లాలో దాదాపు ఐదు ప్రాసెసింగ్‌ యూనిట్లతోపాటు మరో 18 హేచరీలు ఉన్నాయి. ఆయా యూనిట్లలో వేలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. నిజాంపట్నం ఫిషింగ్‌ హార్బర్, చీరాల పరిధిలోని ఓడరేవు హార్బర్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు రూ.750 కోట్ల వ్యయంతో పనులు చేస్తున్న ఆ ప్రాజెక్టులు పూర్తయితే అనుబంధంగా మరెన్నో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.  

► తాజాగా కేరళకు చెందిన టెడ్‌ఎక్స్‌ ఛాయిస్‌ గ్రూప్‌ విద్యారంగంలో ఎన్నో విజయాలు సాధించిన ఆ సంస్థ జిల్లాలోని తీర ప్రాంతంలో ఆక్వా రంగంలోకి అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. తీరం వెంబడి ఆక్వా ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. దాదాపు రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతుంది. ఆ ప్రాజెక్టు డీపీఆర్‌ కూడా పూర్తిచేసి అనుమతులు కోసం పంపారు. త్వరలోనే ఆ ప్రాజెక్టు రూపకల్పన జరగనుంది. 

► క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవకాశాలు కల్పిస్తున్నాయి. 80 శాతం కేంద్రం, 15 శాతం రాష్ట్రం, 5 శాతం లబ్ధిదారులు వాటాగా ఇస్తూ పరిశ్రమల స్థాపనకు అవకాశాలు కల్పిస్తోంది. దాదాపు రూ.10 కోట్ల వ్యయంతో ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ విధానం అమలులో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంండడంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. బాపట్లలో భావపురి రైస్‌ క్లస్టర్‌ పౌండేషన్‌ ద్వారా రూ.10 కోట్ల వ్యయంతో ధాన్యం ఆరబెట్టే మిషనరీతోపాటు ఫోర్టిఫైడ్‌ బియ్యం తయారీ మిషనరీ ఏర్పాటు చేశారు. 

► ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ ప్రోగ్రామ్‌ ద్వారా కూడా జిల్లాకు 104 ప్రాజెక్టులకుగాను రూ.30.60 కోట్లు మంజూరయ్యాయి. ఆ పథకానికి ఇప్పటికే 80 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 32 మందికి రూ.94.50 లక్షలు మంజూరయ్యాయి. ఇందులో 15 గ్రౌండింగ్‌ అయ్యాయి 


► చీరాల పరిధిలోనే ఈపూరుపాలెం వద్ద ఏపీఐఐసీ ద్వారా ఇండస్ట్రీయల్‌ పార్కు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 44.57 ఎకరాల్లో లే–అవుట్‌ వేసి అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తుంది. స్మాల్‌ ఇండస్ట్రీయల్‌తో ఎంతో మందికి ఉపాధి లభించనున్నది. 

ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది 
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహమిస్తుంది. ఇప్పటికే జిల్లాలో పారిశ్రామికంగా అడుగులు పడుతున్నాయి. తీరంలో ఆక్వా ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు కానున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రవేశపెట్టిన పథకాలు పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడనున్నాయి. 
– ఎన్‌ మదన్‌మెహన్, పరిశ్రమల శాఖ జీఎం, బాపట్ల  

Advertisement
Advertisement