మేనిఫెస్టో పేరిట మరో మోసమా చంద్రబాబూ.. 

Bahujana Parirakshana Samithi Leaders Comments On Chandrababu Naidu - Sakshi

బహుజన పరిరక్షణ సమితి నేతల ధ్వజం 

తాడికొండ: పార్టీలతో సంబంధం లేకుండా జరిగే పంచాయతీ ఎన్నికల్లో మేనిఫెస్టో పేరిట మోసానికి దిగిన చంద్రబాబుకు..ఒకే రాజధాని కావాలని, పేదలకు ఇంగ్లిష్‌ మీడియం, ఇళ్ల స్థలాలు ఇవ్వవద్దని మేనిఫెస్టోలో పెట్టి రిఫరెండంగా ఎన్నికలకు వచ్చే దమ్ముందా అని బహుజన పరిరక్షణ సమితి నాయకులు ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి 122వ రోజుకు చేరాయి. దీక్షలో పలువురు దళిత నేతలు మాట్లాడారు.  పంచాయతీ ఎన్నికల్లో ప్రజలను రెచ్చగొట్టి ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో పగలు రగిల్చేందుకు నిమ్మగడ్డ ఆధ్వర్యంలో చంద్రబాబు కుటిల పన్నాగాలు పన్నుతున్నాడని మండిపడ్డారు.

రాష్ట్ర వ్యాప్తంగా 85 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కులను హరించేలా కోర్టుల్లో చంద్రబాబు అక్రమ కేసులు వేసి అడ్డుకుంటున్న నేపథ్యంలో బాబును ఏపీలో భూ స్థాపితం చేయడం ఖాయమన్నారు. పార్టీ రహిత ఎన్నికలకు చంద్రబాబు పార్టీ మేనిఫెస్టో విడుదల చేసినా నిమ్మగడ్డ చర్యలు తీసుకోకపోవడం ఆయన పక్షపాతానికి నిదర్శనమన్నారు. తెలంగాణలో జీరో అయిన చంద్రబాబును ఏపీలో కూడా ఇక పత్తా లేకుండా చేస్తామని హెచ్చరించారు.  కేంద్ర ప్రభుత్వం, కోర్టులు జోక్యం చేసుకుని, ఎన్నికల కమిషనర్‌ను వెంటనే బదిలీ చేసి బహుజనులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. బహుజన పరిరక్షణ సమితి నాయకులు పెరికే వరప్రసాద్, మాదిగాని గురునాథం, పరిశపోగు శ్రీనివాసరావు, నత్తా యోనారాజు, నూతక్కి జోషి, రుద్రపోగు సురేష్, పలువురు మహిళలు, బహుజన పరిరక్షణ సమితి సంఘాల నాయకులు పాల్గొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top